ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై టీవీ ప్రయోక్త పాల్ హెన్రీ చేసిన జాత్యాహంకార వ్యాఖ్యల వివాదం ముగిసిపోక ముందే మరో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈసారి భారత సంతతికి చెందిన గవర్నర్ జనరల్ ఆనంద్ సత్యానంద్ లక్ష్యంగా మారారు. న్యూజిలాండ్‌కు చెందిన ఓ రేడియో కార్యక్రమ నిర్వాహకుడు మైఖేల్‌లాస్ ఆయనపై వివక్షపూరితమైన జోకులు వేశారు. ''సత్యానంద్ కొవ్వుపట్టిన భారీకాయుడు. అతని శరీరాకృతి సాధారణ భారతీయులతో సరిపోలడంలేదు. ఢిల్లీ వీధుల్లో భారతీయులు బిచ్చమెత్తుకుంటారని భావించలేను. అయితే సత్యానంద్ అక్కడ భోజనబల్ల వద్ద స్థిరపడిపోయాడు. 20ఏళ్ల కుర్రవాడిలా అక్కడ నుంచి లేవలేదు'' అంటూ మైఖేల్ వర్ణించారు. ఇవీ షీలాదీక్షిత్‌పై హెన్రీ అనుచితంగా వ్యాఖ్యలు చేసిన గతవారమే ప్రసారమయ్యాయి. ఈ విషయాన్ని 'ద న్యూజిలాండ్ హెరాల్డ్' వెల్లడించింది.