తగ్గేదేలేదంటోన్న పవన్ కల్యాణ్: ఎల్లుండే..
Pawan Kalyan: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో.. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ పర్యటనలను ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఆయన విశాఖపట్నం జిల్లాలో పర్యటిస్తోన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాల పార్టీ నేతలతో సమావేశం అయ్యారు.
ఆదివారం రాత్రి విశాఖపట్నానికి చేరుకున్నారు. అనకాపల్లి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజక వర్గాలకు చెందిన పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. దశలవారీగా ఇన్‌ఛార్జీలు, అభ్యర్థులను నియమించాల్సి ఉన్నందున జనాదరణ ఉన్న నేతల గురించి ఆరా తీస్తోన్నారు.

ఈ క్రమంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణతోనూ భేటీ అయ్యారాయన. ఆయన నివాసానికి వెళ్లి మర్యాదపూరకంగా కలిశారు. అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా కొణిదెల నాగబాబు పోటీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతున్న నేపథ్యంలో కొణతాలతో పవన్ కల్యాణ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాల సమీక్ష సమావేశాలు ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్.. పశ్చిమ గోదావరి జిల్లాలో అడుగు పెట్టబోతోన్నారు. ఈ నెల 21వ తేదీన భీమవరానికి రానున్నారు. విశాఖపట్నం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో భీమవరం చేరుకుంటారు.
నిజానికి- ఈ నెల 14వ తేదీ నాడే పవన్ కల్యాణ్ భీమవరానికి రావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో అది వాయిదా పడిన విషయం తెలిసిందే. ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో నాలుగు రోజుల పాటు పర్యటించాలని ముందే ప్లాన్ చేసుకున్నప్పటికీ.. హెలికాప్టర్ దిగడానికి అధికారులు అనుమతులు ఇవ్వలేదనే కారణంతో వాయిదా వేసుకున్నారు.
ఇప్పుడు మరోసారి ఆయన హెలికాప్టర్ ద్వారానే భీమవరం చేరుకోబోతోండటం ఆసక్తి రేపుతోంది. హెలికాప్టర్ ల్యాండ్ కావడానికి అవసరమైన అనుమతుల కోసం జిల్లా పార్టీ నాయకులు.. రహదారులు- భవనాల మంత్రిత్వ శాఖ అధికారులను కోరినట్లు చెబుతున్నారు. అనుమతులు లభించాయా? లేదా? అనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications