కోర్టులో తేల్చుకుందాం: సీఐడీ నోటీసులపై న్యాయపోరాటం: ఏలూరుకు చంద్రబాబు
అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో అనూహ్య పరిణామాల మధ్య ఏపీ సీఐడీ నుంచి నోటీసులను అందుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. సీఐడీ ఇచ్చిన నోటీసులపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. ఈ నెల 23న సీఐడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ లోపే కోర్టును ఆశ్రయించాలని, స్టే తెచ్చుకోవాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఈ మేరకు హైకోర్టులో ఒకట్రెండు రోజుల్లో పిటీషన్ దాఖలు చేసే అవకాశాలు లేకపోలేదు.
సీఐడీ ఇచ్చిన నోటీసుల వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు రాజకీయ కోణంలో చూస్తోన్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు నోటీసులను ఇచ్చిన వెంటనే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సహా పలువురు మాజీమంత్రులు స్పందించారు. దీన్ని రాజకీయ కక్షసాధింపు చర్యగా ఆరోపిస్తోన్నారు. ఇదే విషయాన్ని న్యాయస్థానంలోనూ వివరించాలని భావిస్తున్నారు. దీనికి అనుగుణంగా పిటీషన్‌ను రూపొందించడంపై దృష్టి సారించారు.

అమరావతి భూముల కుంభకోణంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ లేదంటూ ఇదివరకు హైకోర్టు వెలిబుచ్చిన అభిప్రాయాలు, జారీ చేసిన ఉత్తర్వులు, మీడియాలో ప్రచురితమైన కథనాలతో కూడిన క్లిప్పింగ్‌లను పిటీషన్‌కు జత చేయాలని భావిస్తున్నారు. అలాగే- ఈ కేసులో దర్యాప్తు జరపడంపై ఏపీ హైకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చిందని, దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయాన్ని టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. సుప్రీంకోర్టులో విచారణ పెండింగ్‌లో ఉన్న దశలో నోటీసులను జారీ చేయడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఆయా అంశాలన్నింటినీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లి.. స్టే తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఈ పరిణామాల మధ్య చంద్రబాబు ఈ మధ్యాహ్నం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు వెళ్లనున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి బాబు కుటుంబాన్ని ఆయన పరామర్శిస్తారు. మాగంటి బాబు తనయుడు మాగంటి రాంజీ కొద్దిరోజుల కిందటే కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన సంతాపసభకు చంద్రబాబు హాజరవుతారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఏలూరు వెళ్తారు. మాగంటి బాబు నివాసానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం రాంజీ సంతాప సభకు హాజరవుతారు.