వీడియో: మహిళలపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు దౌర్జన్యం - సెల్ ఫోన్ లాక్కుని
ఏలూరు: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకొల్లు శాసన సభ్యుడు నిమ్మల రామానాయుడు వివాదాల్లో చిక్కుకున్నారు. బస్సులో ప్రయాణిస్తోన్న మహిళలపై ఆయన దౌర్జన్యానికి దిగారు. ఓ మహిళ చేతి నుంచి సెల్‌ఫోన్‌ను సైతం లాక్కున్నారు. దాన్ని కింద పడేయడానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిమ్మల రామానాయుడి వైఖరిపై అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మండిపడుతున్నారు.

పాలకొల్లులో..
అమరావతి ప్రాంత రైతుల పాదయాత్ర సందర్భంగా ఆదివారం పాలకొల్లులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది నిమంమల రామానాయుడి సొంత నియోజకవర్గం. రైతుల పాదయాత్ర 28వ రోజుకు చేరుకుంది. ఉదయం పాలకొల్లులోని బ్రాడీపేట నుంచి రైతుల పాదయాత్రగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లికి బయలుదేరారు. ఆ సమయంలో భారీ వర్షం పడినప్పటికీ లెక్కచేయలేదు. వర్షంలోనే పాదయాత్రను కొనసాగించారు.

టీడీపీ కార్యకర్తల ఘన స్వాగతం..
తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం కావడం వల్ల.. రైతులకు పెద్ద ఎత్తున స్వాగతం లభించిందక్కడ. పాదయాత్ర రథానికి స్థానికులు పూజలు చేశారు. పూలు చల్లి స్వాగతం పలికారు. అమరావతిని మాత్రమే ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ నినాదాలు చేశారు. మూడు రాజధానుల వ్యవస్థకు మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్వయంగా పాదయాత్రకు స్వాగతం పలికారు.

ట్రాఫిక్ జామ్..
ఈ సందర్భంగా పాలకొల్లులో పెద్ద ఎత్తున వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఆర్టీసీ బస్సులను కూడా తిరగనివ్వలేదు. చాలాసేపటి వరకు వాహనాలు కదల్లేదు. దీనితో బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. పాదయాత్రపై విమర్శలు చేశారు. బస్సులు, వాహనాలను వెళ్లనివ్వాలంటూ పట్టుబట్టారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులతో వాగ్వివాదానికి దిగారు. పాదయాత్ర ఎందుకు చేస్తోన్నారంటూ నిలదీశారు.
బస్సులో ప్రయాణికులపై..
ఆ సమయంలో అక్కడే ఉన్న నిమ్మల రామానాయుడు ఆగ్రహోదగ్రుడయ్యారు. ఏకంగా బస్సులో ఎక్కి మహిళా ప్రయాణికులపై దౌర్జన్యానికి దిగారు. ఒక దశలో ఆయన తన సహనాన్ని కోల్పోయారు. నువ్వు ఆడదానివా.. అంటూ ఓ మహిళపై దూసుకెళ్లడం కనిపించింది. ముందు సీట్లో కూర్చున్న ఓ మహిళ చేతి నుంచి సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. దాన్ని కింద పడేయడానికి ప్రయత్నించగా.. ఆమె ఎమ్మెల్యే చేతిని పట్టుకుని వెనక్కి లాగడం కనిపించింది.