దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడి భార్యకు ఏడేళ్ల జైలు శిక్ష!
దక్షిణ కొరియా మాజీ ప్రథమ మహిళ కిమ్ కియాన్ హీకి స్థానిక న్యాయస్థానం ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అవినీతికి పాల్పడటం, అధికార దుర్వినియోగానికి ఒడిగట్టడం, ప్రభుత్వ నియామకాల కోసం లంచాల రూపంలో ఖరీదైన బహుమతులు స్వీకరించడం వంటి తీవ్ర ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఇప్పటికే షేర్ల ధరల అవకతవకలు, లంచాలు తీసుకున్న మరో కేసులో నాలుగేళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్న 53 ఏళ్ల కిమ్‌కు, ఈ తాజా తీర్పుతో అదనంగా మరో ఏడేళ్ల శిక్ష పడటం ఆ దేశ రాజకీయాల్లో పెద్ద ఎత్తున సంచలనం సృష్టిస్తోంది.
ఈ హైప్రొఫైల్ కేసు తీర్పును కోర్టు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వెల్లడించింది. తన పదవిని, ప్రభావాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు ప్రతిఫలంగా కిమ్ విలువైన వస్తువులను, బంగారు ఆభరణాలను లంచంగా స్వీకరించారని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తి కిమ్ ప్రవర్తనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓ సామాన్య పౌరుడు తన జీవితకాలంలో కనీసం కొనుగోలు చేద్దామని కూడా ఆలోచించలేని అత్యంత విలాసవంతమైన వస్తువులను దేశ ప్రథమ మహిళ హోదాలో ఉండి ఎలాంటి సంకోచం లేకుండా స్వీకరించడం క్షమించరాని నేరమని కోర్టు అభిప్రాయపడింది.

ఉద్యోగాల పేరుతో ఖరీదైన బహుమతుల స్వీకరణ
గతేడాది డిసెంబర్‌లో నమోదైన ఈ కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. నిర్మాణ రంగానికి చెందిన వ్యాపారవేత్త నుంచి కిమ్ 2022లో దాదాపు 10 కోట్ల 30 లక్షల వోన్ల (సుమారు 67,000 డాలర్లు) విలువైన ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్ల ఆభరణాలను లంచంగా పొందారు. 'వ్యాన్ క్లీఫ్ అండ్ ఆర్పెల్స్' నెక్లెస్, 'టిఫనీ' బ్రోచ్, 'గ్రాఫ్' ఇయర్ రింగ్స్ వీటిలో ఉన్నాయి. వీటికి ప్రతిఫలంగా సదరు వ్యాపారవేత్త అల్లుడికి ప్రభుత్వంలో ఒక ఉన్నత పదవి ఇప్పిస్తానని ఆమె హామీ ఇచ్చారు.
కేవలం ఆ వ్యాపారి నుంచే కాకుండా ఓ రాజకీయ నాయకుడి నుంచి కిమ్ దాదాపు 26.5 లక్షల వోన్ల విలువైన బంగారు తాబేలును బహుమతిగా పొందారు. వీటితో పాటు రోబోట్ డాగ్ వ్యాపారంలో ఉన్న ఓ పారిశ్రామికవేత్త నుంచి 3.9 కోట్ల వోన్ల విలువైన 'వాషెరాన్ కాన్‌స్టాంటిన్’ రిస్ట్ వాచ్‌ను కూడా కానుకగా స్వీకరించారు. ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించిన కోర్టు ఆమెను దోషిగా నిర్ధారించింది. విచారణ సమయంలో ప్రభుత్వ ప్రాసిక్యూటర్లు కిమ్‌కు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించాలని కోరగా కోర్టు ఏడేళ్ల శిక్షను ఖరారు చేసింది.
నిందితురాలు కిమ్ విచారణ అంతటా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు. కానుకలు అందుకున్న మాట వాస్తవమే అయినప్పటికీ, దానికి ప్రతిఫలంగా ఎవరికీ ఎలాంటి అధికారికప్రయోజనాలు కల్పించలేదని ఆమె వాదించారు. కానీ కోర్టు ఆమె సమర్థనలను పూర్తిగా నిరాకరించింది. తన భర్త, మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ హోదాను వాడుకునే ఆమె ఈ అక్రమాలకు పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ నిరూపించింది. చిత్రంగా, మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కూడా మార్షల్ లా విధింపు కేసులో ప్రస్తుతం జైలులోనే శిక్ష అనుభవిస్తున్నారు.
జంతు ప్రేమికురాలిగా, కుక్క మాంసం వ్యాపారంపై నిషేధిస్తూ చేపట్టిన ఉద్యమకర్తగా గుర్తింపు పొందిన కిమ్ కియాన్ హీ భర్త పదవీకాలం మొత్తం వివాదాలతోనే సాగింది. ఇప్పుడు వరుస కుంభకోణాల కేసుల్లో శిక్షలు పడటంతో ఆమె భవిష్యత్తు మరింత అంధకారంలో పడింది. ఒకప్పటి దేశ ప్రథమ దంపతులు ఇద్దరూ నేడు కారాగారంలో శిక్ష అనుభవిస్తుండటం దక్షిణ కొరియా రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక పరిణామంగా మిగిలిపోనుంది.












Click it and Unblock the Notifications