కంటకాపల్లికి బయలుదేరిన సీఎం జగన్, కీలక ఆదేశాలు - 14కి చేరిన మృతులు..!!
కంటకాపల్లి రైలు ప్రమాదంలో మరణాల సంఖ్య పెరుగుతోంది. 14 మంది మరణించినట్లు అధికారులు నిర్దారించారు. 50 మందికి పైగా గాయపడ్డారు. ఘటనా స్థలికి సీఎం జగన్ వెళ్లనున్నారు. బాధితులను పరామర్శించనున్నారు. రైలు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైలుప్రమాదంపై సీఎం జగన్‌తోరైల్వేమంత్రి ఫోన్‌లో మాట్లాడారు. సహాయక చర్యల వివరాలను మంత్రికి తెలిపారు సీఎం జగన్ వివరించారు.
పెరుగుతున్న మృతులు:విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం పట్టాలపై ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆగి ఉండగా వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 5 బోగీలు పట్టాలు తప్పాయి. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. రైలు ప్రమాద ధాటికి బోగీలు నుజ్జునుజ్జయ్యాయి.

మంత్రి బొత్సా సత్యనారాయణ..అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం సూచించారు.
సహాయక చర్యలపై సీఎం ఆరా:ఈ ప్రమాదంలో 7 బోగీలు పట్టాలు తప్పి నుజ్జు నుజ్జు అయ్యాయి. ఇప్పటి వరకు 14 మంది మరణించినట్లు అధికారులు నిర్దారించారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం అందిస్తామని సీఎం జగన్ ప్రకటించారు.
మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉంటే రూ.2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50వేల చొప్పున సహాయం చేస్తామని ప్రకటించారు. మరోవైపు మృతులకు కేంద్రం తరఫున రూ.10 లక్షల పరిహారం అందిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50,000 అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

ఘటనా స్థలికి సీఎం జగన:50 మందికి పైగా గాయపడ్డారు. బాధితులకు సహాయం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బాధితుల సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157, రైల్వే కార్యాలయంలో 8978080006 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. అలాగే బాధితులకు సంబంధించి సమాచారం కోసం..
0891 2746330, 0891 2744619 నెంబర్లకు ఫోన్ చేయాలని రైల్వే అధికారులు సూచించారు. ప్రమాదం కారణంగా ఈ లైన్ లో పలు రైళ్లను రద్దు చేసారు. అటు సీఎం జగన్ కాసేపట్లో ఘటనా స్థలికి రానుండటంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి ఘటన పై విచారణకు అధికారులు ప్రమాద స్థలికి చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications