అమెరికా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి
నిజామాబాద్: ఉన్నత విద్య కోసం వెళ్లిన మరో తెలుగు విద్యార్థి అనుకోని ప్రమాదంలో మృతి చెందాడు. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం బడాభీమ్ గల్ గ్రామానికి చెందిన గుర్రపు శైలేష్(25) ప్రాణాలు కోల్పోయాడు.
అమెరికాలో బయోమెడికల్ ఇంజినీరింగ్ చదివేందుకు సెప్టెంబర్ నెలలో అమెరికాకు వెళ్లాడు శైలేష్. యూనివర్సిటీ ఆఫ్ బ్రిడ్జిపోర్ట్‌లో బయోమెడికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ చేస్తున్నాడు. శనివారం న్యూజెర్సీలోని సెల్టర్ కూడలి వద్ద శైలేష్ కారు వెళ్తోంది. ఈ క్రమంలో శైలేష్ వెళ్తున్న కారును వేగంగా వచ్చిన మరో కారు ఢీకొట్టింది.

నేరుగా గ్యాస్ ట్యాంకును ఢీకొట్టడంతో మంటలు చెలరేగి శైలేష్ అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. శైలేష్ మృతి వార్త తెలుసుకున్న స్నేహితులు ఘటనా స్థలానికి చేరుకుని అక్కడే నివాళులర్పించారు. మరోవైపు శైలేష్ మృతదేహాన్ని సోమవారం అప్పగించే అవకాశం ఉందని తానా సభ్యులు తెలిపారు. మృతదేహాన్ని హైదరాబాద్‌కు తరలించేందుకు తానా సభ్యులు చర్యలు చేపట్టారు.
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన శైలేష్ మరణంతో అతని స్వగ్రామం బడాభీమ్‌గల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మరణ వార్త విని అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి తండ్రి సత్యం గల్ఫ్ దేశం వెళ్లి తిరిగి వచ్చారని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో చేతికందిన కొడుకు మరణించడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
కాగా, ఇటీవల కాలంలో అమెరికాకు వెళ్లిన పలువురు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు మరణించడం ఆందోళనకు గురిచేస్తోంది. కొందరు దుండగుల కాల్పుల్లో మరణిస్తే.. మరికొందరు ఇతర ప్రమాద ఘటనల్లో మరణించారు. ఈ క్రమంలో అమెరికాలో ఉన్న తమ కుటుంబసభ్యుల పట్ల ఇక్కడివారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications