అమెరికాలో మరో విషాదం: ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
అమెరికాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు పట్టా అందుకున్న కొద్ది రోజులకే ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలోని ఆరిజోనాలోని ప్రసిద్ధ ఫాజిల్ క్రీక్ జలపాతంలో మునిగి మృతి చెందారు. మే 8న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఆరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పట్టా పొందిన లక్కిరెడ్డి రాకేష్ రెడ్డి(23), రోహిత్ మణికంఠ(25) సహా 16 మంది స్నేహితులు చదువు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా మే 8న జలపాతం వద్దకు వెళ్లారు. ఆ సమయంలో రాకేష్, రోహిత్ లు ప్రమాదవశాత్తు ఒక్కసారిగా జలపాతంలో మునిగిపోయారు.

గమనించిన స్నేహితులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలో దిగిన పోలీసులు ఆరోజు రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. మరుసటి రోజు గత ఈతగాళ్లతో వెతికించగా సుమారు 25 అడుగుల లోతులో ఇద్దరి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. వీరిలో రాకేష్ రెడ్డిది ఖమ్మం నగరానికి చెందిన మాంటిస్సోరి, తెలంగాణ నారాయణ పాఠశాలల అధినేతల్లో ఒకరైన లక్కిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పద్మ దంపతుల ఏకైక కుమారుడు.
కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. గత వారం ఆరిజోనా విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్ పట్టా అందుకున్నాడు. కుమారుడు పట్టా అందుకున్న ఆనందాన్ని పంచుకునేందుకు తల్లిదండ్రులు కూడా అమెరికా వెళ్లారు. ఇలాంటి ఆనందకర క్షణాల పంచుకున్న వారం రోజుల్లోపే తమ కుమారుడి మరణవార్త విని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
మరో రెండు రోజుల్లో రాకేష్ రెడ్డి మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. రాకేశ్‌రెడ్డి చిన్ననాటి నుంచే చదువుల్లో చురుగ్గా ఉండేవాడని క్రీడల్లో సైతం రాణించేవాడని బంధువులు తెలిపారు. బీటెక్ పూర్తిచేసిన తర్వాత ఓ ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చినా వెళ్లకుండా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడన్నారు. మరోవైపు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంఎస్ చేసిన రోహిత్ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, అమెరికాలో ఇటీవల జరుగుతున్న వరుస తెలుగు విద్యార్థుల మరణాలు కలవరానికి గురిచేస్తున్నాయి.












Click it and Unblock the Notifications