మాజీ ఎంపీ సబ్బం హరి కన్నుమూత: వైఎస్సార్ ముఖ్య అనుచరుడిగా..అల్లు అరవింద్‌పై!
విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సబ్బం హరి కన్నుమూశారు. ప్రాణాంతక కరోనా వైరస్ బారిన పడిన ఆయన కొంతకాలంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. సబ్బం హరి పట్ల వైఎస్సార్సీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ నేతలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు.
కరోనా పాజిటివ్‌గా తేలిన సబ్బం హరి కిందటి నెల 15వ తేదీన విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన చికిత్స పొందుతోన్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి.. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యాన్ని అందించాలని డాక్టర్లను ఆదేశించారు. డాక్టర్లు ఆయనకు అత్యవసర చికిత్సను అందిస్తున్న సమయంలో ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ మధ్యాహ్నం ఆయన తుదిశ్వాస విడిచారు.

సబ్బం హరి.. సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్య అనుచరుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేశారు. అనంతరం 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఘన విజయాన్ని సాధించారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను ఓడించారు.
మాజీ ఎంపీ సబ్బం హరి గారు విశాఖపట్నం ఆరిలోవ అపోలోలో చికిత్స పొందుతూ అనారోగ్యంతో చనిపోవడం బాధాకరం.వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనో ధైర్యం ఇవ్వాలని దేవున్ని నేను ప్రార్ధిస్తున్నాను. pic.twitter.com/vOCwsuCo5E
— S. Vishnu Vardhan Reddy (@SVishnuReddy) May 3, 2021
అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా భీమిలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు చేతిలో ఓటమి చవి చూశారు. వైఎస్సార్ ముఖ్య అనుచరుడిగా గుర్తింపు పొందినప్పటికీ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ వచ్చారు.
తెలుగుదేశం నేత, విశాఖ మాజీ మేయర్, మాజీ ఎంపీ సబ్బం హరిగారి మరణం బాధాకరం. రాజకీయాలలో ఆద్యంతం విలువలకు కట్టుబడి ఉన్న సబ్బం హరిగారి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను pic.twitter.com/rG6PkNZ5LO
— N Chandrababu Naidu (@ncbn) May 3, 2021
సబ్బం హరి పట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయన మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సబ్బం హరి మరణం బాధాకరమని అన్నారు. రాజకీయాలలో ఆద్యంతం విలువలకు కట్టుబడి ఉన్న సబ్బం హరి మృతి రాష్ట్ర రాజకీయాలకు తీరనిలోటుగా పేర్కొన్నారు. సబ్బం హరి నిస్వార్థ రాజకీయాలకు ప్రతీక అని ఆ పార్టీ ఉత్తరాంధ్ర నాయకులు పేర్కొన్నారు. మేయర్‌గా విశాఖపట్నం అభివృద్ధికి ఎంతో కృషి చేశారని చెప్పారు.
తెలుగుదేశం నేత, విశాఖ మాజీ మేయర్, మాజీ ఎంపీ సబ్బం హరి గారు నిస్వార్థ రాజకీయాలకు ప్రతీక. తన భావాలను వ్యక్తపరచడంలో ఎవరికీ భయపడని తత్వం ఆయన సొంతం. నగర మేయర్ గా విశాఖపట్నం అభివృద్ధికి ఎంతో కృషి చేసారు. వారి మృతి తెలుగుదేశానికి తీరని లోటు. pic.twitter.com/JOo1ptBrtl
— Telugu Desam Party (TDP Official) (@JaiTDP) May 3, 2021












Click it and Unblock the Notifications