'సరస్వతి'కో నూలుపోగు
ఎర్రరంగు అంచు గల తెల్లని ధోవతి, తెల్లని చొక్కా ధరించి చకచకా నడిచిపోయే యామినీ సరస్వతి ఇక లేరని అనిపించినప్పుడు తీవ్రమైన బాధ కలుగుతుంది. ఆయన వ్యక్తిత్వం మరుపురానిది. మనిషి పొట్టి కానీ మనసు పెద్దది. ఎవరినీ నొప్పించని రచయిత తెలుగు సాహిత్యంలో చాలా తక్కువ మంది ఉన్నారు. ఆ తక్కువ మందిలో యామినీ సరస్వతి ఒక్కరు.
యామినీ సరస్వతిగా సాహితీ లోకానికి సుపరిచితులైన సుబ్బారావు యాబైకి పైగా నవలలు రాశారు. చారిత్రక ప్రాధాన్యం గల సినిమాలకు కథలు అందించారు. చాలా మందికి యామినీ సరస్వతి గురించి తెలిసిందంతే. కానీ ఆయన చాలా కాలం పాటు 'మంజుల' అనే సాహిత్య పత్రిక నడిపారు. కర్నూలు జిల్లా నుంచి ఆయన నెలనెలా ఆ పత్రికను వెలువరించేవారు. ఒక కుమారుడి అకస్మిక మృతితో ఆయన కలత చెంది దాన్ని తీసుకురాలేకపోయాడు. హైదరాబాద్ వచ్చేసి 'ఉదయం' పత్రికలో చేరారు. అప్పుడే ఆయనతో నాకు ముఖాముఖి పరిచయం ఏర్పడింది.
"మీరు కథలు రాయడం లేన్నట్టుంది!" అని అన్నారు నాతో. రాయడం లేదని చెప్పాను. మీరు రాయాలన్నారు. అలా మళ్లీ నా కథ రచన ప్రారంభమైంది. నా మొదటి రెండు కథలను ఆయనే తన పత్రికలో అచ్చేశారు. అప్పటికి నాకు ఆయనతో పరిచయం లేదు. నాకు సాహితీ వేత్తలతో కూడా అప్పుడు పెద్దగా పరిచయాలు లేవు. కానీ అప్పటికే చాలా మంది రచనలు చదివి ఉన్నాను. ప్రస్తుతం పిటి ఐలో పనిచేస్తున్న సురేష్ అప్పట్లో నాకు యామినీ సరస్వతి నడుపుతున్న పత్రిక గురించి చెప్పి కథలు పంపమని చెప్పాడు. అలా నేను ఆ రెండు కథలు పంపాను. పంపిన వెంటనే ఆయన అచ్చేశారు. ఇదంతా ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పడానికే. సాహిత్యం విషయంలో ఆయనకు తరతమ భేదం లేదు. మంచి రచన అయితే ఆయన కళ్లకు అద్దుకునేవారు. అందరినీ ప్రోత్సహించేవారు. ఎవరీని పల్లెత్తు మాట అన్న సందర్బాలు లేవు.
ఆయన తన జీవితాన్ని సాహిత్యానికే అంకితం చేశారు. పుంఖానుపుంఖంగా రాస్తూ పోయారు. జ్యోతిష్యం కూడా చెప్పేవారు. కానీ దాని మీద నాకు పెద్ద ఆసక్తి ఉండేది కాదు. అందువల్ల ఆయన ఏ మేరకు శాస్త్రీయంగా అధ్యయనం చేశారో తెలియదు.












Click it and Unblock the Notifications