అమెరికాలో తెలంగాణపై కోదండరామ్
డల్లాస్: అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ డల్లాస్ ఏరియా తెలంగామ అసోసియేషన్ (డాటా) ఆధ్వర్వంలో స్థానిక ప్లాన్ గరం వేస్ట్ క్రీక్ క్లబ్ హౌస్‌లో జరిగిన సభలో ప్రసంగించారు. ఈ సభలో దాదాపు 200 మంది తెలంగాణ ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
సభకు ముఖ్య అతిథిగా వచ్చిన తుమ్మురి మోహనరావు - తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ కోదండరామ్ నిర్వహిస్తు్న పాత్రను, జెఎసి రూపంలో ఉద్యమాన్ని ముందుకు తీసుకుని పోవడంలో కోదండరామ్ చూపుతున్న పట్టుదలను, నిబద్ధతను, దీక్షాదక్షతలను ప్రశంసించారు. కోదండరామ్ పుట్టిన ఆదిలాబాద్ జిల్లా మీద ఆయన ఓ పాట పాడారు.

సభ మహాశివరాత్రి నాడు ఏర్పాటు కావడంతో తెలంగాణ ఉద్యమానికి అడ్డుపడుతున్న ఆంధ్ర పాలక శక్తులను నిలువరించి తెలంగాణ రాష్ట్ర సాధనకు నడుం కట్టిన నాయకులకు శక్తినివ్వాలని కదిలి రావయ్యా శివుడా, కైలాసగిరి నువ్వు వదిలి రావయ్య శివుడా అనే పాటను పాడారు.
మానవుడు సమానత్వాన్ని, సౌభ్రాతృత్వాన్ని కోరుకున్నాడని, వాటి కోసం పోరాటాలు చేశాడని చరత్రి చెబుతోందని, ఈ రోజు జరుగుతున్న తెలంగామ ఉద్యమం కూడా సమానత్వం కోసం, స్వయం పాలన కోసం జరుగుతున్న పోరాటమేనని కోదండరామ్ అన్నారు. రెండుసార్లు నోటి దాకా వచ్చిన తెలంగాణను ఆంధ్ర పాలకులు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసి అడ్డుకున్నారని, దీన్ని తెలంగాణ ప్రజలందరూ కలిసికట్టుగా ఎదుర్కుని ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించి, తెలంగాణను సాధించుకోవాలని, అందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధం కావాలని ఆయన అన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేనట్టుగా తెలంగాణ కోసం వేయి మంది ఆత్మహత్యలు చేసుకున్నారని, ప్రపంచ మీడియా దాన్ని గుర్తించడం లేదని, సూడాన్‌లో, టిబెట్‌లో ఆత్మహత్యల ద్వారా ఆ దేశ సమస్యలకు ఒక గుర్తింపు వచ్చిందని, ప్రపంచంలోని ఇతర దేశాల్లో వాటికి ప్రాచుర్యం లభించి, సమస్యల పరిష్కారానికి మద్దతు పొందడానికి వీలైందని ఆయన అన్నారు.
ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయని, ఆ తర్వాత సడక్ బంద్, ఇతర రూపాలతో పెద్ద యెత్తున ఉద్యమం నడిపి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచుతామని, తెలంగాణ రాష్ట్రాన్ని తప్పకుండా సాధిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు డల్లాస్ ఏరియా తెలంగాణ ఆసోసియేషన్ సభ్యులు కోదండరామ్‌ను సత్కరించారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!