రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డ వైసీపీ ఎంపీ: కారు డ్యామేజ్: డిప్యూటీ సీఎం కారులో
విశాఖపట్నం: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తోన్న కారు విశాఖపట్నం జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆయన ఇన్నోవా కారు ముందుభాగం ధ్వంసమైంది. ముందు వెళ్తోన్న కాన్వాయ్‌లోని మరో కారును వెనుక నుంచి ఢీ కొట్టడం వల్లే ఈ ప్రమాదం సంభవించింది. అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి పుష్పా శ్రీవాణి కారులో ఆయన బయలుదేరి వెళ్లారు. ఈ ఘటనతో విశాఖపట్నం వైసీపీ నాయకులు ఉలిక్కిపడ్డారు.
మోపిదేవి వెంకటరమణ, పుష్పా శ్రీవాణి తమ వాహనాల్లో విజయవాడ నుంచి విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లారు. మార్గమధ్యలో తాళ్లపాలెం వద్ద మోపిదేవి కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తోన్న కారు ముందు వెళ్తోన్న కాన్వాయ్‌లోని వాహనం సడెన్ బ్రేకుతో ఆగిపోయింది. దాని వెనుకే వస్తోన్న ఇన్నోవా కారు ఢీ కొట్టింది. ఆ సమయంలో మోపిదేవి ఇన్నోవా కారులోనే ఉన్నారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. ముందు వెళ్తోన్న కారు డ్రైవర్ ఎందుకు సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చిందనే విషయంపై ఆరా తీశారు.

కారు ముందు భాగం ధ్వంసమైంది. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనడానికి మోపిదేవి తన కుటుంబ సభ్యులతో సహా విశాఖపట్నానికి బయలుదేరి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అదే సమయంలో పుష్పా శ్రీవాణి తన కాన్వాయ్‌తో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం ఎలా చోటు చేసుకుందంటూ ఆరా తీశారు. అనంతరం ఆమె మోపిదేవిని తన కారులో ఎక్కించుకుని విశాఖపట్నం వైపు బయలుదేరి వెళ్లారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.












Click it and Unblock the Notifications