తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించే సంకల్పంతో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) ఈ నెల 19న రవీంద్రభారతిలో 'తానా చైతన్య స్రవంతి-తెలుగు వైభవం' ఉత్సవాలను నిర్వహించనుంది. తానా అధ్యక్షుడు కోమటి జయరామ్ మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో హైదరాబాదులో ఆ విషయం చెప్పారు. ఔత్సాహిక కళాకారుల ప్రతిభను వెలుగులోకితెచ్చేందుకు రెండేళ్లకోసారి రాష్ట్రంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడ ఎంపిక చేసిన ప్రతిభావంతులకు 2011లో అమెరికాలో జరిగే తానా సభల్లో అవకాశం కల్పిస్తామని చెప్పారు. ఇదే నెల 22, 23 తేదీల్లో చంద్రగిరికోట (తిరుపతి)లో ఆధ్యాత్మిక వైభవం, 24, 25 తేదీల్లో విజయవాడలోని సిద్దార్థ కళాశాల మైదానంలో ఉత్సవాలు జరుగుతాయన్నారు. తెలుగు కవితల పోటీలు, రాష్ట్రస్థాయి నాటికల పోటీలు, వేదపఠనం, భక్తిగీతాలపాన, జానపద కళల ప్రదర్శన, తెలుగు సాంస్కృతిక సమ్మేళనం వంటి కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. సీనియర్ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్‌ను గిడుగు రామ్మూర్తి పురస్కారంతో, మల్లాది సుబ్బమ్మను సేవా పురస్కారంతో సత్కరిస్తామని తెలిపారు.