చంద్రబాబుకు నోటీసులపై అచ్చెన్నాయుడు ఫైర్- మాజీ సీఎంపై అట్రాసిటీ కేసులా ?
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు సీఐడీ నోటీసులు జారీ చేయడాన్ని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రంగా తప్పుబట్టారు. అసైన్డ్ భూముల్ని రైతుల ఆమోదంతో తీసుకుని రాజధాని కోసం వాడామని, దీనిపై కేసులు పెట్టడమేంటన్నారు. అసలు దేశ చరిత్రలో ఓ మాజీ సీఎంపై అట్రాసిటీ కేసులు పెట్టిన చరిత్ర ఉందా అని అచ్చెన్న ప్రశ్నించారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఎస్సీనా, ఎస్టీనా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఆయన ఫిర్యాదు చేయగానే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఏ విధంగా కేసు పెడతారన్నారు. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. రాజధానిలో అసైన్డ్ రైతులకు కూడా జరీబు రైతులకు ఇచ్చిన ప్యాకేజీయే ఇచ్చామని ఆయన గుర్తుచేశారు. 2015లో ల్యాండ్ పూలింగ్ జరిగితే ఆరేళ్ల తర్వాత ఇప్పుడు సీఐడీ నోటీసులు అంటూ కేసు పెట్టడం కక్షసాధింపే అన్నారు.

జగన్ రెడ్డి సొంత ప్రయోజనాల కోసం పేదల అసైన్డ్ భూములను వాడుకుంటున్నారని, అసైన్డ్ భూముల్లో ఇళ్లు కట్టుకున్న చరిత్ర ఆయనదని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇళ్ల స్ధలాల పేరుతో వందలాది మంది అసైన్డ్ భూములు లాక్కొన్నారని, దశాబ్దాల తరబడి ఇడుపుల పాయలో అసైన్డ్ భూములు వాడుకున్న చరిత్ర జగన్‌ది అని అచ్చెన్న విమర్శించారు. వాన్‌పిక్ భూములు లాక్కొని రైతులకు పరిహారం నేటికీ ఇవ్వలేదన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అచ్చెన్న మండిపడ్డారు. తాము రాజధాని నిర్మాణం కోసం అసైన్డ్ భూములు తీసుకున్నామని, జగన్ సోలార్ కంపెనీల కోసం అసైన్డ్ భూములు లాక్కోలేదా అని అచ్చెన్న ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications