తెలంగాణా భవిష్యత్తును నిర్ణయించే ఈ ఉప ఎన్నికలలో తెలంగాణా కోసమే రాజీనామా చేసిన వారిని తిరిగి గెలిపించి తెలంగాణా ఉద్యమ చరిత్రలో మైలురాళ్లుగా నిలిచిన తెలంగాణా రతనాలకు నీరాజనాలు/శిరస్సువంచి నమస్కరిస్తున్నామని అమెరికాలోని తెలంగాణ ఎన్నారై వేదిక జై తెలంగాణ ఫోరం ప్రతినిధులు విజయ్ చాట్ల, రవి పల్లా, జగదీష్ బొందుగుల, రాంరెడ్డి జక్కా, గోపాల్ రెడ్డి పిన్నం అన్నారు. ఈ మేరకు వారు ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణా పౌరులందిస్తున్నసరికొత్త నివేదిక ఈ విజయమని వారు అభిప్రాయపడ్డారు. అంగబలంతో, అర్థబలంతో, అధికారబలంతో మందుమాంసాల వితరణతో తెలంగాణా ఉద్యమాన్ని కొనాలనీ, తెలంగాణా వాదాన్ని కాలరాయాలనీ కుటిల రాజకీయ నాయకులు వేసిన ఎత్తులను, చేసిన జిత్తులను విజ్ఞతతో, విచక్షణతో విలక్షణంగా తిప్పికొట్టి తెలంగాణా వాదానికి కొత్త ఊపిరులు పోసిన తెలంగాణా ఓటరు మహాశయులకు వాషింగ్టన్ ప్రాంతపు తెలంగాణా ఎన్నారైల హృదయపూర్వకమైన ధన్యవాదాలని తెలుపుతున్నట్లు వారు చెప్పారు.