డల్లాస్‌లో “రాగం తీసే కోయిల”
డల్లాస్: కళావాహిని సంస్థ వారు సమర్పించిన "రాగం తీసే కోయిల" కార్యక్రమం ఆదివారం మార్చి 2వ తేదిన అర్వింగ్ లోని "మెకార్తర్ హైస్కూలు ఆడిటోరియమ్" లో వైభవంగా జరిగినది. తెలుగు వాళ్ళకు ఎన్నో మధుర గీతాలను అందించిన సంగీత దర్శకులు జి.కె. వెంకటేశ్, రాజన్-నాగేంద్ర సోదరుల సినీగేయాలను ప్రముఖ గాయకులు మహరాజపురం రాముఆలపించారు. హ్యూష్టనుకు చెందిన శారద ఆకునూరి, ప్రతిభావంతులైన స్థానిక డాలస్ గాయనీ గాయకులు వారికి ఏ మాత్రం తీసిపోకుండా కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.
పాడే ముందు ప్రతీ పాట లోతును మర్మాలను కళా వాహిని వ్యవస్థాపక సభ్యులైన డా. జువ్వాడి రమణ ప్రేక్షకులకు వివరించారు. మంచు తుఫాను ఏ మాత్రం సహకరించకపోయినా సంగీత ప్రియులెందరో విచ్చేసి ఆద్యంతం తిలకించి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రాము శిక్షణలో మెలకువలను నేర్చుకున్న చిన్నారులు మధుమహిత, జాహ్నవి, సింధుజ, వర్షిణి, అభినుత "పాడనా తెనుగు పాట" అని పరవశించి పాడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
"ఎన్నెన్నో జన్మల బంధము", "రాసాను ప్రేమలేఖలెన్నో", "ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం", "నీ కోసము యవ్వనమంతా దాచాను మల్లెలలో" లాంటి యుగళగీతాలను పాడి పూజిత, రాము ప్రేక్షకులను అలరించారు. చిన్నారులు హర్షిత్, శృతి తమ స్టెప్పులతో పాటలకు మరింత అందము చేకూర్చారు. "పరిమళించు పున్నమిలో" పాటను తమిళగాయని కళా కల్పట్, రాముతో గొంతుకలిపి వినిపించారు.
శారద, రాము కలిసి పాడిన "మల్లి మల్లి నాగమల్లి" పాట నయాగరా జలపాతములా జాలువారి ప్రేక్షకుల గుండెలను తాకింది. శారద పాడిన "వేళ చూడ వెన్నెలాయె" పాట శ్రోతలను గిలిగింతలు పెట్టినది. రాము, శారద జంటగా పాడిన "రాగమో అనురాగమో గీతమో సంగీతమో", "మనసెరిగినవాడు మా దేవుడు శ్రీ రాముడు", "కాస్తందపకో దరకాస్తందుకో", "అల్లో నేరేడు పళ్లు", "కనులలో నీ రూపము" పాటలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.
రాజన్- నాగేంద్ర సోదరులు ఎన్టీఆర్‌కు స్వరపరిచిన అరుదైన "ఏమో ఏమో ఇది నాకేమొ ఏమొ అయినది" పాటను చంద్రహాస్, శారదతో కలిసి పాడారు. "పోలేవులే నీవు పోలేవులే", "పూలు గుసగుసలాడేనని", "రాగము తీసేకోయిల కోయకు గుండెను తీయగా" పాటలను సృజన, రాము శ్రావ్యంగా వినిపించారు. జ్యోతి రాముతో "మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన" అలాగే సాంబతో "నాగమల్లివో తీగమల్లివో" పాటలను పాడి పేక్షకులను విశేషంగా అలరించారు. జయకళ్యాణి "లేత చలి గాలులు దోచుకో లేవులే", "చినుకులా రాలి హిమములా సాగి", "మేఘాల పందిరిలోన మెరిసింది మెరుపే", "చలికొండలో చెలి గుండెలో" , "మధువనిలో రాధికవో" లాంటి మధురగేయాలను రాము, ప్రభవ్, ప్రభాకర్ లతో కలిసి పాడి శ్రోతలకు ఆనందం పంచారు. "ఒక వేణువు విమిపించెను" పాటను నగేశ్ అద్భుతంగా ఆలపించారు.
తన కమణీయ వేణునాదంతో సాహితి అందించిన "రవివర్మకే అందని ఒకే ఒక అందానివో" పాట కార్యక్రమంలో విశేష ఆకర్షణగా నిలిచింది. శ్రీశ్రీ ఖడ్గసృష్టి కవితా సంపుటిలోని ఉగాది గేయానికి రాము సంగీతం సమకూర్చి శారదతో కలిసి ఆలపించి ఆ కవితాకమలానికి తావి నద్దారు.

కళా వాహిని వ్యవస్థాపక సభ్యులైన అనంత్ మల్లవరపు అధ్వర్యంలో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న గాయనీ గాయకులను, పోషక దాతలను జ్ఞాపికతో సత్కరించారు. చివరగా మరొక కళా వాహిని వ్యవస్థాపక సభ్యులైన మద్దుకూరి చంద్రహాస్ తమ వందన సమర్పణలో ఈ కార్యక్రమానికి ఎంతగానో సహాయ సహకారాలు అందించిన అశ్విన్ కౌతా, శేషా రావు బొడ్డు, రజనికాంత్ ఎర్రబెల్లి, రమేశ్ నారని, సురేశ్ కాజా, రవి తూపురాని, నసీమ్ షేక్, సౌండ్ ఓ రామ రామ్ కల్పట్, దేశి ప్లాజా కృష్ణ పుట్టపర్తి మరియు బైట్ గ్రాఫ్ ప్రవీణ్ యార్లగడ్డ లకు పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియచేశారు.












Click it and Unblock the Notifications