అమెరికాలో వేమన వాదం

ముందుగా స్వీయరచనలలో భాగంగా పద్యకవులైన డా. గన్నవరపు నరసింహమూర్తి తాము ఇటీవల పూర్తిచేసిన సమస్యాపూరణలను సభికులకు వినిపించారు. "కథలు మనకు ఎందుకు నచ్చుతాయి" అనే విషయం మీద కన్నెగంటి చంద్ర చేసిన ప్రసంగం అందరిని విశేషముగా ఆకట్టుకున్నది. ఇటీవల మరణించిన ప్రముఖ ప్రజాకవి, ప్రజా ఉద్యమ నాయకుడు, భావుకుడు శివసాగర్ పేరుతో విశేష ఖ్యాతినార్జించిన సత్యమూర్తి గురించి సాజీ గోపాల్ ప్రసంగించారు. శివసాగర్ తనచుట్టూ ఉన్న సమాజంలోని అసమానతలను అధ్యయనం చేసి పరిష్కారమార్గపు దిశగా ప్రజాఉద్యమాలను నడిపించారని సభికులకు వివరించారు.
పిమ్మట సాహిత్య వేదిక సభ్యుడు శ్రీ మద్దుకూరి విజయ చంద్రహాస్ వెండి తెరవేదిక కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన సుధామయిని సభాసదులకు పరిచయం చేసారు. ‘వ్యాఖ్యాన శిరోమణి’, ‘ఉత్తమ వ్యాఖ్యాత’ తదితర బిరుదులు గల సుధామయి తమ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలలో శ్రోతలను మెప్పించిన విషయం తెలియపరచారు. వెండితెర రారాజు విశ్వవిఖ్యాత నటరత్న పద్మశ్రీ నందమూరి తారాకరామారావు జయంతి సందర్భంగా ఆయన సినీజీవిత విశేషాలను వీడియోల ద్వారా సుధామయి వివరించి సభకు విచ్చేసిన అందరిని విశేషంగా అలరించారు.
తదుపరి టాంటెక్స్ కార్యదర్శి, సాహిత్య వేదిక సభ్యుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి ఈ సదస్సు ముఖ్య అతిథి రంగరాజు రమను సభకు పరిచయం చేసారు. ఈమె పద్మావతీ డిగ్రీ కళాశాలలో ఇరవైఐదు సంవత్సరాలకుపైగా అధ్యాపకురాలిగా సేవలందించారు. "వేమన కవితా దృక్పథం, మానవతా వాదం" అనే అంశంపై ముఖ్యఅతిథి ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగానూ, ఆలోచనాత్మకంగానూ సాగినది. వేమన యోగిగా మారటం వెనుక ప్రాచుర్యంలో ఉన్న కథలను సభాసదులకు వివరించారు. ఆనాడు సమాజంలో ఉన్న మూఢవిశ్వాసాల మీద అసమానతలమీద తన ఆటవెలది బాణాలను సూటిగా సంధించిన ప్రజాకవి వేమన అని ఆమె అభివర్ణించారు. లోభత్వం, మానవతావాదం, మూఢవిశ్వాసాలు, కులమతాల లాంటి అనేక అంశాలపై అలతి అలతి పదాలతో అద్భుతమైన నీతి పద్యాలను రాసిన వేమన సూర్యచంద్రులున్నంత వరకూ వెలుగులు చిమ్మే అసలు సిసలు కవి అని పేర్కొన్నారు.
టాంటెక్స్ అధ్యక్షులు గీత దమ్మన్న, పాలక మండలి అధ్యక్షులు డా.ఆళ్ళ శ్రీనివాస రెడ్డి ఈ సదస్సులో ప్రసంగం గావించిన అతిథులు సుధామయిని, రంగరాజు రమను దుశ్శాలువలతో సత్కరించారు. టాంటెక్స్ ఉత్తరాధ్యక్షుడు మండువ సురేష్ , శ్రీమతి సుధామయికి జ్ఞాపికను సమర్పించారు. సాహిత్య వేదిక సభ్యులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, మద్దుకూరి విజయ చంద్రహాస్ , మల్లవరపు అనంత్, డా. జువ్వాడి రమణ, డా.ఊరిమిండి నరసింహా రెడ్డి, కాజ సురేష్, బిల్లా ప్రవీణ్, శ్రీ నసీం షేక్ లు ముఖ్య అతిథి శ్రీమతి రంగరాజు రమకు జ్ఞాపికను సమర్పించడంతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం ( టాంటెక్స్) కార్య నిర్వాహక సభ్యులు వనం జ్యోతి, వీర్నపు చినసత్యం, చామకూర బాల్కి హాజరయ్యారు.












Click it and Unblock the Notifications