బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలో ఈ జిల్లాల్లో మళ్లీ వర్షాలు
ఏపీలో రోజురోజుకూ ఎండ తీవ్రత పెరుగుతోంది. జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీస్తోన్నాయి. మరింత ఇబ్బందులకు గురి చేస్తోన్నాయి. వేడి గాలుల ప్రభావానికి శరీరంలో నీటి శాతం కూడా ఆవిరయ్యే పరిస్థితి ఏర్పడింది. ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వేడిగాలులు, ఉష్ణోగ్రత పంజా విసురుతున్నాయి. కోస్తా తీర ప్రాంత జిల్లాల్లో ఉక్కపోత ఊపిరిసలపనివ్వట్లేదు.
ఈ పరిస్థితుల మధ్య తీపికబురు అందింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, మధ్య కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలిక పాటి వర్షం, అక్కడక్కడ చిరు జల్లులు పడొచ్చని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పిడుగుల పాటు హెచ్చరికలు సూచించింది. బలమైన ఈదురుగాలులు, పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో నేడు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజుతో పాటు పోలవరం, దక్షిణ కోస్తా పరిధిలోని నెల్లూరు, రాయలసీమలోని అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ చెప్పారు. ఆయా జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వివరించారు. అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండటం వల్ల పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
అదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండ, వడగాలులు, ఉక్కపోత తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు భానుడి భగభగలు తీవ్రతరమౌతాయని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల్లోని పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీస్తాయని, రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన అన్ని జిల్లాల్లో సాధారణ వేడిగాలుల ప్రభావం ఉంటుందని అన్నారు. నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది ఈ సీజన్‌లోనే అత్యధికం. రాష్ట్రవ్యాప్తంగా 216 మండలాల్లో 41 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.












Click it and Unblock the Notifications