వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటి కన్ను విమర్శ

By Staff
|
Google Oneindia TeluguNews

ఆ మధ్య ఒక దిన పత్రిక సాహిత్యం పేజీలో డాక్టర్‌ కేశవరెడ్డి నవలలపై రంగనాయకమ్మ, రామకృష్ణ అనే విమర్శకులు కత్తులు దూశారు. 'చివరి గుడిసె' నవలలో కేశవరెడ్డి మణియం అనే విలన్‌ను మనిషి చేత కాకుండా కుక్క చేత చంపించడం రంగనాయకమ్మగారికి పెద్ద తప్పుగా కనిపించింది. 'చివరి గుడిసె'నే కాదు కేశవరెడ్డి 'మూగవాని పిల్లనగ్రోవి' మీద కూడా వీరిద్దరు కొరడా ఝళిపించారు. రామకృష్ణనే (అప్పుడీ రామకృష్ణ రామకృష్ణారెడ్డి) కొన్నేళ్ల క్రితం కేశవరెడ్డి రాసిన 'ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌' నవలపై విరుచుకుపడ్డారు.

'ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌' నవల కొత్త ముద్రణ ఆవిష్కరణ సభలో కాత్యాయని అనే తెలుగు విమర్శకురాలు ఓ పాయింట్‌ లేవనెత్తారు. గుడిలోకి వెళ్లి ఆముదం తేవాల్సిందిగా అర్జునురెడ్డి ఎన్ని విధాలుగా చెప్పినా దళితుడైన రామచంద్రుడు ఒప్పుకోడు 'ఇన్‌క్రెడిబుల్‌ గాడెస్‌' నవలలో. అందుకు కోపంతో అర్జునురెడ్డి రామచంద్రుడి ముఖంపై వుమ్ముతాడు. ఇది అప్పుడు త్రిపురనేని మధుసూదనరావుకు తప్పుగా కనిపించింది. ఆయనకు ఇది మరో రకంగా తప్పుగా కనిపిస్తే, కాత్యాయనికి ఇంకో రకంగా తప్పుగా కనిపించింది.

''గుడిలోకి పోయి ఆముదం తీసుకురావడానికి నిరాకరించటం ఒక్కటే రామచంద్రుని చైతన్యానికి గీటురాయా? తాగుబోతు బూర్జువా వుడ్రీకి అర్జునరెడ్డితో హరిజనుల మీద వుమ్మి వేయించటం న్యాయమేనా?'' అని త్రిపురనేని మధుసూదన రావు ప్రశ్నించారు. 'హరిజనుల్లో రేపు రెక్కలు విప్పుకుంటున్నది. భూస్వాములు వణుకుతున్నారు' అని ఆయన సూత్రీకరించాడాయన. ఈ మాటలు ఆయన 1979లో అన్నాడు. దళితుడి మీద అగ్రకులానికి చెందిన అర్జునరెడ్డి చేత వుమ్మి వేయించటమేమిటని కాత్యాయని ఇటీవల సభలో అడిగారు. ఇదీ మన విమర్శకుల తీరు.

'చివరి గుడిసె' నవలలో మణియంను కుక్క చేత చంపించడం 'పోయెటిక్‌ జస్టిస్‌' అనే విషయాన్ని పసిగట్టలేనంతగా తెలుగు విమర్శ కరుడు గట్టుకొని పోయింది. 'మూగవాని పిల్లనగ్రోవి' నవల మన విమర్శకుల కంటితో చూస్తే ఉత్త ట్రాష్‌గా కనిపిస్తుంది. ఎస్‌. జయ రాసిన 'రెక్కలున్న పిల్ల' కథపై కాత్యాయని చేసిన విమర్శ అలాంటిదే. అమ్మాయికి రెక్కలుండడమేమిటని ఆమె ఒక 'మౌలిక ప్రశ్న'ను లేవనెత్తారు. అట్లాగే, కె.ఎన్‌.వై. పతంజలి నవల్లో జంతువులు మనుషుల్లాగా ప్రవర్తిస్తాయి. ఇవన్నీ 'అవాస్తవికంగా' మన తెలుగు విమర్శకులకు కనిపించడంలో ఆశ్చర్యం లేదు. 'వాస్తవికత' పేరు 'కాల్పనికత' హైట్స్‌కు వెళ్లిన రచనలను వీరు తోసి పుచ్చడం మనం చాలా కాలంగా చూడవచ్చు. సృజనాత్మకతకు ప్రాణం 'కాల్పనికత' అనే విషయం వీరికి పట్టదు. అట్లాగే, సృజనాత్మక సాహిత్యం హృదయ సంబంధి అనే రాచమల్లు రామచంద్రారెడ్డి మాటలను వారు ఒక్కసారి కూడా గుర్తు చేసుకోరు.

వాస్తవికతను, మార్క్సిజాన్ని యాంత్రికంగా అన్వయించడం వల్ల తెలుగు సాహిత్య విమర్శ ఉత్త డొల్లగా మారిపోయింది. ఆ డొల్లతనాన్ని కప్పి పుచ్చుకోవడానికి విమర్శను దుడ్డుకర్రగా మార్చారు. కేశవరెడ్డి నవలలో రామకృష్ణారెడ్డి అప్పుడు తప్పులెంచడానికి, కాత్యాయని ఇప్పుడు తప్పులెంచడానికి తేడా వుంది. అయితే, కొలబద్దల ప్రమాణం ఒక్కటే. రామకృష్ణారెడ్డి 'వర్గదృష్టి'తో మాట్లాడితే కాత్యాయని 'కులదృష్టి'తో మాట్లాడారు. దళిత, స్త్రీవాదాలు తెలుగు సాహిత్యంలో బలంగా వీచినప్పుడు తలాతోకా లేని విమర్శలు వచ్చాయి. చలం మీద జయప్రభ ధ్వజమెత్తడం ఇటువంటిదే. తమ కులాల గురించే రాసుకున్నారని చలంపై, మరి కొందరు రచయితలపై విరుచుకుపడ్డారు.

వారు తమకు తెలిసింది, అనుభవంలోకి వచ్చింది మాత్రమే రాశారన్న విషయం వీరు గమనించలేదు. అలా గమనించాలనే విషయం మనకు తెలియకుండా పోయింది. చలం గానీ, గురజాడ గానీ తమ రచనల్లో తమకు అనుభవంలోకి వచ్చిన విషయాల గురించే రాసినప్పుడు తమ కులాల్లోని, సమాజంలోని 'రోగాలను' సమర్థించారా, వ్యతిరేకించారా అనేది చూడవలసి వుందనే విషయం వీరు పట్టించుకోలేదు. అంతేకాకుండా, అప్పటి చలం ఇప్పటి జయప్రభ లాగా ఆలోచించడం కుదురుతుందా అనేది ప్రశ్న. (నిజానికి చలం ఆధునిక సాహిత్య వేత్తల కన్నా చాలా ముందున్నారు. ఆయన రచనలను యాంత్రికంగా విశ్లేషించడం మాత్రమే మనకు ఇప్పటి వరకు తెలిసింది)

మార్క్సిస్టు విమర్శ పేర కె.వి. రమణారెడ్డి, త్రిపురనేని మధుసూదన రావు, తదితర ఉద్ధండులు ప్రవేశపెట్టిన దుడ్డకర్ర విమర్శదే ఇప్పటికీ పైచేయి అవుతోంది. వాస్తవికత నవలల పేర 'డాక్యుమెంట్ల'ను ఆకాశానికెత్తడం అందుకే. ఆ కోవకు చెందినవారే కాబట్టి రామకృష్ణ, రంగనాయకమ్మ కేశవరెడ్డి నవలలను అర్థం చేసుకోవడంలో విఫలమయ్యారని చెప్పుకోక తప్పదు. ఈ మార్క్సిస్టు విమర్శకుల మార్గాన్నే దళిత, స్త్రీవాద విమర్శకులు అనుసరిస్తున్నారు. 'లోనారసి' చూసే కన్ను తెలుగు విమర్శకులకు కొరవడింది.

చివరగా ఒక్క మాట- హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చే బస్సు ఆలేరు టిఫిన్‌ కోసమో, భోజనం కోసమో చాలా సేపు ఆగుతుంది. మేం కొందరం జనగాంలో బస్సెక్కి హైదరాబాద్‌ వస్తున్నాం. ఆలేరులో బస్సు ఆగగానే డాక్టర్‌ కె. లింగారెడ్డి కవితాసంకలనం 'జలపాత శబ్దంలోకి...' సీటు మీద ఉంచి కిందికి దిగాం. మేం వచ్చేసరికి ఆ పుస్తకాన్ని మహబూబాబాద్‌కు చెందిన బస్సు కండక్టర్‌ తీసి చూస్తున్నాడు. మేం అతని వైపు చూడగానే- 'డాక్టర్‌' అని వుంటే కేశవరెడ్డి పుస్తకం అనుకున్నానని ఆ కండక్టర్‌ చెప్పాడు. ''కేశవరెడ్డి తెలుసా?'' అని అడిగాం. 'మనిషి తెలియదు. కేశవరెడ్డి నవలలంటే ఇష్టం'' అని చెప్పాడు.

''మీరు కవిత్వం గానీ, కథలు గానీ రాస్తారా?'' అని మేమతన్ని అడిగాం. రాయనని చెప్పాడు. ''కేశవరెడ్డి మీద రంగనాయకమ్మ, రామకృష్ణ రాసిన వ్యాసాలు చదివారా?'' అని అడిగాం. అతను వారిద్దరిపై చేసిన కామెంట్లను ఇక్కడ చెప్పడం మర్యాద కాదు. ఏ పాపులర్‌ నవలా రచయిత గురించో ఒక సామాన్య మానవుడు ప్రశంసలు కురిపిస్తే మనం ఇంకో రకంగా అర్థం చేసుకోవచ్చు. ఉత్తమ సాహిత్యాన్ని విమర్శకుల కన్నా పాఠకులు బాగా పసిగట్టగలరని చెప్పడానికే ఈ కథ చెప్పాల్సి వచ్చింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X