వరంగల్ అర్బన్,వరంగల్ రూరల్ జిల్లాల పేర్లు మార్పు... తుది నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం...
వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా, వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్ జిల్లాగా మార్చుతూ తెలంగాణ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ విడుదల చేసింది. 12 మండలాలతో హన్మకొండ జిల్లా, 15 మండలాలతో వరంగల్ జిల్లాను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, స్టేషన్ ఘన్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ధర్మసాగర్ మండలం, పరకాల నియోజకవర్గానికి చెందిన పరకాల, నడికుడ, దామెర మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కమలాపూర్ గ్రామాలను చేర్చారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ఐనవోలు, హసన్‌పర్తి మండలాలు కూడా హన్మకొండ జిల్లాలోనే కలిశాయి.
వరంగల్ జిల్లా విషయానికి వస్తే... ప్రస్తుత వరంగల్ నియోజకవర్గం మొత్తం దీని పరిధిలోనే ఉంటుంది. పరకాల నియోజకవర్గానికి చెందిన గీసుగొండ, ఆత్మకూరు, శాయంపేట, సంగెం మండలాలు, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వర్ధన్నపేట, పర్వతగిరి, పాలకుర్తి నియోజకవర్గం నుంచి రాయపర్తి, నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ వరంగల్ జిల్లాలో ఉన్నాయి. వరంగల్ జిల్లాలో వరంగల్, పరకాల రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి.

హన్మకొండ జిల్లా ఏర్పాటుపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తి మేరకు సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా హన్మకొండ జిల్లా ఏర్పాటుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దీనిపై అభ్యంతరాలు, సలహాలు కోరుతూ గత నెల 12న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసింది. ఈ నోటిఫికేషన్ గడువు ఈ నెల 10వ తేదీన ముగిసింది. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం జిల్లాల పేర్ల మార్పుపై తుది నోటిఫికేషన్ విడుదల చేసింది.
హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. హన్మకొండ జిల్లాలో రెండు రెవెన్యూ డివిజన్లు, ఆరు నియోజకవర్గాలు ఉన్నాయి. వరంగల్ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లు (వరంగల్, నర్సంపేట) ఉన్నాయి.
హన్మకొండ జిల్లా-మండలాల వివరాలు :
హన్మకొండ, కాజీపేట, ఐనవోలు, హసన్‌పర్తి, వేలేరు, ధర్మసాగర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి, కమాలాపూర్, పరకాల, నడికూడ, దామెర. మొత్తం 12 మండలాలు.
వరంగల్ జిల్లాలోని మండలాలు :
వరంగల్, ఖిలావరంగల్, గీసుగొండ, ఆత్మకూరు, శాయంపేట, వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, సంగెం, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపూర్, నెక్కొండ.మొత్తం 15 మండలాలు.












Click it and Unblock the Notifications