'నేనూ ఇక్కడ' అంటున్న కవి

Posted By:
Subscribe to Oneindia Telugu
Ammangi Venugopal
తాండూరు గనులక ప్రసిద్ధి. యాభై యేళ్ల క్రితం దాకా రంగారెడ్డి జిల్లాలోని ఇళ్ల పైకప్పులకూ, ఫ్లోరింగుకూ తాండూరు బండలనే వాడేవాళ్లు. ఇప్పటికీ కటికనేల మీద నడిచే పేదవాళ్లకు కూడా అందుబాటులో ఉన్నది "తాండూరు బ్లూ" ఒక్కటే. కవి కోటం చంద్రశేఖర్ కూడా పేదరైతులకు అందుబాటులో ఉన్న గ్రామీణ బ్యాంకులో అధికారిగా సేవలు అందిస్తూ, తన ఊరి సంస్కృతినే అలవరుచుకున్నాడు. అందుకే -

"సన్నకారు రైతుల కళ్లన్నీ సంద్రాలే చిన్నకారు రైతుల గుండెలన్నీ రంధ్రాలే" (లొల్లంతా కట్టనివాడిదే) - అంటూ వాస్తవాన్ని చెప్పగలిగాడు.

వికారాబాద్ దగ్గరలో ఉన్న మా ఆలంపల్లికి కోటం చంద్రశేఖఱ్ తాండూరు రైలు కూతవేటు దూరం. ఇనుపదారితో పాటు రహదారీ ఉంది. అందుకేనేమో నేను ఏ ఊళ్లో పనిచేస్తున్నా శేఖర్‌కు మా యింటి దారి సులభంగా దొరికేది. మొదటిసారి 1990 ప్రాంతంలో అనుకుంటా శేఖర్, ఐలేని గిరి అనే మరో యువకవితో కలిసి మా యింటికి వచ్చాడు. అదే తొలి పరిచయం. ఆ ఇద్దరిలో కవిత్వం పట్ల ప్రేమాభిమానాలు నన్ను కదిలించాయి. కవిత్వాన్ని ప్రేమించేవాళ్లు జీవితాన్ని ప్రేమిస్తారని నాకో నమ్మకం. నా నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ ఇద్దరూ తమతమ మార్గాల్లో నడుస్తూ వస్తున్నారు. శేఖర్ కవిత్వమే చదువుతాడు, కవిత్వమే రాస్తాడు. కవిత్వం తప్ప మరో ప్రక్రియతో సంబంధం పెట్టుకోలేదు. తన ప్రపంచంలో కవిత్వానికి ఎక్కువ స్థానం ఇవ్వటంతో అది ఆయన్ను బయటకు నెట్టేసి తాను తిష్టవేసుకునే అవకాశం లేకపోలేదు.

చంద్రశేఖర్ ఇప్పటి దాకా "క్షిపణి" (1995), "ఆవిష్కరణ" (2000) కవితా సంపుటాలను ప్రచురించాడు.

వీటిలో తొలి సంపుటికే "సినారె సాహితీ పురస్కారం" 1995లో, మలి సంపుటికి "గీతం ఉత్తమ కావ్యం" 2007లో అందుకున్నాడు. పోటీలకు పంపిన కొన్ని కవితలకు బహుమతులు కూడా వచ్చాయి. ప్రతి నెలా ఏదో ఒక పత్రికలో శేఖర్ కవిత్వం అచ్చవుతుంది. అప్పుడప్పుడు కవిసమ్మేళనాల్లో కూడా పాల్గొంటాడు, రేడియోలో వినిపిస్తుంటాడు. అంటే, ప్రక్రియాపరమైన సృజనాత్మక కార్యకలాపాల్లో శేఖర్ చురుకుగా పాల్గొంటున్నాడన్న మాట.

ఇప్పుడీ "సమ్మోహనం" కవితా సంపుటి డిటిపి కాపీ నా ముందు పెట్టి "ముందుమాట" రాయమని కోరాడు. సుమారు నూటా యాభై పేజీల దాకా ఉన్న సంపుటిని చూసి బాగానే రాశాడనిపించింది. మొదటి కవిత -

"లేవు దాపరికాలు
లేవు దాగుడు మూతలు
లోపలొకటి, బైటోకటా?
లోపలున్నదే బైటిిక..." (లోపలొకటి బయటొకటా?) - ప్రారంభ పంక్తులు నిలదీశాయి. మనసులో అనుకునేదే పైకి చెప్పడం, చెప్పినట్లు నడుచుకోవడం నిజాయితీ ఉన్న మనిషి నైజం. ఇక్కడ తన పక్షాన కాకుండా ఒక సమూహం పక్షాన, జాతి పక్షాన మాట్లాడుతున్నాడు. సామాన్యుడైన కవికి కవిత్వం కవిత్వం, ఒక ప్లాట్‌ఫామ్ లాంటిది. జనసమూహాల ప్రతినిధిని చేస్తుంది. తన జాతి ప్రజలకు కుట్ర బుద్ధిలేదని, లోలోన గోతులు తవ్వే తత్వం తమది కాదని అంటున్న కవిని అభిమానించక తప్పదు.

వరంగల్‌లో ఇద్దరు విద్యార్థినుల మీద ప్రేమ పేరుతో జరిగిన యాసిడ్ దాడిలో ఒకరి మృతి, దాడి చేసిన విద్యార్థులు పోలీస్ ఎన్‌కౌంటర్‌వో మృతి - రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. రెండో అమ్మాయి ప్రణీత పునర్జన్మ ఎత్తి పరీక్షలు రాయడమంటే పురుషాధిక్య సమాజం మీద గెలుపును సాధించడమే.

"భావోద్వేగాల మధ్య గెలుపు ఆమెది
రాగద్వేషాల మధ్య గెలుపు ఆమెది
పొంచి వున్న ప్రతీపశక్తుల వికృతి మీద
వీరత్వం ఆమెది, విజయం ఆమెది" (పరీక్షలు రాసిన ప్రణీత) - అంటూ అభిమానవూర్వక ఉద్వేగం ప్రకటిస్తాడు శేఖర్. ఈ దుర్ఘటనలో ప్రణీత నేర్చుకున్నదెంత వుందో, మనకు నేర్పిందీ అంతే వుంది. స్ఫూర్తిదాయక చైతన్యం ఎప్పుడూ జీవితాన్ని గెలుచుకుంటుంది. ఇతర కవితల్లో కూడా చాలా చోట్ల శేఖర్ స్త్రీచైతన్యాన్ని ఆపేక్షించడం, సమర్థించడం కనిపిస్తుంది.

పెంపుడు జంతువుల మీద, పక్షుల మీద చాలా కవిత్వమే కనిపిస్తుంది. పంజరంలోని పక్షిని సింబాలిక్‌గా వర్ణించడం, కుక్కను విశ్వాసానికి ప్రతీకగా చెప్పడం మనకు కొత్తేమీ కాదు. ఎవరి వంటింట్లోకైనా చొరవతో ప్రవేశించి యజమాని(ని) మనసు గెలుచుకుని, స్థిరచరాస్తులైన అటకలు, ఎలుకల మీద సార్వభౌమాధికాకరం సరేసరి. "ఒక పిల్లి గూర్చి" కవిత చదివితే ఒక సత్యం బోధపడుతుంది. పెంపుడు జంతువులను ప్రేమించి, చేరదీయడంలో తల్లితరానికి కొడుకుతరానికి మధ్య అంతరం ఉంది. వాళ్లంత గాఢంగా వీళ్లు వాటిని ప్రేమించడం లేదు.

"దీనికి భయం లేదు
అడవిలో మృగరాజులా ఆఫీసులో బిగ్ బాస్‌లా
నాకైతే అనుమానం ఎలుకలు పట్టేదో ఫోజులు పెట్టేదో" - ఇట్లాంటి పిల్లిని చంకన పెట్టుకుని ఏ కవిసమ్మేళనానికైనా శేఖర్ వెళ్లొచ్చు. అట్లాగే పెంపుడు కుక్క మీద రాసిన "జానీ నాకు అన్నీ" అన్న కవిత, "విశ్వాసాన్ని శాసిస్తూ" విధి నిర్వహణలో అసువులు బాసిన కుక్క కథ.

కళలపట్ల చంద్రశేఖర్‌కు ప్రత్యేక ఆసక్తి ఉంది. అట్లాగే గౌతమబుద్ధుని పట్ల అపారమైన అభిమానం ఉంది. బౌద్ధమత ప్రభావంతో కొత్తగా ప్రారంభమైన వాస్తుకళ, చిత్రకళ, శిల్పకళలకు సంబంధించిన రీతులు ప్రత్యేక అస్తిత్వంతో రూపుదిద్దుకున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గాంధారశైలి చెప్పుకొదగ్గదని కళామర్మజ్ఞులు చెప్తుంటారు. శేఖర్ ఎల్లోరా అజంతాలను గూర్చిన "సమ్మోహనం" కవితలో "మానవ సృష్టి మహాసృష్టి" అంటున్నాడు. ఈ "ఉలిరేఖలు, కళలేఖలు" శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రస్ఫుటింపజేస్తున్నాయని కూడా గుర్తిస్తున్నాడు. సౌందర్యద్వేషం (Vandalism) కారణంగా, ఆయా కళలకు పట్టిన దుర్గతికి చింతిస్తున్నాడు. దశాబ్దం క్రితం అఫ్ఘనిస్తాన్‌లో అప్పటి నిరంకుశ మత దురహంకార ప్రభుత్వం గౌతమబుద్ధుని మహోన్నత శిలావిగ్రహాలను నిర్మూలించడాన్ని, స్త్రీల పట్ల భయంకరమైన వివక్షతో ప్రవర్తించడాన్ని "అపచార పర్వం - అహింసామూర్తి" అన్ కవితలో ఖండిస్తున్నాడు. "మింటికెగిసిన విశిష్ట సంస్కృతీ వారసత్వం" వైపు నిలుస్తాడు. ఇది ధర్మాగ్రహంతో ఊగిపోయే పాదాలున్న కవిత. "మాకో బుద్ధుడు కావాలి అన్న కవితలో -

"కళింగ కదనరంగ కళేబరాల కరళా నృత్యంతో
అశోకుడు శోకతప్తుడయ్యాడు
నీలో
మాకో బుద్ధుడు కావాలి" - అంటున్నాడు. హింసోన్మాదం బయటి ప్రపంచాన్ని మాత్రమే కాదు, లోపటి ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. హింస నుంచి అహింస వైపు మళ్లినవాడు బుద్ధుడికీ, అశోకుడికీ వారసుడవుతాడు.

చంద్రశేఖర్ రాసిన మంచి కవితల్లో "నేనూ ఇక్కడ" ఒకటి. వైయక్తిక శ్రేణికి చెందిందే అయినా, వానజల్లుకకు ఒక కుటుంబం స్పందించడం వుంది.

"అమ్మ మొక్కలను సర్దుతోంది
అమ్మమ్మ దగ్గర స్నేహ తొక్కుడుబిల్ల ఆడుతోంది
వంటింట్లోంచి
ఆమె
కేకలు లోపలికి రమ్మని" - నాలుగు తరాల స్పందనలున్నాయి. వృద్ధ్యాప్యం, నడివయస్సు, యౌవనం, బాల్యం. వానలో ఆట వానతో ఆట పట్ల పెద్దవాళ్లు బాల్యానికి దగ్గరగా ఉంటే, యౌవనం మాత్రం బిడ్డకు అనారోగ్యం చేస్తుందేమోనన్న కారణాన అభ్యంతర పెడుతున్నది. యౌవనానికి తోడుగా జోడుగా ఉన్న కవి మాత్రం వాన సృష్టించిన ప్రణయావరణంలోకి ప్రవేశించాడు.

"బైటివాళ్లకే పిలుపా? గదిలో
నేనూ ఇక్కడ లోలోపల తడుస్తూ
కవితల్ని పడవలు చేసి వదుల్తూ" అంటాడు. వానజల్లు వీధిలో చిరు ప్రవాహంగా మారే క్రమంలో పాఠకుల మనోవీధుల్లో కవితల పడవలు కట్టే వాతావరణాన్ని సృష్టించగలిగింది. అంతర్ బహిర్ వాతావరణాల అనుసంధానానికి మంచి ఉదాహరణ ఈ కవిత.

లోపాలు లేవని కాదు.

ముఖ్యంగా శబ్దాలంకారాల పట్ల కవికి ఇదివరకు లేని మోజు ఈ సంపుటిలో కనిపిస్తుంది. అక్షరాలను Transparentగా మార్చి భావాలను ప్రదర్శించడమనే కళను సాధించగలిగినవాడు ఎవరైనా మంచి కవి కాగలుగుతాడు. ఆ భావాలు ఎట్లాంటివన్న ప్రశన్న ఎట్లాగూ ఉంటుంది. శేఖర్ మరింత అధ్యయనశీలి కావాలని, అప్పుడు గనుల లోతు, సైరన్ మోతలు కూడా మరింత బాగా అర్థమవుతాయని భావిస్తున్నాను.

- డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్ కోటం చంద్రశేఖర్ "సమ్మోహనం" కవితాసంకలనం గురించి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A prominent Telugu poet Kotam chandrasekhar has released his poetry collection "Sammohanam". An eminent critic Ammangi Venugopal has tried to analyze Kotam Chandrasekhar's poetry.
Please Wait while comments are loading...