వైనాట్..: జగన్ ముందు కీలక ప్రతిపాదన పెట్టిన సీబీఐ మాజీ జేడీ
అమరావతి: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలపై తెలంగాణలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితి పోరాటం మొదలు పెట్టింది. ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాసిన తరువాత- ఇక్కడి పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. విశాఖపట్నం కేంద్రబిందువుగా బీఆర్ఎస్ ఏపీలో తన కార్యకలాపాలను చేపట్టింది.
ఇక్కడ తొలి సమావేశాన్ని నిర్వహించింది. పలు ప్రాంతాల నుంచి వచ్చిన నేతలు బీఆర్ఎస్‌లో చేరారు ఇవ్వాళ. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ మూడు రోజుల పాటు విశాఖలోనే మకాం వేయనున్నారు. ఆయనకు వైజాగ్ ఎయిర్ పోర్టులో ఏపీ బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగ సంఘాల నాయకులు కూడా తోట చంద్రశేఖర్ కి స్వాగతం పలికారు.

ఈ పరిణామాలపై సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ స్పందించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనలను ఆయన ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ లేఖ రాయడాన్ని కూడా ఆయన స్వాగతించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఇదివరకే కీలక సూచనలు కూడా చేశారాయన.
తాజాగా మరోసారి కీలక ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం ముందు ఉంచారు. విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో ఏపీ చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ క్రమంలో వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటెరెస్ట్) కేంద్ర ప్రభుత్వం జారీ చేసిందని జేడీ లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.
ఈ విషయంలో లక్ష్మీనారాయణ కేరళ ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించదలిచిన హిందుస్తాన్ న్యూస్ ప్రింట్ లిమిటెడ్‌ను కేరళ ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. దీన్ని కేరళ పేపర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌గా బదలాయించిందని, దీనికోసం 146 కోట్ల రూపాయలతో బిడ్స్ దాఖలు చేసిందని పేర్కొన్నారు.
Kerala Govt. took over Central PSU the Hindustan Newsprint Ltd. (HNL) with a ₹146 crore bid & resumed operations as Kerala Paper Products Limited (KPPL) . Why not SAIL/AP & Telangana Govts. participate in EoI before 15/4 to revive RINL? @SAILsteel @ysjagan @KTRBRS @BRSHarish
— V. V. Lakshmi Narayana , A+ (JD) (@VVL_Official) April 9, 2023
అదే విధంగా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీని పునరుద్ధరించడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఎందుకు ముందుకు రావట్లేదని అన్నారు. తక్షణమే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఏపీ లేదా తెలంగాణ ప్రభుత్వాలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటెరెస్ట్)లో పాల్గొనాలని అన్నారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముడి పదార్థాల సరఫరా, ప్లాంట్ నిర్వహణకు అవసరమైన ప్రైవేట్ కంపెనీల ప్రవేశాన్ని నిరోధించడానికి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఏపీ, తెలంగాణ లేదా ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ బిడ్డింగ్ లో పాల్గొనాల్సి ఉంటుందని సూచించారాయన.












Click it and Unblock the Notifications