20 ఏళ్ల తర్వాత మాఘశుద్ద పౌర్ణమి.. ఈ సారి సమ్మక్క సారాలమ్మ జాతర స్పెషల్
ఆసియాలో గిరిజన జాతర.. మేడారం మహాజాతర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో మేడారం జనసంద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే. రెండేళ్లకు ఒకసారి జరిగే నజాతరలో రెండు దశాబ్ధాల తర్వాత అద్భుత ఘట్టం జరిగింది. 20 ఏళ్లలో మాఘశుద్ధ పౌర్ణమి రోజు మహాజాతర ప్రారంభమవ్వడం ఇదే తొలిసారి కావటం విశేషం. దీంతో గతంకంటే భక్తులు అధికంగా తరలివస్తున్నారు. కరోనా గైడ్ లైన్స్ పాటిస్తూ వన దేవతలను దర్శించుకుంటున్నారు.
రెండో రోజు కూడా భక్తులు అత్యంత భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా మేడారం వన జాతరకు భక్తులు భారీగా తరలివస్తుంటారు. జాతరలో రెండో రోజు కీలకఘట్టం సమ్మక్క ఆగమనం. చిలుకలగుట్ట దిగి ఇవాళ సాయంత్రం గద్దెపైకి సమ్మక్క వచ్చింది. కుంకుమ భరిణె రూపంలో అమ్మవారు తరలివచ్చి భక్తులకు కనువిందు చేస్తున్నారు.

శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్లు, మేళతాళాలు, ప్రభుత్వ లాంఛనాలతో.. పటిష్ఠ బందోబస్తు మధ్య సమ్మక్కను చిలుకలగుట్ట నుంచి గద్దెపైకి తీసుకువచ్చారు. ఆ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా పోటెత్తారు. అమ్మవారి ఆగమనం సమయంలో కోరుకునే కోర్కెలు తప్పక తీరతాయని భక్తుల నమ్ముతారు. తల్లి రాకకు గౌరవ సూచకంగా జిల్లా ఎస్పీ గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు జరిపి.. అమ్మకు గౌరవ వందనం సమర్పిస్తారు.
బుధవారం రోజున సమ్మక్క తల్లి కుంకుమ భరిణె రూపంలో దేవతగా అవతరించింది. అందుకే ఆదివాసీలు ఆ మాఘశుద్ధ పౌర్ణమి రోజును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అదే రోజే జాతర ప్రారంభించడం చాలా సందర్భాల్లో వీలుకాదని సమ్మక్క ఆలయ పూజరి కొక్కెర రమేశ్ తెలిపారు. ప్రతిసారి బుధవారం జాతర ప్రారంభించడం మేడారంలో ఆనవాయితీగా వస్తోంది. మాఘశుద్ధ పౌర్ణమి, బుధవారం ఒకే రోజు రావడం చాలా అరుదుగా జరుగుతుందని అన్నారు. ఈ సారి అలా జరిగింది. కరోనా మార్గదర్శకాలు పాటిస్తూ.. వనదేవతలను భక్తులు దర్శించుకుంటున్నారు. తమ కోరిక నెరవేరాలని కోరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications