తెలుగు రక్షణ అవసరమా?
శుక్రవారం ఆగస్టు 29వ తేదీన గిడుగు రామ్మూర్తి పంతులు జయంతిని తెలుగు భాషా పరిరక్షణ దినంగా పరిగణిస్తున్నారు. గిడుగు రామ్మూర్తి పంతులు గ్రాంథిక భాషపై నిరంతర పోరాటం చేసి వాడుక భాషకు పట్టం కట్టడానికి నిరంతర పోరాటం చేశారు. ఆ కాలంలో గ్రాంథిక భాషవాదులను ఎదుర్కోవడం అంత సామాన్య విషయమేమీ కాదు. రాతకు గ్రాంథిక భాషనే వాడాలనే నియమాన్ని ఆయన బద్దలు కొట్టారు. దాన్ని ఆచరణలో చూపించినవాడు కన్యాశుల్కం నాటక రచయిత, ముత్యాలసరాల సరాల సృష్టికర్త గురజాడ అప్పారావు. మొత్తం మీద వాడుక భాష విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. సాధారణ రాతకోతలకే కాకుండా సాహిత్య రచనకు కూడా వాడుక భాషను ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది. తెలుగు సాహిత్య విభాగంలో పరిశోధనలను గ్రాంథిక భాషలో రాయడం కూడా పూర్తిగా తగ్గిపోయింది. గ్రాంథిక భాషను రాసేనవారిని ఛాందసవాదులుగా భావించేంతగా వాడుక భాష నిలదొక్కుకుంది. దాంతో పాటు మాండలిక భాష వాడుకకు కూడా గౌరవం పెరిగింది. సృజనాత్మక సాహిత్య రచన మాండలిక భాషలో, ప్రాంతీయ భాషల్లో జరుగుతున్నది. రావిశాస్త్రి, డాక్టర్ కేశవరెడ్డి, అల్లం రాజయ్య, నామిని సుబ్రహ్మణ్యం నాయుడు వంటి ఎందరో రచయితలు తమ తమ ప్రాంతీయ మాండలికాల్లో రచనలు చేసి పాఠకులను మెప్పించారు.
అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో తెలుగు భాష మనుగడకు ప్రమాదం ఏర్పడిందే వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తున్నది. భాషా పరిరక్షణకు ఉద్యమాలు కూడా సాగుతున్నాయి. భాషకు, జీవనోపాధికి పరస్పరం సంబంధం ఉండడంతో విద్యాబుద్ధులను ఆంగ్లంలో నేర్చుకోవడం పెరిగింది. ఇంగ్లీష్ మాధ్యమానికి విద్యాసంస్థల్లో ఆదరణ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆంగ్లమాధ్యమ పాఠశాలలు వెలిశాయి. దీన్ని వ్యతిరేకించే వర్గం ఒకటి తయారైంది. తెలుగు మాధ్యమంలో పాఠాల బోధన జరగాలని ఒక వర్గం గట్టిగా డిమాండ్ చేస్తున్నది. వీరి తపనను తప్పుగా భావించలేం. కానీ, భాషకు, జీవనోపాధికి అవినాభావ సంబంధం ఉన్నప్పుడు కేవలం ఆదర్శం కోసం విద్యాసంస్థల్లో తెలుగు మాధ్యమమే ఉండాలని వాదించడం అంత సరైంది కాదేమో. అయితే పోస్టు గ్రాడ్యుయేట్ స్థాయిలోనూ తెలుగు మాధ్యమం అమలులోకి వచ్చింది. ఎంతో మంది తెలుగు మాధ్యమంలో పరీక్షలు రాసి పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలు సాధించారు. కానీ ఆంగ్లం రాకుండా ఉద్యోగాలు పొందడం కష్టంగానే ఉంది. దీంతోనే హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాకుండా పట్టణాల్లోనూ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్లు వెలిశాయి. ఆంగ్లంలో మాట్లాడటం, రాయటం వంటి విషయాల్లో ఇవి శిక్షణ ఇస్తున్నాయి. కంప్యూటర్ కోర్సుల్లో ఆంగ్లం తప్పనిసరిగా మారింది. అందువల్ల ఆంగ్లభాషను కాదనలేని స్థితి. దీనివల్ల తెలుగు అంతరించిపోతుందనే వాదన సరైంది కాదేమో. నిజానికి ఈ వాదనను తెస్తున్నవారు ప్రధానంగా తమ సంతతిని ఆంగ్ల మాధ్యమంలో చదివించి, సాఫ్ట్ వేర్ వంటి ఆధునిక సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా శిక్షణ ఇప్పించి, వారిని అమెరికా వంటి విదేశాలకు పంపినవారే కావడం విశేషం. అందువల్ల వీరి వాదనకు కొంత వ్యతిరేకత ఎదరవుతున్నది.
అదే సమయంలో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం ముందుకు వచ్చిన ప్రతిసారీ కోస్తా ఆధిపత్యవాదులు భాషా పరిరక్షణ వంటి ఉద్యమాలను ముందుకు తెచ్చి సమైక్యతా రాగానికి మద్దతు కూడగడుతున్నారనే విమర్శ ఉంది. ఇందులో సత్యం లేకపోలేదు. నిజానికి, తెలంగాణ సాహిత్యకారులు తమ సాహిత్య, సాంస్కృతిక ఉద్యమాల్లో భాగంగా ప్రజల భాషకు పట్టం కడుతున్నారు. సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమంలో వారు తెలంగాణ భాష పరిరక్షణను కూడా ఒక అంశంగా భావిస్తున్నారు. విప్లవ సాహిత్యోద్యమ కాలం నుంచే తెలంగాణ భాష సాహిత్యంలో ప్రధాన స్రవంతిగా చోటు చేసుకోవడం ప్రారంభమైంది. ఇప్పుడు కవిత్వాన్ని కూడా తెలంగాణ భాషలో రాసి సాహితీప్రియులను ఆకట్టుకుంటున్నారు. సాహిత్యానికి భాష ద్వారా జవజీవాలు అందిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ సాహితీవేత్తలు చేస్తున్న ఈ కృషిని భాషా పరిరక్షణ ఉద్యమకారులు భాషా పరిరక్షణ ఉద్యమంలో భాగంగా చూడడం లేదు. తెలంగాణ రచయితల ప్రస్తుత కృషిని ఆ ఉద్యమంలో ఇమిడ్చుకుంటే అది మరింత విస్తృతమవుతుందనే విషయాన్ని వారు పట్టించుకోవడం లేదు. అందువల్ల కోస్తా వాదుల నుంచి మొదలైన భాషా పరిరక్షణ ఉద్యమాన్ని తెలంగాణ సాహిత్యకారులు తమ అస్తిత్వ ఉద్యమానికి వ్యతిరేకంగా వచ్చిందని భావిస్తున్నారు. అలా భావించడానికి కారణం ప్రస్తుత అనుభమే కాకుండా గతానుభవాలు కూడా కారణం.
తెలుగు సాహిత్య చరిత్రలో తెలంగాణ సాహిత్యానికి ఇప్పటి వరకు సరైన స్థానం కల్పించలేదు. దానికితోడు, తెలంగాణ భాషా వాడకాన్ని కూడా ఆహ్వానించడం లేదు. తెలుగు భాషా పదకోశాలను తయారు చేసినప్పుడు తెలంగాణ పదాలకు చోటు కల్పించడం లేదు. గోంగూరకు పుంటికూర సమానార్థకమనే విషయాన్ని కూడా వారు అంగీకరించడం లేదు. పైగా పుంటికూర వంటి పదాలను తక్కువ చేసి మాట్లాడడం కూడా పరిపాటి అయింది. పుంటికూర అనే పదం వింటే పుండ్లు గుర్తొస్తాయని విశ్వనాథ సత్యనారాయణ అంటే, గోంగూర పేరు వింటే గోకుడు గుర్తొస్తుందని పి. యశోదారెడ్డి అన్నటువంటి ఉదంతం ఉండనే ఉన్నది. అందువల్ల తెలంగాణ భాషకు తగిన గౌరవాన్ని ఇవ్వకుండా భాషా పరిరక్షణ ఉద్యమంలో కలిసి రావాలని కోరడం కార్యకర్తలుగా పనిచేయాలని అడగడమే కాకుండా తమ భాషను రక్షించడానికి మీరు పనిచేయాలని చెప్పడమే అవుతుంది. తెలుగు భాష అంటే అన్ని ప్రాంతాల భాష అనే విశాల దృక్పథాన్ని అలవరుచుకోవడం నేటి అవసరం.












Click it and Unblock the Notifications