మోదీ పథకాలకు జగన్ ఫొటోలా- ఎంతో కాలం సాగనివ్వం: విశాఖ సభలో అమిత్ షా ఫైర్
విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ అగ్రనేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఏపీ పర్యటనకు వచ్చారు. విశాఖపట్నం రైల్వే గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా- తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పర్యటించిన మరుసటి రోజే అమిత్ షా.. విశాఖపట్నానికి రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
వారిద్దరు కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని లక్ష్యంగా చేసుకున్నారు. ఘాటు విమర్శలను సంధించారు. విశాఖ సభలో అమిత్ షా అనేక అంశాలను ప్రస్తావించారు. పాకిస్తాన్‌పై నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్ మొదలుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాల వరకు మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం సాధించిన విజయాలను జనం ముందుంచారు.

వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని అమిత్ షా ఆరోపించారు. జగన్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున అవినీతి, కుంభకోణాల ఆరోపణలు ఉన్నాయని, వాటిపై తమకు ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. జగన్ సాధించింది అవినీతి, కుంభకోణాలు తప్ప మరేమీ లేదని ధ్వజమెత్తారు. వాటికి చరమగీతాన్ని పలకాలని, వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు.
ఏపీలో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్రానికి సంబంధించినవేనని అమిత్ షా అన్నారు. పేదలకు అందజేస్తోన్న బియ్యాన్ని ప్రధాని మోదీ సరఫరా చేసినవేనని, కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న బియ్యంపై జగన్ తన ఫొటో వేసుకుని ప్రచారం చేసుకుంటోన్నాడని అమిత్ షా ధ్వజమెత్తారు. కేంద్రం నుంచి వచ్చిన డబ్బులతో జగన్ ప్రభుత్వం ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ ఆరోపించారు.
జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు దాడి జరిగితే తాము 10 రోజుల్లోనే ప్రతీకారాన్ని తీర్చుకున్నామని అమిత్ షా గుర్తు చేశారు. సర్జికల్ స్ట్రైక్‌తో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పామని అన్నారు. పదేళ్ల యూపీఏ పాలనలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఎక్కడే గానీ అవినీతి చోటు చేసుకోలేదని అమిత్ షా పునరుద్ఘాటించారు.
కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తరువాత ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్‌ను సరఫరా చేసిన ఘనత తమ ప్రభుత్వానికి ఉందని అమిత్ షా అన్నారు. దీనితో ప్రపంచ దేశాలు మోదీ జపం చేస్తున్నాయని పేర్కొన్నారు. మోదీ ఏ ఒక్క పార్టీకో లేక బీజేపీకో చెందిన వ్యక్తి కాదని, ఆయన విశ్వ గురువు అని అమిత్ షా ప్రశంసించారు. ప్రపంచ దేశాలు మోదీని విశ్వగురువుగా భావించడం కోట్లాదిమందికి భారతీయులకు దక్కుతున్న గౌరవని అన్నారు.












Click it and Unblock the Notifications