Warangal: వరంగల్ జిల్లాకు భారీ వర్షసూచన.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిన అధికారులు..
సోమవారం రాత్రి నుంచి తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా మహబాబుబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే వరంగల్ జిల్లాలో తెలిపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నల్లబెల్లిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. దుగ్గొండిలో 5, వరంగల్ లో 4.6, నర్సంపేటలో 3.6, చెన్నారావుపేటలో 2.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.
అయితే అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికతో వరంగల్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గ్రేటర్ మున్సిపల్ ఆఫీస్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసింది. ఉద్యోగులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటుంది. అత్యవసర పరిస్థితులు ఎదురైతే.. 18004251980 లేదా 9701999645 ఫోన్ చేయవచ్చని.. 7997100300 వాట్సప్ చేయ్యొచ్చని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవారిని అలర్ట్ చేశారు. భారీ వర్షం కురిస్తే నీరు వెళ్లిపోయేలా చర్యలు తీసుకుంటున్నారు.

మిగతా జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ సహా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రానున్న 48 గంటల్లో హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని తెలిపింది. హైదరాబాద్ లో మాత్రం తేలిపాటి నుంచి మోస్తరు వర్షాలు పడేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు తాడ్వాయి, మాచారెడ్డి, దోమకొండ, బీబీపేట్, బిక్కనూర్ సదాశివనగర్ మండలాల్లో భారీ వర్షం పడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో వానతో సింగరేని ఓపెన్ కాస్ట్ 2,3 గనుల్లోకి వరదనీరు భారీగా పోయింది. దీంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications