బట్టలు సరిగా కుట్టలేదని టైలర్ దారుణ హత్య.. విశాఖలో షాకింగ్ ఘటన
అందరూ నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ ఉంటే, ఒక కుటుంబంలో మాత్రం ఊహించని విషాదం చోటు చేసుకుంది. విశాఖపట్నం జిల్లాలో ఎవరూ ఊహించని దారుణ ఘటన ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. క్షణికావేశం ఓ టైలర్ ప్రాణాలను బలిగొంది.
ఒడిస్సా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన బుడు లిమా, భార్య లక్ష్మి, కుమార్తె సుమంత, కుమారుడు సుమన్ తో కలిసి మారికవలసలోని రాజీవ్ గృహకల్పలో జి ఎఫ్ వన్ బ్లాక్ నెంబర్ 104లో నివసిస్తున్నాడు. ఇంటివద్దనే లిమా టైలరింగ్ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. చాలా కాలంగా ఆ ప్రాంతంలో ఉండే వారు లిమా వద్ద బట్టలు కుట్టించుకుంటున్నారు. ఇక లిమా కుటుంబ సభ్యులు కూలినాలి పనులకు వెళుతుంటారు. ఇదిలా ఉంటే బట్టలు కుట్టే లిమా వద్దకు కాలనీలో నివాసం ఉండే గణేష్ అనే వ్యక్తి కొత్త దుస్తులు కట్టించుకోవడానికి వచ్చాడు.

లిమా కొలతలు తీసుకుని మరీ గణేష బట్టలను కుట్టాడు. అయితే లిమా కుట్టిన బట్టలు తన కొలతల ప్రకారం లేకపోవడంతో, ఆగ్రహం వ్యక్తం చేసిన గణేష్ వాటిని తిరిగి సరిచేసి ఇవ్వాల్సిందిగా మళ్లీ వాటిని లిమాకు ఇచ్చి వెళ్ళాడు. అయితే లిమా గణేష్ కు ఇస్తానన్న సమయానికి బట్టలు సరిచేసి ఇవ్వకపోవడంతో గణేష్ కూ లిమాకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో టైలర్ కుమార్తె, అల్లుడు ఇంట్లోనే ఉండటంతో గణేష్ అక్కడి నుండి వెళ్లిపోయాడు. టైలర్ తో వాగ్వాదం సమయంలో మాటా మాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన గణేష్ తన మిత్రుడు క్లింటన్ సూర్యనారాయణతో పాటు మరికొందరిని వెంట తీసుకొని తిరిగొచ్చాడు.
Recommended Video
మళ్లీ గొడవకు దిగి టైలర్ లిమాపై విచక్షణారహితంగా దాడి చేశారు. గుండెలపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో లిమా స్పృహ తప్పి పడిపోయాడు. ఆపై వారు అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లిమాను వారి కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్ కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే లిమా అప్పటికే మృతి చెందినట్లుగా 108 సిబ్బంది తెలియజేశారు. కేవలం కొత్త బట్టలు సరిగా కుట్టలేదని, సమయానికి ఇవ్వలేదన్న క్షణికావేశంలో గణేష్ లిమాపై దాడి చేసి హత్య నేరస్తుడిగా మారాడు. స్నేహితుడి కోసం వచ్చి లిమాపై దాడి చేసిన గణేష్ మిత్ర బృందం అనవసరంగా హత్య కేసులో ఇరుక్కున్నారు.












Click it and Unblock the Notifications