విశాఖకు వైఎస్ జగన్- విప్లవాత్మక మార్పు: వైవీ
విశాఖపట్నం: సాగర నగరం విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించే విషయంలో మరో ముందడుగు పడబోతోంది. సెప్టెంబర్‌లో విశాఖ నుంచి పరిపాలన సాగించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నానికి ఎయిర్ కనెక్టివిటీని కల్పించడానికి ఉద్దేశించిన భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు.
విజయనగరం- విశాఖపట్నం సరిహద్దులకు ఆనుకుని ఉండే భోగాపురం వద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మే 3వ తేదీన వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. ఉత్తరాంధ్ర ప్రాంతానికే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంధి మల్లికార్జున రావుకు చెందిన జీఎంఆర్ సంస్థకు ఈ ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులను అప్పగించనుంది ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఒప్పందాల ప్రక్రియ కూడా 2019లోనే పూర్తయింది.

ఎయిర్‌పోర్ట్ నిర్మాణంలో భాగంగా- రన్‌వే, కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ అప్రాన్, ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అండ్ టెక్నికల్ బిల్డింగ్, కార్గో బిల్డింగ్, మురుగునీటి శుద్ధి ప్లాంట్, 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానించేలా రోడ్డు నిర్మాణం, కమర్షియల్ డెవలప్‌మెంట్ ఏరియా, కమర్షియల్ అప్రోచ్ రోడ్, సోలార్ ప్యానెల్స్ ఏరియా, ఏవియేషన్ అకాడమీ, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్ హాలింగ్ సౌకర్యాలను అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉంటుంది.

దీనితో పాటు- అదాని డేటా సెంటర్ నిర్మాణ పనులకు కూడా వైఎస్ జగన్ అదే రోజున శంకుస్థాపన చేయనున్నారు. దేశంలో భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్ వినియోగం, నెలవారీ మొబైల్ డేటా ట్రాఫిక్, స్మార్ట్‌ఫోన్ సబ్‌స్క్రైబర్లు, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ లావాదేవీలు, డేటా స్టోరేజీ అండ్ ప్రాసెసింగ్ వంటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని అదాని గ్రూప్ కంపెనీస్ ఈ కేంద్రాన్ని నెలకొల్పనుంది.
ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలను తీసుకుంటోంది. వైఎస్ జగన్ శంకుస్థాపన చేయనున్న ప్రదేశాలు, బహిరంగ సభా ప్రాంగణాలను ఇవ్వాళ వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర జిల్లా కోఆర్డినేటర్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, ఇతర అధికారులతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, అదాని డేటా సెంటర్‌తో పాటు శ్రీకాకుళం జిల్లా మూలపేటలో నిర్మించబోతోన్న పోర్ట్ వల్ల ఉత్తరాంధ్ర ప్రాంత రూపురేఖలు మారిపోతాయని, ఈ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని చెప్పారు. విశాఖలో టెక్నాలజీ పార్కు ద్వారా ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. ఆయా ప్రాజెక్టులన్నీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో కీలకం కానున్నాయని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications