• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్ట్-24

By Staff
|

బండి పార్క్‌ చేసి ఎవరూ లేని చోటు చూసి కూర్చన్నారు.

''రామ్‌! ఎప్పుడూ ఏదో ఆలోచనలో ఉంటావు. నిన్ను చూస్తే దిగులేస్తుంది'' అంది ప్రమీల. ఆమె అతనికి ఇటీవలే పరిచయమైంది. ఆమె కూడా ఓ పత్రికలో పని చేస్తోంది.

ఆ చిన్న మాటే అతనికెంతో ఓదార్పు ఇచ్చినట్లనిపించింది. మనసు కాస్తా తేలికపడింది. తన మనసులోని మంట కాస్తా ఆరినట్లయింది. అయినా ఈ మంట ఆరేదేనా? అది రగులుతూనే ఉంటుంది. తనను దహించి వేస్తూనే ఉంటుంది. జరుగుతున్నదంతా డ్రామానో, నిజమో తెలుసుకోలేని నిస్సహాయత వల్ల జనించిన మంటలవి.

''ఎదురుగా ఉన్న మనిషిని కూడా పట్టించుకోకుండా ఆ ఆలోచనలేమిటి?'' అన్నది కాస్తా చిరాగ్గా.

''ఏమిటి ఇలా వచ్చావు?'' అడిగాడు.

''నిన్ను చూసినట్లూ ఉంటుంది, నా పనీ కొంత అవుతుందని''

''ఏం పని?''

''ప్రభుత్వానికి, నక్సలైట్లకు మధ్య చర్చల గురించి స్టోరీ చేయమని చెప్పాడు మా బాస్‌. నువ్వు కొంత బ్యాక్‌గ్రౌండ్‌ మెటిరీయల్‌ ఏమైనా ఇవ్వగలవేమోనని''

''ఏముంది? నక్సలైట్ల తరఫున మధ్యవర్తులుగా ఇద్దరు పోయెట్స్‌ ప్రభుత్వ ప్రతినిధులతో మాట్లాడుతున్నారు కదా వారిని ఇంటర్వ్యూ చేయి. వేదికవాళ్లతో మాట్లాడు. ప్రభుత్వం తరఫున మధ్యవర్తులతో మాట్లాడుతున్నవారిని ఇంటర్వ్యూ చేయి. స్టోరీ అయిపోతుంది'' చెప్పాడు.

''ఇంటర్వ్యూలు చేస్తాననుకో. ఇంటర్వ్యూలతో సరిపోదు కదా! అనాలిసిస్‌ ఇవ్వాలి. అసలు చర్చలు ఎంతవరకు సఫలమవుతాయి. అసలు వాటి ఉద్దేశ్యమేమిటి? కాస్తా చెప్పరాదూ!''

రాంరెడ్డి మనసు చెదిరింది. గుండెను చిక్కబట్టుకునే ప్రయత్నం చేశాడు. చాలా సేపు మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మౌనాన్ని ఛేదిస్తూ పల్లీల కుర్రాడు. ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌ తీసి పల్లీలు కొన్నది. అతను వెళ్లిపోయాడు.

''మాట్లాడవేం? చెప్పడం ఇష్టం లేదా? ప్రొఫెషనల్‌ సీక్రెటా? అయితే వద్దులే'' అంది ప్రమీల కాస్తా నొచ్చుకున్నట్లుగా.

''ఛా, అలాంటిదేం లేదు. ఎక్కడికి వెళ్లినా నన్ను ఈ విషయమే వెంటాడుతుందేమిటా అని బాధగా ఉంది. నాకు అదంతా ఓ డ్రామా అనిపిస్తుంది. జర్నలిస్టుగా నేనిలా మాట్లాడకూడదేమో గానీ నక్సలిజం ప్రతి తెలంగాణవాడి ఏదో రూపంలో భాగమైపోయింది. వేదిక బహుశా ఎన్జీవోనే అయి వుంటుంది. ఫండ్స్‌ కోసం అది పని చేస్తున్నదనే నా అభిప్రాయం. అందుకే నాకు ఆ మీటింగ్‌లకు వెళ్లడం కూడా ఇష్టం లేదు. చర్చలంటావా? అవి సాధ్యం కావనేది ప్రభుత్వానికే కాదు, నక్సలైట్లకు కూడా తెలుసు. ఇద్దరూ ఈ పేరుతో కొంత గ్యాప్‌ తీసుకుంటున్నారని నాకు అనిపిస్తోంది.''

''గ్యాప్‌ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ప్రతిపక్షాలన్నీ డిమాండ్‌ చేస్తున్నాయి కాబట్టి తాము చర్చలు జరపడానికి సిద్ధమేనని చెప్పడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుండవచ్చు'' అంది ఆమె.

''అంతే కాదనుకుంటా. ప్రపంచ బ్యాంక్‌ కోసమైనా ప్రభుత్వం ఈ పని చేయాలనుకుంటా. శాంతి నెలకొంటే తప్ప అభివృద్ధి సాధ్యం కాదని ముఖ్యమంత్రి అంటున్నాడు. శాంతి చర్చలు కూడా ప్రపంచ బ్యాంక్‌ ఎజెండాలో భాగమై ఉంటాయామో! ఇక నక్సలైట్ల సంగతి తెలియందేమీ కాదు. ఎత్తుగడగానే చర్చలను తీసుకుంటోంది. ప్రజలు మాత్రం శాంతిని కోరుకుంటున్నారు'' అన్నాడు రాంరెడ్డి.

''ఇదంతా రాయడానికి వీలవుతుందో లేదో! బహుశా రాయడం సాధ్యం కాకపోవచ్చు. ఏదో ఒకటి రాసెయ్యరాదూ'' అన్నాడు అతనే మళ్లీ.

ఆమె స్క్రిబ్లింగ్‌ ప్యాడ్‌ తీసి ఏదో రాసుకుంది. అతను పట్టించుకోలేదు. కాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. అతని మనసులో రొద. అలజడి. అల్లకల్లోలంగా ఉన్న మనోసముద్రాన్ని చల్లార్చేదెవరు? అంతా అయిపోయినట్లే అనిపిస్తోంది. ఏదీ నిజం కాదు. ఏదీ అబద్ధం కాదు. ఈ రెండూ కాకుండా వేరేదెటుందా? ఉంటుందనే అనిపిస్తుంది. అదేదో పట్టుకోవాలి. దానికో పేరు పెట్టాలి. కొత్త సమాజంలోకి అడుగు పెట్టాం. పాత ప్రమాణాలతో ఈ మార్పులను కొలవడం సాధ్యం కాదనిపిస్తోంది. రెండే పక్షాలు ఉండడం కూడా సాధ్యం కాదు. మూడో పక్షం ఉంటుంది. ఆ పక్షం ఈ రెండూ వైపులా చేరి ఏదో మాయ చేస్తోందనిపిస్తోంది. ఆ మూడో పక్షాన్ని కనిపెట్టాల్సిన అవసరమే నేడుంది.

''నువ్వెప్పుడూ ఇంతే. నీ ఆలోచనలో నువ్వుంటావు. ప్రశ్నలు వేస్తే జవాబులు చెప్తావు. లేదంటే మౌనంగా ఉండిపోతావు'' అంది ప్రమీల. అతను మాట్లాడలేదు.

''ఇంత నింద వేసినా మాట్లాడవేమిటి?'' అని అడిగిందామె.

''ఏం మాట్లాడమంటావు. మాట్లాడడానికి నాకెందుకో విషయాలేమీ లేనట్టే అనిపిస్తూ ఉంటుంది. ఎవరితో ఏ విషయాలు మాట్లాడాలో నిర్ణయించుకోలేకపోవడం నా బలహీనత కావచ్చు'' అన్నాడతను.

ఇద్దరూ లేచి నడవసాగారు. బైక్‌ తీసి వెనుదిరిగారు. సూర్యుడు పశ్చిమాన అస్తమిస్తున్నాడు. సూర్యోదయానికి, సూర్యాస్తమయానికి తేడా తెలియడం లేదు. రెండూ అస్తమయం లాగే అనిపిస్తున్నాయి. ఉదయం కానే కాదనుకోవడం రాంరెడ్డి నిరాశావాదానికి ప్రతీకనా? ఈ నిరాశలోంచి ఆశా కిరణం పుట్టే రోజు రానేరాదా? రావడానికి అవకాశాల్లేని పరిస్థితుల్లోకి నెట్టబడుతున్నామనేది రాంరెడ్డి బాధ.

సెక్రెటేరియట్‌ ముందుకు వచ్చారో లేదో గద్దర్‌ నాట్యం చేస్తూ పాట పాడుతున్నాడు. ఇద్దరు వెహికల్‌ పక్కన పార్క్‌ చేసి అక్కడికి చేరుకున్నారు. చుట్టూ జనం చేరి చూస్తున్నారు. గోచీ కట్టి భుజాన గొంగడి వేసి చేతిలో ఎర్రజెండా పట్టుకొని తన్మయత్వంతో నాట్యం చేస్తున్నాడు. అదో బలమైన ముద్ర. ఆ ముద్ర బహుశా ఈ కాలంలోని ప్రతి ఒక్కరి మనసులో అలా పడిపోయి ఉంటుందేమో అనుకున్నాడు రాంరెడ్డి. చర్చలకు వెళ్లి బయటకు వచ్చినట్లున్నాడు.

అలా చర్చలు జరుగుతుండగానే అక్కడెక్కడో కరీంనగర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగిన వార్త. దాంతో నిరసన తెలియజేసి చర్చల్లోంచి బయటకు వచ్చామని చుట్టూ మూగిన విలేకరులతో విప్లవ కవి చెబుతున్నాడు. అతనికి విప్లవం పట్ల అపారమైన విశ్వాసం. ఆ విశ్వాసమే అతన్ని అలా నిలబెడుతోందని రాంరెడ్డి నమ్మకం. అరెస్టులు, నిర్బంధాలు, దాడులు, కుట్ర కేసులు దాటుకుని వచ్చిన వ్యక్తిత్వం.

''అదంతా అయిపోయాక వెనుదిరిగారు. ఇక చర్చలు ఆగిపోయినట్లే కదా'' అంది ప్రమీల.

''అది తప్పదు'' అన్నాడు రాంరెడ్డి. మొదటి నుంచీ తాను అనుకుంటున్నదే. చర్చలు జరగడం అనేది వట్టి మాటలని అతను చెబుతూనే ఉన్నాడు. ఏదీ మనసులో దాచుకోలేకపోవడమనేది, మనసులోని ఆలోచనలను ఎడిట్‌ చేసుకుని మాట్లాడడం అనేది చేత కాకపోవడం పెద్ద తప్పయిపోయింది పౌరసమాజంలో. ఆ రకంగా తానింకా పూర్తి పౌరుడిగా రూపుదిద్దుకోలేదు కావచ్చు. తన బ్యాక్‌ గ్రౌండే అందుకు కారణమా? ఎన్నిసార్లనుకున్నాడు అన్నీ బయటకు మాట్లాడేయకూడదని.

ఇద్దరూ బైక్‌ మీద వెనుదిరిగారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X