ఓరుగల్లును వదలని వాన ... మళ్ళీ కుండపోతగా .. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఇలా !!
తెలంగాణా రాష్ట్రాన్ని వరుణుడు వదలడం లేదు . రాష్ట్రంలో భానుడు కనపడక చాలా కాలమైంది అని ప్రజలు తెగ బాధపడుతున్నారు. రాత్రనక పగలనక ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. ఒక వారం పాటు విస్తారంగా కురిసిన వర్షాలు కాస్త శాంతించాయి అనుకునేలోపే మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లతోపాటు పలు జిల్లాలను వరదలు ముంచెత్తుతున్నాయి.
తెలుగు రాష్ట్రాలకు తప్పని వాన గండం.. మరో మూడు రోజుల పాటు వర్ష సూచన

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం .. ఓరుగల్లును మళ్ళీ ముంచుతున్న వాన
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, అది వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటికి మొన్న అతి భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ఓరుగల్లు ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనుకుంటే మళ్లీ ఓరుగల్లును వర్షం ముంచెత్తుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.

ప్రమాదకరంగా చెరువులు ... రహదారిపైకి రామప్ప నీరు .. పలు గ్రామాలకు రాకపోకలు బంద్
ఇటీవల కురిసిన వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్లీ వర్షం కురుస్తుండటంతో ఏం జరుగుతుందన్న ఆందోళన ఉమ్మడి జిల్లా వాసులకు కలుగుతుంది. గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు మళ్లీ జలమయమయ్యాయి. వరంగల్ లో మరోసారి నాలాలు పొంగి ప్రవహిస్తున్నాయి. రామప్ప చెరువు మత్తడి వద్ద నీటి ఉధృతి పెరిగింది. ములుగు, జంగాలపల్లి మధ్య రామప్ప చెరువు రహదారిని ముంచేసింది. జంగాలపల్లి గ్రామాన్ని ముంపుకు గురి చేసింది. నర్సంపేట, నెక్కొండ ప్రధాన రహదారిపై వరద కారణంగా నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు .. లోతట్టు ప్రాంతాలు జలమయం
ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రమే కాకుండా ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో నేడు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. శుక్రవారం కూడా మోస్తరు వానలు పడవచ్చని చెప్పింది. బుధవారం కొమురం భీం , మంచిర్యాల, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు పడ్డాయి. మంచిర్యాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేమనపల్లి ,భీమిని, కోటపల్లి కన్నెపల్లి మండలాల్లోని పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఉధృతంగా గోదావరి , ప్రాణహిత నదులు ...నేడు, రేపు వర్షాలు
వరద ఉధృతి కారణంగా ప్రాణహిత గోదావరి నదులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి.
నిన్న నమోదైన వర్షపాతం వివరాలు చూస్తే అత్యధిక వర్షపాతం కొమురం భీం జిల్లా లో నమోదైంది. కొమురం భీం జిల్లా లోని అనకాపల్లిలో 13.3 సెంటీమీటర్లు, మంచిర్యాలలోని భీమిలిలో 12.7 సెంటీమీటర్లు, కన్నెపల్లిలో 10 సెంటీమీటర్లు, కొమురం భీం జిల్లా లోని రెబ్బనలో 9.6 సెంటీమీటర్లు, ములుగు లోని వెంకటాపురంలో 7.9 సెంటీమీటర్లు, మంచిర్యాలలోని నీల్వాయిలో 7.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఇక నేడు కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలోనేడు, రేపు వర్షాలు కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.