షైనింగ్ స్టార్ అవార్డ్ తీసుకుంటా.. సీఎంను మెప్పించిన శివాని సూసైడ్.. షాక్ లో చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఒక చిన్నారి సూసైడ్ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. పోలవరం జిల్లా రంపచోడవరం మండలం ఇర్లపల్లి కొత్త కాలనీలో నివసించే పదోతరగతి విద్యార్థిని ముర్రం శివాని ఆకస్మికంగా ఆత్మహత్యకు పాల్పడింది. నేడు ఉదయం ఆమె ఇంట్లోని షెడ్ లో ఉరి వేసుకుని ప్రాణాలు విడిచింది. అయితే శివాని నాలుగు రోజుల క్రితమే సీఎం చంద్రబాబు సమక్షంలో అద్భుతమైన ప్రసంగం చేసి అందరినీ మెప్పించింది.
వచ్చే ఏడాది షైనింగ్ స్టార్ అవార్డు తీసుకుంటానన్న చిన్నారి శివాని సూసైడ్
చంద్రబాబు సమక్షంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో భాగంగా నిర్వహించిన సభలో వేదికపైన మాట్లాడిన శివాని తన చదువు, భవిష్యత్ లక్ష్యాల గురించి ఎంతో ధైర్యంగా మాట్లాడింది. వచ్చే ఏడాది షైనింగ్ స్టార్ అవార్డు తీసుకుంటానని ఆమె సీఎం చంద్రబాబుతో చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు శివానిని తన పక్కన కూర్చోబెట్టుకుని ప్రశంసించారు. భవిష్యత్ పై ఎన్నో కలలు కన్న శివానీ మృతిచెందటం అందరినీ కలచివేసింది.

ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ రాసిన శివాని
శివాని మరణానికి ముందు ఒక లేఖ రాసింది. ఆ లేఖలో ఆమె తల్లికి సారీ అమ్మా.. నా కోసం నువ్వు చాలా కష్టపడ్డావ్.. మీ కలలు నేను నేరవేర్చలేకపోతున్నా, ఈ బాధ భరించలేకపోతున్నా అంటూ రాసింది. నాన్నా క్షమించు, నేను చనిపోయాక నాపై కోపం తెచ్చుకోకండి. నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండండి అంటూ కోరింది.
షాక్ కు గురైన సీఎం చంద్రబాబు
అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ మీరు కలిసి ఉండండి . ఒకరినొకరు ద్వేషించుకోకండి అంటూ రాసింది. కుటుంబంలో ఉన్న వివాదాల కారణంగా తీవ్ర మనస్తాపం చెందిన శివాని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆమె లేఖ ద్వారా అర్ధం అవుతుంది. ఇక ఈ ఆత్మహత్య ఘటన సీఎం చంద్రబాబును షాక్ కు గురి చేసింది.
శివాని మృతిపై సీఎం చంద్రబాబు ఆవేదన
పోలవరం జిల్లా ఈర్లపల్లికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని తనువు చాలించడం నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. రంపచోడవరంలో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడిన శివాని బలవన్మరణం ఆవేదన కలిగించింది అంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులకు ఆదేశం
ఆ రోజు తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని నాతో చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయి. ఎంతో భవిష్యత్ ఉన్న గిరిజన బిడ్డ ఇలా తనువు చాలించడం బాధాకరం. కారణాలు ఏవైనా తన కలలు నిజం కాకుండానే ఆ విద్యార్ధిని దూరమవ్వడం నన్ను కలిచివేస్తోంది. శివాని మృతిపై పూర్తి దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించానన్నారు. సమస్యలు, కష్టాలు వచ్చినా విద్యార్థులు, యువత ధైర్యంగా నిలబడాలన్నారు.
ఒత్తిడిని, అధిగమించి విద్యార్థులు ముందుకు సాగండన్న సీఎం చంద్రబాబు
ఎవ్వరూ ఒత్తిడికి, నిరాశ, నిస్పృహలకులోను కావొద్దని కోరుతున్నానన్నారు. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీ బాధను, ఆవేదనను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోండి. ఒత్తిడిని, అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండి. ప్రభుత్వం అన్ని విధాలుగా మీకు అండగా ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications