వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్ట్-13

By Staff
|
Google Oneindia TeluguNews

ఆ దమ్ము ఎలా పుట్టిందో ఎవరికి ఎరుక? ఒక తెలంగాణ పాట మాత్రం ముక్కలు ముక్కలైంది. ఆ పాట గాలిలో గిరికీలు కొడుతూ గుండెను చీలుస్తూ ఉంటుంది. దానికి మరణం లేదు. ఆ మరణం కేవలం దేహానికి మాత్రమే. ఆత్మకు మరణం లేదు కదా! నేను ఆశ్రయించిన దేహాన్ని నాశనం చేసినవాళ్లు నన్ను నాశనం చేయలేకపోయారని నిరంతరం ప్రకటిస్తూనే ఉంది ఆ పాట. ఆ ప్రకటన శిలాక్షరమై గాలి హోరులో నిలబడిపోయింది. దాన్ని తెలంగాణ ప్రజలు చూస్తూనే వింటూనే ఉన్నారు; వింటూనే ఉంటారు.

ఆ పాట ఆశ్రయించిన దేహాన్ని నాశనం చేసిన తర్వాత అదే భువనగిరిలో ఓ హత్య జరిగింది. ఆ హత్య ఆ పాటను ఆశ్రయించిన దేహానికి పాత మిత్రునిది, కొత్త శత్రువుది. ఆ హత్య తర్వాతే పోచయ్య శరీరం తునాతునకలైంది. ఈ హత్యకు సాక్ష్యాలు లేవు. హత్య వెనుక హత్య, చావు వెనక చావు. ఎవరిదీ నాదే అనిపించింది రాంరెడ్డికి. తన దేహం ముక్కలు ముక్కులుగా నరకబడి కాకులకు, గద్దలకు వేస్తున్న భయ విహ్వలత. ఆ దారి గుండా ఊరికెళ్లినప్పుడు, వస్తున్నప్పుడు శవమై కాష్టాల గడ్డ మీద అడుగులేస్తున్న భ్రాంతి. కాటికాపరి లేని కాష్టాల గడ్డ. అక్కడ ఎవరినైనా ఎప్పుడైనా బొంద పెట్టవచ్చు. బొండిగ పిసికి బొంద పెట్టడానికి అడ్డంకులు, అవరోధాలు ఏవీ లేవు.
........ .................. ...................

దేహాలను ముక్కలు ముక్కలు చేయడమే కాదు హృదయాన్ని కూడా ముక్కలు ముక్కలు చేస్తారిక్కడ. హృదయాలను తునాతునకలు చేసి ఆలోచనలను కట్టడి చేయడం ఇక్కడ ఒక ప్రత్యామ్నాయ కార్యాచరణ. ఈ ప్రత్నామ్నాయ రాజకీయాల ఆలోచనాపరులది ఇందులో అందె వేసిన చేయి. రాంరెడ్డి మనసు కుతకుతా ఉడికిపోతున్నది. నాలుగేళ్లుగా స్వతంత్రంగా ఎదుగుతున్న ఉద్యమానికి సంకెళ్లు వేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అతని మనసెందుకో శంకిస్తున్నది.

విశాలమైన మైదానం. ఆ మైదానంలో పశ్చిమ దిక్కున పెద్ద వేదిక. ఈ వేదికపై పది మంది వక్తలు. అందరూ తెలిసినవారే. పౌరహక్కుల ఉద్యమంలోనూ, విప్లవ సాహిత్య ఉద్యమంలోనూ గొంతు దాకా దిగబడి క్షణం తీరిక లేనివారే. ఇంతవరకు చేస్తున్న ఉద్యమాలతోనే కింది మీదవుతున్న వీరికి మరో కొత్త ఉద్యమెందుకో అర్థం కాలేదు.

గత నాలుగేళ్లుగా తెలంగాణ ఉద్యమం నడుస్తూ ఒక స్థాయికి వచ్చింది. కొత్త నేతలు, కొత్త వ్యాఖ్యాతలు ముందుకు వచ్చారు. కొత్త సంస్థలు పుట్టాయి. ఎక్కడికక్కడ ఎవరి స్థాయిలో తెలంగాణపై సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. పుస్తకాలు రాస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కావాలని డిమాండ్‌ చేస్తున్నారు. తమకు జరిగిన అన్యాయాలపై గొంతెత్తి అరుస్తున్నారు. వీటిన్నంటినీ కలిపి ఒక ఐక్య వేదిక ఏర్పడింది. ఈ కొత్తకు ఏ మాత్రం చోటు లేకుండా తెలంగాణపై ఈ సభ. స్పష్టంగా తెలియకపోయినప్పటికీ ఏదో తనకు ఇష్టం లేనిది జరుగుతున్నట్లు మాత్రం అనిపిస్తోంది రాంరెడ్డికి.

వేదిక మీద వక్తలు ఒక్కరొక్కరే మాట్లాడుతున్నారు. అందరూ తెలంగాణలోని రాజ్యహింసనే ప్రధానంగా ప్రస్తావించారు. చివరగా వేదిక మీంచి ఒక తెలంగాణ సంస్థను ప్రకటించారు. దాని లక్ష్య ప్రకటన కూడా వెలువడింది. లక్ష్యప్రకటన వెలువడినంతనే రాంరెడ్డిలో నిరాశ, నిస్సత్తువ ఆవహించాయి. తమకు కేవల తెలంగాణ రాష్ట్రం అవసరం లేదని, ప్రజాస్వామిక తెలంగాణ అవసరమని వేదిక మీంచి ఆ సంస్థ బాధ్యుడు ప్రకటించారు. ఇది సాధ్యమయ్యే పని కాదనేది, తెలంగాణ రాష్ట్రం కోసం నడుస్తున్న ఉద్యమాన్ని దెబ్బ తీసేదని రాంరెడ్డికి ఎందుకో అనిపించింది. ఇదే అభిప్రాయాన్ని పక్కనే ఉన్న విప్లవ కవి రాజిరెడ్డితో వద్ద వ్యక్తం చేశాడు.

రాజిరెడ్డి కొంచెం తత్తరపడ్డట్టు కనిపించాడు. అతని ముఖంలో రంగులు మారడం రాంరెడ్డి కనిపెట్టకపోలేదు.
''అట్లా బయకు పోదామా?'' అడిగాడు రాజిరెడ్డి.

సరేనంటూ రాంరెడ్డి అతన్ని అనుసరించాడు. ఇద్దరూ మైదానం వెలుపలికి వచ్చి ఒక ఇరానీ హోటల్‌లో కూర్చున్నారు. హోటల్‌ రద్దీగా ఉంది. పొగలు కక్కే టీలను చప్పరిస్తూ, సిగరెట్లు, బీడీలు తాగుతూ జనాలు. ఆ ఉక్కపోతలో ఇద్దరూ ఒక టేబుల్‌ చూసుకుని కుర్చీలపై కూర్చున్నారు.

టీకి ఆర్డర్‌ ఇచ్చారు. టీ వచ్చే వరకు ఇరువురి మధ్య మౌనం. రెండు ధృవాలకు మధ్య, రెండు ఆలోచనలకు మధ్య, రెండు హృదయాలకు మధ్య మౌనంలా ఆ మౌనం. ఇద్దరి మెదళ్లు మాత్రం చరుగ్గా పని చేస్తున్నాయి. బహుశా ఎవరి వాదనలకు వారు పదును పెట్టుకనే ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు.

వెయిటర్‌ నిండు టీతో ఒక కప్పు, మరో ఖాళీ కప్పు తెచ్చి టేబుల్‌పై పెట్టాడు. అతను కప్పులు పెట్టిన శబ్దానికి ఇరువురు ఒక్కసారిగా కదిలారు. నిండు కప్పులోని టీని సగం ఖాళీ కప్పులో వంపి ఆ కప్పును రాంరెడ్డి వైపు జరిపాడు రాజిరెడ్డి. ఆ కప్పును అందుకుని టీని రుచి చూసి కప్పును టేబుల్‌పై పెట్టి జేబులోంచి సిగరెట్టు తీసి పెదవుల మధ్య బిగించాడు రాంరెడ్డి. అతని వైపు రాజిరెడ్డి ఓరగా చూశాడు. రాజిరెడ్డి నిజామాబాద్‌ జిల్లాలోని ఓ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌. అగ్గిపెట్టె తీసి సిగరెట్టు అంటించి గట్టిగా పొగ లాగి వదిలాడు రాంరెడ్డి.

''ఏమో అంటున్నారు మీరు?'' ప్రశ్నించాడు రాజిరెడ్డి.
''నేను అనేది ఏముంది? స్పష్టంగా తెలిసిపోతూ ఉంటే...'' అన్నాడు అసహనంగా రాంరెడ్డి.
''మీ అభిప్రాయమేమిటని....''

''ప్రజాస్వామిక తెలంగాణ అంటే ఏమిటో మీకు అర్థం కాలేదా? ఇప్పటి సిస్టమ్‌లో తెలంగాణ వద్దని, కమ్యూనిస్టు తెలంగాణ కావాలని అనడమే కదా. అంటే విప్లవం ద్వారా తెలంగాణ సాధిస్తామని చెప్పడమే కదా, అంటే ప్రజాస్వామికంగా నడుస్తున్న ఉద్యమానికి పరిమితులు విధిస్తున్నట్లే కదా!'' తన మెదడు తొలుస్తున్న విషయాన్ని బయట పెట్టాడు రాంరెడ్డి. అది బయట పెట్టాక మనసు కొంచెం తేలకైనట్లనిపించింది.

''అదెట్లా అవుతుంది?'' అడిగాడు రాజిరెడ్డి.
''ప్రజాస్వామిక ఉద్యమాలు ఎదగకుండా విప్లవోద్యమం కట్టడి చేస్తుందని నా అభిప్రాయం'' అన్నాడు రాంరెడ్డి.
''అట్లెందుకు అవుతుంది?'' మరో ప్రశ్న.

''డాక్టర్‌ అందె నారాయణ విషయంలో ఏం జరిగింది...?'' ఎదురు ప్రశ్న వేశాడు రాంరెడ్డి. అంతటితో ఆగలేదు. ''అందె నారాయణను పోలీసులు చంపేసినప్పుడు స్వచ్ఛందంగా పెల్లుబుకిన ఉద్యమం ఎందుకు నీరుగారిపోయింది? అందె నారాయణ హత్యకు నిరసనగా వీధులకెక్కిన ప్రజలు ఏదో భూతం భయపెట్టినట్లుగా తమ తమ ఇళ్ల కలుగుల్లోకి ఎందుకు ముడుచుకుపోయారు?'' అన్నాడు. రాజిరెడ్డి మాట్లాడలేదు.

''విప్లవ సంస్థల చర్య వల్ల ప్రజాస్వామిక ఉద్యమాలు ముందుకు సాగుతున్నాయో, వెనకడుగు వేస్తున్నాయో ఎందుకు ఆలోచించరు?'' తన్నుకొస్తున్న ఆగ్రహాన్ని ఆపుకోలేక పోయాడు రాంరెడ్డి. గుండె కోత పెట్టినట్లుగా ఉంది. 'నూరు పూలు వికసించనీ, వేయి ఆలోచనలు విలసిల్లనీ' అంటూనే ఎందుకింత దారుణంగా వ్యవహరిస్తారనేది రాంరెడ్డికి అంతు చిక్కని విషయం. డాక్టర్‌ నారాయణ తమ వాడే అని ప్రకటించుకోకపోతే విప్లవోద్యమానికి వచ్చిన నష్టమేమిటో రాంరెడ్డికి ఎప్పటికీ అంతుబట్టకపోవచ్చు. ఈ విషయం అంతుబట్టకపోవడం వల్లనే వారెందుకు ఆలోచించరని బాధపడుతూ వుంటాడు. మెదడు వేయి ముక్కలుగా చీల్చుకుని మళ్లీ అతికించుకుంటాడు.
.............. ................. ....................

వరంగల్‌ జిల్లాలోని ఓ చిన్న పల్లెటూరు. దేహమంతా తూట్లు పడి ఓ ఇంటి డాక్టర్‌ అందె నారాయణ శవం. ఊరు ఊరంతా ఆ శవం దగ్గరే. ఆ శవాన్ని పోస్టుమార్టం కోసం తీసికెళ్తామంటూ పోలీసులు. వారిని అడ్డగిస్తూ జనాలు. ప్రజల శాపనార్థాలకే శక్తి వుంటే పోలీసు వ్యవస్థ అక్కడికక్కడ మాడిమసై పోయి వుండేది. కానీ ప్రజల తిట్లకు ఆ శక్తి లేదని ఎప్పటికప్పుడు రుజువవుతూనే ఉంది.

ప్రజలను ఎలా ఒప్పించాలో, వారి నుంచి శవాన్ని ఎట్లా తప్పించాలో పోలీసు అధికారులకు అంతు చిక్కడం లేదు. నారాయణను ప్రజల హృదయాల్లోంచి చెరిపేయలేమనే విషయం పోలీసులకు తెలుసు; వారిని నడిపిస్తున్న ప్రభుత్వానికీ తెలుసు. కానీ మృతదేహాన్ని, దాని ఆనవాళ్లను చెరిపేయడం మాత్రం దుస్సాధ్యం కాదు.

ఒకానొక చీకటి రాత్రి ఆగంతకుల రూపంలో అందె నారాయణను మృత్యువు కాటేసింది. దానికి పోలీసులు చెప్పే కారణం- అతనికి నక్సలైట్లతో ఉన్న సంబంధాలు. ఈ విషయాలు ప్రజలకు అవసరం లేదు. అతను నక్సలైట్లకు వైద్యం చేశాడనేది ఒక ఆరోపణ. అందుకే అతన్ని చావు తీసికెళ్లిందనేది వారి తీర్పు.

తెలంగాణ జిల్లాల్లో నక్సలైట్లు చెప్పిన పనులు చేయకుండా ఉండడం ఎంత కష్టమో ఎవరికీ తెలియంది. ఇష్టమున్నా లేకున్నా వారి ఆజ్ఞలను పాటించాల్సిందే. వారి మీద సానుభూతి ఉంటే అది వేరే విషయం. ఏలేది తమ కష్టాలను కడగండ్లను తీర్చే ప్రభుత్వం కానప్పుడు ప్రజలు వీరులను ప్రేమిస్తారు. వారి సాహసాలను కీర్తిస్తారు. అలా ప్రజల ప్రేమకు పాత్రులైన వీరులు చరిత్ర పొడుగునా వున్నారు. అందె నారాయణ అటువంటి ప్రజల్లో ఒకడు కావచ్చు. కానీ మంచి డాక్టర్‌. ప్రజల ప్రేమకు పాత్రుడైన డాక్టర్‌. రోగాలు నయం చేసే అద్భుత శక్తేదో నారాయణ చేతికి ఉంది. ఆయన ముట్టుకుంటే చాలు, వ్యాధి భయపడి పారిపోతుంది. సరైన తిండి దొరకని ఒక మారు మూల పల్లెలో డాక్టర్‌ ఉండడమే కష్టం, అదీ అందె నారాయణ లాంటి డాక్టర్‌ వుండడం అసలు ఊహించలేం. అందుకే ప్రజలు అతనికి నీరాజనాలు పట్టారు. తమ దైవాన్ని కాకులు, గద్దలు తన్నుకుపోయినందుకు గుండెలు మండి వీధులకెక్కారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X