వరల్డ్ కప్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్- 4 లక్షల టికెట్లు: బుకింగ్ లింక్ ఇదే
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో పర్యటిస్తోంది. ఆసియా కప్ 2023 టోర్నమెంట్‌ను ఆడుతోంది. ఇప్పటికే సూపర్ 4 దశకు చేరుకుంది టీమిండియా. 10వ తేదీన తన దాయాది పాకిస్తాన్‌ను ఢీ కొట్టబోతోంది. లీగ్ దశలో ఈ రెండు జట్లు తలపడిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కాగా.. సూపర్ 4లో మరోసారి ఫేస్ టు ఫేస్ తేల్చుకోబోతోన్నాయి.
దీని తరువాత 12వ తేదీన భారత జట్టు శ్రీలంకతో తలపడుతుంది. 14వ తేదీన శ్రీలంక- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. 15వ తేదీన జరిగే చివరి మ్యాచ్‌లో భారత్- బంగ్లాదేశ్‌ను ఢీ కొడుతుంది. సూపర్ 4 మ్యాచ్‌లన్నీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలోనే జరుగనున్నాయి. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్‌లు ఆరంభమౌతాయి. అన్నీ డే/నైట్ మ్యాచ్‌లే.

దీని తరువాత టీమిండియా ప్రపంచ కప్ 2023 టోర్నమెంట్‌కు సన్నద్ధమౌతుంది. అక్టోబర్ 8వ తేదీన టీమిండియా తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. బలమైన ఆస్ట్రేలియాతో తలపడుతుంది. 11వ తేదీన రెండో మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఢీ కొడుతుంది. ఆ తరువాత జరిగే గేమ్‌లో అంటే.. తన మూడో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది రోహిత్ సేన.
ఈ మ్యాచ్‌కు గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. దీని తరువాత బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్‌లతో తలపడుతుంది. నెదర్లాండ్స్‌తో భారత్ ఆడబోయే మ్యాచ్.. లీగ్ దశలో చిట్ట చివరిది. నవంబర్ 12వ తేదీన ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఆ తరువాత నవంబర్ 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
ఇప్పటికే వరల్డ్ కప్ 2023 కోసం టికెట్ల విక్రయాలను ప్రారంభించింది బీసీసీఐ. హాట్ కేకుల్లా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. బ్లాక్‌లో లక్షల రూపాయలను పెట్టి ఎగబడి మరీ కొంటోన్నారు క్రికెట్ ప్రేమికులు. అత్యధికంగా భారత్- పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు పట్ట పగ్గాల్లేకుండాపోతున్నాయి. బ్లాక్‌లో 50 లక్షల రూపాయల వరకు పలుకుతోంది ఒక్కో టికెట్ ధర.
ఈ పరిస్థితుల్లో బీసీసీఐ కోట్లాది మంది అభిమానులకు తీపి కబురు ఇచ్చింది. మలి దశలో నాలుగు లక్షల టికెట్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లతో చర్చించిన తరువాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మలి విడతలో నాలుగు లక్షల టికెట్లను ఆన్‌లైన్, ఇతర మార్గాల ద్వారా విక్రయిస్తామని తెలిపింది.
అన్ని మ్యాచ్‌ల టికెట్ల విక్రయాలు 8వతేదీన రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమౌతాయి. అధికారిక టికెటింగ్ వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అభిమానులు వాటిని కొనుగోలు చేయవచ్చు. వెబ్‌సైట్.. https://tickets.cricketworldcup.com ఈ టికెట్లు అమ్ముడుపోయిన తరువాత మరో విడత విక్రయాలపై నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది.












Click it and Unblock the Notifications