తెలుగు భారతి ప్రారంభ వేడుకలు
సియాటిల్: అమెరికాలోని సియాటిల్ నగర ప్రవాసాంధ్రులు ఎంతో ఆనందోత్సాహాలతో తెలుగు భారతి సంస్థ ప్రారంభోత్సవ సందర్భంగా వినాయక చవితి పండుగ జరుపుకున్నారు. ‘నిలుపు తెలుగు వెలుగు, నేర్పు తెలుగు పలుకు' అంటూ, మన తెలుగు భాషని, తెలుగు సంస్కృతిని ముందు తరాల వారికి అందించడమే ముఖ్య ధ్యేయంగా స్థాపించిన తెలుగు భారతి సంస్థ ఆధ్వర్యంలో ఆరు గంటలపాటు జరిగిన ఈ వేడుకలకు సుమారుగా ఐదువందల మంది హాజరయ్యారు.
ఇస్సాక్వా లోని ఉన్నత పాఠశాల రంగస్థలం నృత్యాలతోనూ, నృత్య నాటికలతోనూ, హాస్య నాటికలతోనూ ఎంతో సందడిగా వెల్లి విరిసింది. ఈ కార్యక్రమంలో చిన్నారులనుంచి పెద్దలవరకు సుమారుగా 60 మంది రంగస్థల ప్రదర్శన చేయటం ఒక విశేషం. ‘సీతాస్వయంవరం' అనే కూచిపూడి నృత్యరూపకం ఈ కార్యక్రమంలోని విశేషాంశం.

సుమారుగా రెండు గంటల పాటు జరిగిన ఈ రూపకానికి ‘నాట్య కళారత్న' శ్రీ పసుమర్తి వేంకటేశ్వర శర్మ గారు దర్శకత్వం వహించారు. తెలుగు భారతి తరగతులలో నమోదు చేసుకున్న విద్యార్థులకు విఘ్నేశ్వర పూజ చేసిన పుస్తకాలను అందించారు.
కార్యక్రమాలే కాక, ఆవకాయ, గోంగూర పచ్చడి, ఉండ్రాళ్ళు, చక్కెర పొంగలి మొదలైన వంటకాలతో తెలుగు భారతి వారందించిన షడ్రసోపేతమైన విందు భోజనం కూడా తెలుగుదనం సంతరించుకుని అందరినీ అలరించింది. సాంప్రదాయక దుస్తులు ధరించిన చిన్నారులతో, పట్టు చీరెల రెపరెపలతో, జన సందోహంతో, ప్రేక్షకుల కేరింతలతో ఈ కార్యక్రమం ఎంతో కన్నుల విందుగా జరిగింది.












Click it and Unblock the Notifications