జగన్ కూడా ఆ పని చేయాలి: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
అమరావతి: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ముందు నుంచీ ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ వస్తోన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో వందశాతం పెట్టుబడులను ఉపసంహరించాలంటూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇక కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవచ్చని పేర్కొన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఇంటరెస్ట్ ప్రక్రియలో పాల్గొనాలని నిర్ణయం తీసుకున్నందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ జేడీ లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా ఈఓఐ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుచూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
ప్రైవేట్ కంపెనీల ప్రవేశాన్ని నిరోధించడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏపీ ప్రభుత్వం కూడా బిడ్డింగ్‌లో పాల్గొనాలని చెప్పారు. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని, దీన్ని తాను మనస్ఫూర్తిగా స్వాగతిస్తోన్నానని అన్నారు. ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునే క్రమంలో బీఆర్ఎస్ మొదటి నుంచీ ఆసక్తిగా ఉంటోందని వ్యాఖ్యానించారాయన.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ గతంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని మాజీ జేడీ లక్ష్మీనారాయణ గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇదే వైఖరిని అనుసరించాల్సి ఉంటుందని సూచించారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే బిడ్ లో పాల్గొనాలని సూచించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ మూలధనం కోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్‌ను జారీ చేసింది. ఈ ప్రక్రియలో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో సింగరేణి లేదా ఖనిజాభివృద్ది సంస్థ తరఫున బిడ్డింగ్‌ను దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే తెలంగాణ అధికారులు విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించే అవకాశం ఉంది.
ఈ బిడ్డింగ్‌లో ఏపీ ప్రభుత్వం పాల్గొంటుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఈ బిడ్డింగ్‌లో పాల్గొంటామంటూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలంటూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తొలి రోజుల్లోనే అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వం కూడా త్వరలోనే ఈఓఐని దాఖలు చేసే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications