నారా లోకేష్- ఇంకో పది రోజులే..!!
కాకినాడ: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రస్తుతం కాకినాడ జిల్లాలో సాగుతోంది. రెండు రోజుల కిందట జిల్లాలోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గల పొన్నాడ శీలంవారి పాకలు వద్దకు చేరుకుంది. మిఛాంగ్ తుఫాన్ ప్రభావంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది.
జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎన్ వర్మ.. ఆయన వెంట పాదయాత్రలో పాల్గొంటోన్నారు. తుఫాన్ ప్రభావం తగ్గిన తరువాత నారా లోకేష్ పాదయాత్రను పునరుద్ధరించనున్నారు. నేడో, రేపో ఈ జిల్లా నుంచే పాదయాత్ర పునఃప్రారంభమౌతుంది.

ఈ నెల 17వ తేదీన విజయనగరం జిల్లాలో పాదయాత్రను ముగించనున్నారు నారా లోకేష్. జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం పరిధిలోని భోగాపురం మండలంలోని పోలిపల్లి వద్ద భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అక్కడే పాదయాత్ర పైలాన్‌ను ఆవిష్కరించనున్నారు.
విశాఖపట్నం, భీమిలి మీదుగా నారా లోకేష్ పోలిపల్లికి చేరుకుంటారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఈ సభకు హాజరవుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ- జనసేన ఉమ్మడిగా తమ బలాన్ని నిరూపించుకోబోతోన్నాయని స్పష్టం చేస్తోన్నాయి.
బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, వెలగపూడి రామకృష్ణ బాబుతో పాటు బండారు సత్యనారాయణ మూర్తి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పార్టీ అధ్యక్షులు పరిశీలించారు. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల నుంచి భారీ ఎత్తున జనాన్ని సమీకరించడానికి టీడీపీ ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications