అమెరికాలో తెలుగు భాషపై చర్చ

ముందుగా షేక్ కరీముల్లా వ్రాసిన ‘ప్రగతిశీల ముస్లిం కవితలు' అనే పుస్తకం నుండి మాతృభాష, తీవ్రవాదం మొదలైన అంశాలగురించిన కవితలు నశీం షేక్ చదివి వినిపించారు. అన్నవరపు రంగనాయకులు గజేంద్రమోక్షం లోని ఎవ్వనిచేజనించు, సిరికింజెప్పడు, మొదలైన ప్రసిధ్ధ పద్యాలను వినిపించారు. వేదికమీద వీరు కేవలం తెలుగుభాషలోనే మాట్లాడటం అందరినీ అలరించింది.
తరువాత పాత్రికేయుడు, మానవవాది నరిశెట్టి ఇన్నయ్య తెలుగు, ఇంగ్లీష్ భాషలలో రచించిన ‘అంధ్రప్రదేశ్ లో మానవవాద ఉద్యమము' అన్న పుస్తకం అవిష్కరణ జరిగింది. మల్లవరపు అనంత్ పుస్తక పరిచయం చేయగా, జువ్వాడి రమణ, కన్నెగంటి చంద్ర పుస్తకంలోని మరికొన్ని విశేషాలు సభికులతో పంచుకున్నారు.
కవికోకిల గుర్రం జాషువా ప్రఖ్యాతిగాంచిన రచనలైన ఫిరదౌసి, గబ్బిలం, ముంతాజ్ మహల్ మొదలైన వాటినుండి కొన్ని పద్యాలను నసీం షేక్ చదివి వినిపించారు. తరువాత ప్రధాన వక్త చింతలపాటి శ్రీధర్ ను పరిచయంచేస్తూ మద్దుకూరి విజయచంద్రహాస్, శ్రీధర్ తో తనకున్న పరిచయాన్ని స్నేహాన్ని ప్రస్తావిస్తూ, శ్రీధర్ కు సంగీతసాహిత్యాలలో ఉన్న అభిరుచిని, ప్రవేశాన్ని వివరించారు. ఏ పని చేసినా ఎంతో సమయం వెచ్చించి, పూర్తి నిబధ్ధతతో, లోతైన పరిశీలనతో శ్రీధర్ చేస్తారన్నారు. దేవులపల్లి పాటలను స్వరపరచి, పాడి ఒక సీడీ వెలువరించారని, ఇంత ప్రతిభవున్నా అతిమామూలుగా ఉండటం ఆయన ప్రత్యేకత అని చెప్పి శ్రీధర్ ని వేదికపైకి ఆహ్వానించగా, శ్రీమతి పూర్ణనెహ్రూ పుష్పగుచ్చం తో స్వాగతం పలికారు.
అనంతరం చింతలపాటి శ్రీధర్ "‘ఱ' కి బండి ఎందుకు" అన్న అంశం మీద బహుమాధ్యమ ప్రదర్శన ఇచ్చారు. సీపీ బ్రౌన్, బూదరాజు రాధాకృష్ణ, భద్రిరాజు కృష్ణమూర్తి మొదలైన భాషాశాస్త్రవేత్తల రచనలలోనుండి, ద్రవిడ, సంస్కృత, పాశ్చాత్య భాషల పరిశీలన నుండి, వెలికి తీసిన అందరికీ తెలియని ఎన్నో విషయాలతో ఆద్యంతం అసక్తికరంగా శ్రీధర్ ప్రసంగం సాగింది. మనకు తెలిసిన తెలుగు అంకెలు ఎలావచ్చాయి, ఋ, ౠ లకు, సాధు, శకటరేఫలకు తేడా ఏమిటి, ఎందుకు మనకు ఈ అక్షరాలు అవసరం, అక్షరాలు మాయమై పోవటం వల్ల ఉచ్చారణ ఎలా మారిపోతుంది మొదలైన అంశాలను సోదాహరణంగా శాస్త్రీయంగా వివరించారు. ‘ఱ' అనే అక్షరం చరిత్రలో ఎలా పలకాలో మరచిపోయినప్పుడు, బండిలావున్న దాన్ని స్వరూపాన్ని అనుసరించి ‘బండి ర' అనే పేరు స్థిరపడింది అని అభిప్రాయపడ్డారు. సభికులు ఆసక్తి గా అడిగిన ప్రశ్నలకు సముచిత రీతిలో సమాధానాలు కూడా ఇచ్చారు. తాను బోధించే తెలుగు పాఠాలలో ఒక విద్యార్థి అడిగిన "‘ఱ' కి బండి ఎందుకు" అన్న ప్రశ్న వల్ల ఇంత పరిశోధన తాను చేసానని చెప్పి, ఆ అజ్ఞాత విద్యార్థికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షులు శ్రీమతి గీత దమ్మన్న, పూర్వాధ్యక్షులు కూచిభొట్ల ఆనంద మూర్తి శాలువాతో ముఖ్య అతిథి చింతలపాటి శ్రీధర్ ని సత్కరించారు. సాహిత్య వేదిక సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, మద్దుకూరి విజయ చంద్రహాస్ , ఊరిమిండి నరసింహా రెడ్డి, మల్లవరపు అనంత్, జువ్వాడి రమణ, నసీం షేక్ లు ముఖ్య అతిథికి జ్ఞాపికను అంద చేసారు. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ పాలమండలి అధిపతి డా.ఆళ్ళ శ్రీనివాస్ రెడ్డి, ఉపాధిపతి డా. సి.ఆర్.రావు, ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్, కార్య వర్గ సభ్యులు శ్రీమతి వనం జ్యోతి పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications