అమెరికాలో తప్పిపోయిన.. భారత చిన్నారి కథ విషాదాంతం!?
అమెరికాలోని టెక్సాస్ లో ఓ పెంపుడు తండ్రి ఇంటినుంచి బయటికి పంపేసిన మూడేళ్ల చిన్నారి షెరీన్ మాథ్యూస్ కథ చివరికి విషాదాంతంగా ముగిసింది. అభం శుభం తెలియని వయస్సులో పెంపుడు తండ్రీ దాష్టీకానికి బలైపోయింది.
టెక్సాస్: అమెరికాలోని టెక్సాస్ లో ఓ పెంపుడు తండ్రి ఇంటినుంచి బయటికి పంపేసిన మూడేళ్ల చిన్నారి షెరీన్ మాథ్యూస్ కథ చివరికి విషాదాంతంగా ముగిసింది. అభం శుభం తెలియని వయస్సులో పెంపుడు తండ్రీ దాష్టీకానికి బలైపోయింది.
పాలు తాగడం లేదనే కోపంతో ఆమె పెంపుడు తండ్రి వెస్లీ మాథ్యూస్ ఆ చిన్నారిని అర్థరాత్రి దాటాక ఇంటికి దూరంగా ఉన్న ఓ చెట్టు వద్దకు తీసుకొచ్చి తెల్లవారే వరకూ అక్కడే నిలబడమంటూ శిక్ష విధించడం, ఆ తరువాత ఆ చిన్నారి కనిపించకుండా పోవడం తెలిసిందే.

షెరీన్ కోసం పోలీసులు దాదాపు రెండు వారాలపాటు వెతికారు. తరువాత డాగ్ స్క్వాడ్ ను కూడా రంగంలోకి దించారు. అవి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించాయి.
ఆ చిన్నారి మృతదేహం వెస్లీ మాథ్యూస్ ఇంటి సమీపంలోని డ్రైనేజి టన్నెల్ లో పోలీసులకు కనిపించింది. ఆ మృతదేహం బహుశా చిన్నారి షెరీన్‌దే అయి ఉండొచ్చని వారు అనుమానిస్తున్నారు.
మాథ్యూస్ ఇంటి నుంచి సుమారు అర మైలు దూరంలో మూడేళ్ల బాలిక మృతదేహం ఒకటి గుర్తు పట్టలేని స్థితిలో కనిపించిందని, వైద్య పరీక్షల అనంతరం బాలిక ఆచూకీని అధికారికంగా ప్రకటిస్తామని పోలీసులు తెలిపారు.
చిన్నారి మరణానికి కారణం ఏమిటనేది ఇంకా పూర్తిగా తెలియరాలేదని, పోస్టుమార్టం అనంతరం నిజం వెల్లడవుతుందని వారు పేర్కొన్నారు. ఈ కేసులో షెరీన్ పెంపుడు తండ్రి వెస్లీ మ్యాథ్యూస్ ను ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు, 2.5 లక్షల డాలర్ల బాండ్ పై అతనికి బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications