Vizag Steel : ప్రైవేటీకరణ వేళ మరో గుడ్ న్యూస్ చెప్పిన విశాఖ స్టీల్ ప్లాంట్..
ఏపీలో దశాబ్దాల పోరాటంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన బిడ్ల వ్యవహారం రెండు నెలల క్రితం తీవ్ర చర్చనీయాంశమైంది. ఓ దశలో తెలంగాణ ప్రభుత్వం కూడా బిడ్ వేస్తామంటూ ముందుకొచ్చింది. అయితే సాంకేతిక కారణాలతో ఇది సాధ్యం కాలేదు. అదే సమయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ బిడ్ వేశారు. అలాగే ప్రజలు విరాళాలు ఇస్తే బిడ్ గెల్చుకుందామని కూడా కోరారు.
ఇదంతా జరుగుతున్న తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అందరికీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రైవేటీకరణ కత్తి వేలాడుతున్న వేళ ఖర్చుల నిర్వహణలో సమర్ధత చూపింది. భారీగా ఖర్చులు తగ్గించుకుని ప్రైవేటీకరణ అవసరం లేదనే సంకేతాలు ఇచ్చింది. అంతే కాదు ఈ విషయంలో ఏకంగా జాతీయ అవార్డు కూడా గెల్చుకుంది. 2022 కోసం ప్రకటించిన నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ కాస్ట్ మేనేజ్ మెంట్ అంశంలో జాతీయ అవార్డు సాధించింది. ఈ నెల 23న ఇండియన్ కంప్యూటర్ ఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ సంజయ్ చేతుల మీదుగా విశాఖ ఉక్కు అధికారులు ఈ అవార్డును అందుకున్నారు.

జాతీయ అవార్డు సాధించిన సందర్బంగా మాట్లాడిన విశాఖ ఉక్కు అధికారులు.. కార్మికులు, ఉద్యోగుల కృషితోనే అవార్డులు సాధిస్తున్నట్లు తెలిపారు. ఇదంతా చూస్తుంటే విశాఖ ఉక్కు ప్లాంట్ లో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఏ స్టీల్ ప్లాంట్ అయితే సమర్ధ నిర్వహణ లేని కారణంగా కేంద్రం నష్టాల పేరు చెప్పి ప్రైవేటీకరణకు మొగ్గు చూపిందో అదే ప్లాంట్ ఇప్పుడు సమర్ధ నిర్వహణతో జాతీయ అవార్డు సాధించే స్ధాయికి ఎదగడంపై ప్రశంసలు అందుతున్నాయి.

మరోవైపు కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. నిర్వహణ మెరుగైనప్పటికీ, నష్టాలు తగ్గినప్పటికీ, ఉత్పత్తి పెరిగినప్పటికీ కేంద్రం మాత్రం ప్రైవేటీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించేందుకు సిద్ధం కావడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications