టీమిండియా ఘోర పరాజయంపై బీసీసీఐ చీఫ్ సంచలనం

డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో భారత్ ఓడిపోవడం వరుసగా ఇది రెండోసారి. 2021 ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా నిర్దేశించిన 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా నాలుగో రోజే తడబడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, వన్ డౌన్ బ్యాటర్ చేతేశ్వర్ పుజారా వికెట్లను కోల్పోయింది. మూడు వికెట్ల నష్టానికి 163 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో చివరి రోజు బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా పరాజయం తొలి గంటలోనే ఖరారైంది.
ఇవ్వాళ ప్రారంభంలోనే విరాట్ కోహ్లీ అవుట్ అయ్యాడు. 44 పరుగుల తన వ్యక్తగత ఓవర్‌నైట్ స్కోర్‌కు ఇంకో అయిదు రన్స్ మాత్రమే జత చేసిన కోహ్లీ.. బోలాండ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యడు. వికెట్లకు దూరంగా వెళ్తోన్న బంతిని డ్రైవ్ చేయబోయిన కోహ్లీ.. టైమింగ్ మిస్ అయ్యాడు. ఎడ్జ్ తీసుకున్న బంతి స్లిప్స్ వైపు దూసుకెళ్లింది. సెకెండ్ స్లిప్‌లో ఉన్న స్టీవెన్ స్మిత్.. కుడివైపున డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నాడు. అప్పటికి జట్టు స్కోర్ 179.
అక్కడ ఆరంభమైన వికెట్ల పతనానికి ఎక్కడా బ్రేకులు పడలేదు. 50 పరుగుల్లోపు మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది టీమిండియా. కోహ్లీ స్థానంలో క్రీజ్‌లోకి దిగిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తన ఖాతాను కూడా తెరవలేదు. సున్నా పరుగులకు అవుట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు పడటంతోనే భారత్ పరాజయం దాదాపుగా ఖాయమైంది. అజింక్య రహానె- వికెట్ కీపర్ కేఎస్ భరత్ కొద్దిసేపు బౌలర్లను ప్రతిఘటించే ప్రయత్నం చేశారు.
అయిదో వికెట్‌కు 32 పరుగులను జోడించారు. రహానె-43, కేఎస్ భరత్- 23 వెంటవెంటనే అవుట్ కావడంతో పరాజయం ఖరారైంది. ఆ తరువాత వచ్చిన ఉమేష్ యాదవ్-0, మహ్మద్ సిరాజ్-1 పరుగులు చేశారు. మహ్మద్ షమీ- 13 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
స్పిన్నర్ నాథన్ లియాన్-4, బోలాండ్-3, స్టార్క్-2, పాట్ కమ్మిన్స్-1 వికెట్ పడగొట్టారు.
ఈ ఓటమిపై భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధ్యక్షుడు రోజర్ బిన్నీ స్పందించారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఓవల్ స్టేడియం వద్ద ఏఎన్ఐతో మాట్లాడారు. మ్యాచ్ తొలి రోజే ఆస్ట్రేలియాకు సరెండర్ అయ్యామని వ్యాఖ్యానించాడు. ఓడిపోతున్నామనే విషయం తొలి రోజే అర్థమైపోయిందని, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్‌లో భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పిందని, అదే మ్యాచ్‌ను మలుపు తిప్పిందని పేర్కొన్నారు.
మున్ముందు మరిన్ని భారీ టోర్నమెంట్లు ఉన్నాయని, ఈ ఓటమి నుంచి త్వరగా కోలుకుంటామని రోజర్ బిన్ని ధీమా వ్యక్తం చేశారు. స్వదేశంలో జరిగే వరల్డ్ కప్ టోర్నమెంట్ నాటికి ప్లేయర్లు ఆత్మ విశ్వాసాన్ని అందుకుంటారని, బ్యాటింగ్ రిథమ్‌ను అందిపుచ్చుకుంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఇక తమ దృష్టి మొత్తం ఈ ఏడాది జరిగే ప్రపంచకప్‌పై ఉందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications