న్యూఢిల్లీ : ప్రవాసాంధ్రుడు ప్రసాద్ తోటకూర 2010 వ సంవత్సరానికి ప్రతిష్టాత్మక 'భారత్ గౌరవ్' అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కింద అవార్డుతో పాటు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ అందజేస్తారు. ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్న ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ (ఐఐఎఫ్ఎస్) ఈ అవార్డును లబ్ధ ప్రతిష్టులకు ప్రతి ఏటా అందజేస్తుంది. డల్లాస్ లో ఉంటున్న ప్రవాసాంధ్రుడు ప్రసాద్ తోటకూర అమెరికాలోని భారతీయులకు పలు విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా ఈ సంవత్సరం 'భారత్ గౌరవ్ అవార్డు'ను అందజేస్తున్నట్లు ఐఐఎఫ్ఎస్ ప్రధాన కార్యదర్శి గుర్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. వచ్చే జనవరి 7వ తేదీన ఢిల్లీలో గ్లోబల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా కన్నుల పండువగా నిర్వహించే కార్యక్రమంలో ఈ అవార్డును ప్రసాద్ తోటకూరతో పాటు ఈ అవార్డుకు ఎంపికైన ఇతరులకు కూడా అందజేస్తున్నట్లు గుర్ ప్రీత్ సింగ్ తెలిపారు.
ప్రసాద్ తోటకూర అమెరికాలోని ప్రవాస భారతీయులకు గత పదిహేను సంవత్సరాలుగా విశేష సేవలు అందిస్తున్నారు. ఈ కామర్స్ సంస్థలో చీఫ్ ఆపరేటింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రసాద్ తోటకూర ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గాను, ఇండియన్ అమెరికన్ ఫ్రెండ్షిప్ కౌన్సిల్ కు ప్రధాన కార్యదర్శిగా కూడా ఉన్నారు. డల్లాస్ కన్వెన్షన్స్ అండ్ విజిటర్స్ బ్యూరో సలహా మండలి డైరెక్టర్ గా కూడా వ్యవహరిస్తున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి