• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మనం మరచిన వేమన తత్త్వం

By Pratap
|

Dr Chavva Venkat Reddy on Vemana philosophy
తెలుగు సాహిత్యంలో వేమన పేరు తెలియనివారుండరు. విభిన్న కోణాలను సామాజిక వాస్తవాలకు దగ్గరగా మలచడంలో వేమనను మించిన వారెవరులేరని చెప్పడం అతిశయోక్తికాదు. వేమన అనగా చాలామంది దిగంబరుడుగా ఒక రూపాన్ని ఊహించుకుంటారు. దీనికిగల కారణాలు అనేకం ఉన్నాయి.

''తల్లి గర్భమందు తాపుట్టినప్పుడు

మొదట బట్ట లేదు తుదను లేదు

నడుమ బట్టగట్ట నగుబాటు కాదొకో...'' అని వేమన చెప్పిన వైరాగ్య భావంతో కూడిన పద్యం ఆధారంగా వేమన దిగంబరుడని అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది గోచీ మాత్రం పెట్టుకున్నాడని ఊహించారు. వేమన దిగంబరుడే అని ఒక ఐతిహ్యం కూడ ప్రచారంలో ఉంది. సిపాయిల తిరుగుబాటు జరుగుచున్న రోజుల్లో అంటే 1857 లో కడప జిల్లాలో ఒక బ్రిటిష్‌ ఉద్యోగి జె.బి.బి. గ్రిబిల్‌ ఇలా చెప్పాడు ''కొమ్ములు వాడిగా ఉండి, బలిసి బుసలు కొట్టే రెండు కోడెలను తన మొలపంచెను విప్పి ఎగగట్టి భీమ బలంతో వాటి కొమ్ములను పట్టి చెదరగొట్టి అట్లాగే దిగంబరుడై కదలిపోయిన వేమన బైరాగి అయినట్లు ప్రచారం వచ్చింది. దీనికి తోడు తంజావూరులో సరస్వతి మహల్‌లో ఒక బొమ్మ దొరికింది. దాని ఆధారంగా 'రెడ్డివాణి' అనే పత్రికలో 1920 ప్రాంతంలో ఈ బొమ్మ ప్రచురింపబడి ప్రచారంలోకి వచ్చింది.

వేమన మీద పరిశోధన చేసిన సి.పి. బ్రౌన్‌, ఆరుద్ర గాని, ఎన్‌.గోపి గాని, గాని ఆయనను దిగంబరుడుగా ఎక్కడా పేర్కొనలేదు. గోపి వేమనను ప్రజాకవిగా, ఆరుద్ర హేతువాది అయిన చార్వాకుడుగా అభిప్రాయపడినారు. ''చిత్త శుద్ధిలేని శివపూజలేలరా'' అన్న పద్యం అప్పుడు చాలా గొడవలకు దారి తీసింది. వేమన స్త్రీ జాతిని గర్హించిన తీరు గమనిస్తే ఆయన వీరశైవుడు కానేకాదనడానికి నిదర్శనమని బ్రౌన్‌ దొర అభిప్రాయపడినాడు. వేమన ఒక తాత్త్వికుడిగా, విమర్శకుడిగా, యోగిగా, భోగిగా, ప్రజాకవిగా సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం ఆరాటపడే వ్యక్తిగా కనబడతాడు. అయితే వేమన ఏ కాలానికి చెందినవాడు అనే విషయంపై చర్చలు, పరిశోధనలు కొనసాగి వేమన వాడిన మక్కా, అల్లా, మహ్మద్‌, గులాము, బిక్కలు, జింజిరీలు వంటి పర్షియా పదాల వాడకం వల్ల ఇతడు 17వ శతాబ్దం వాడనీ, రాయలసీమ ప్రాంతానికి చెందినవాడని తేలింది. ఉదాత్తమైన ఆశయాలు, లక్ష్యాలు, కాల పరిణామంలో ఘోరంగా దిగజారినవి. కుల భేదాలతో సంబంధం లేకుండా ప్రారంభమైన వీరశైవానికి కూడా అదే గతి పట్టింది.

వేమన తాంత్రికుడు, శాక్తేయ పూజా విధానాన్ని అనుసరించినవాడని వేమూరి విశ్వనాథశర్మ ఒక లేఖలో రాళ్ళపల్లి వారికి రాసాడట. ఇది ఎంతవరకు వాస్తవమో పరిశోధకులు తేల్చాలి. త్రిపురనేని వెంకటేశ్వరరావు వేమనను బౌద్దుడుగా, నాగార్జునుని శూన్యవాదాన్ని విశ్వసించాడని ప్రతిపాదించినాడు. తర్వాత వేమన కమ్యూనిస్టు భావాలున్న ఆర్థికవేత్త అని అనేకమంది చాటినారు. త్రిపురనేని వంటివారు కొందరు వేమనను మార్క్సిస్టుగా చెప్పడం జరిగింది. ఏది ఏమైనా వేమన ముమ్మాటికీ ప్రజాకవే.

వేమనను 'ఆట వెలది' రారాజుగా అభివర్ణించవచ్చు. వేమన పేరుతో మొత్తం 5010 పద్యాలు తాళపత్రాల నుండి సేకరించామని జానపద వాఙ్మయ బ్రహ్మ నేదునూరి గంగాధరం, విద్యారణ్య స్వామి పేర్కొనినారు. కాని ఈ రోజు వరకు అందరికి అందుబాటులో ఉన్నవి బ్రౌన్‌దొర 'పండిత బృందం' పరిష్కరించిన 1153 పద్యాలు మాత్రమే. వేమన పద్యాలను నీతికి, నిజాయితీకి ప్రతీకలుగా పేర్కొనవచ్చు.

'ఉప్పు కప్పురంబు నొక్క పోలికనుండు' పద్యంలో ఉప్పు కర్పూరం ఒకే రంగులో కానవస్తాయి. అయితే వాటి రుచులు వేరు వేరుగా ఉంటాయి. ఒకే రంగులో ఉన్న ఉప్పును కర్పూరాన్ని అగ్నిలో వేసినట్లయితే ఉప్పు చిటపట అంటుంది. కాని కర్పూరం మాత్రం అగ్నిలో కరిగిపోతూ నలుగురికి వెలుగును పంచుతుంది. ఇదే ధీరగుణం. ఈ గుణమే పుణ్యపురుషుల యొక్క చిరునామగా పేర్కొనవచ్చు.

''ఆడవారి గన్న నర్థంబు పొడగన్న

సారమైన రుచులు చవులుగన్న

నయ్యగార్లకైన నాశలు బుట్టవా

విశ్వదాభిరామ వినురవేమ!''

స్త్రీలను చూసినా, ధనాన్ని చూసినా, మధురమైన పదార్ధాలను చూసినా అయ్యవార్లకు కూడా ఆశలు పుడుతూనే ఉంటాయి.

''నక్క వినయములను నయగారములు బల్కి

కుడవకెల్ల ధనము కూడ బెట్టు

కుక్క బోను చెంత కూడు చల్లినరీతి''.

కొందరు నక్క వినయాలు నటిస్తూ ఇచ్చకాలు పలుకుతూ డబ్బుని అదే పనిగా కూడబెడుతుంటారు. అది ఎలా ఉంటుందంటే కుక్క బోను ముందు కూటిని జల్లడం లాంటిది. అనగా నటనయే జీవితంగా తలచి దోచుకుని, దాచుకునే వారు దానధర్మాలు చేయక, ఆకలిగా ఉన్నవాని ఆకలి తీర్చలేకపోతే ఆ ధనంతో వారికి ఏమైనా విలువ వస్తుందా! రాదు కదా! చివరికి మరణించాక ఏ డబ్బు అయితే సంపాదించాడో అది వానికి దక్కదు. అందుకే అంటారు ''రాజుల సొమ్ము రాళ్ళపాలు'' అని.

అందుకే కట్టమంచి రామలింగారెడ్డి తన 'కవిత్వ తత్త్వ విచారం'లో 'వేమనను మించిన కవి లేడని' అన్నారు.

''పిల్లి యెలుక బట్ట ప్రియమున నుండక

నదియు కోడిబట్ట ననుగమించు

మమత విడవకున్న మానునా మోహంబు?...''

పిల్ల ఎలుకను పట్టుకొని దానితో తృప్తి చెందక కోడి కనపడితే దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. మనిషి ముందు విడవ వలసింది మమకారం. అదిపోతేగాని మోహం తగ్గదు. ఇది నాది, నేనే సర్వం అంటూ తన శరీరంపైన మనస్సు, కుటుంబ సభ్యులపైన మమకారం పెంచుకోకుండా అంతా మనమే అనే ఒకే ఒక్క ఆలోచన అందరినీ ఏకం చేస్తుంది. అందుకే మమకారాన్ని, మోహాన్ని విడవమని చెప్పుతారు. ఇది ఇలా వుంటే ఆధునికులు వేమనను భౌతికవాది, మానవతావాది, సామాజిక స్పృహగల కవి, విశ్వకవి, ప్రజాకవి, అభ్యుదయ కవి అని అనేక రకాలుగా చిత్రించినారు. ఇంకా కొందరు అతనిలో దయానంద సరస్వతిని మార్క్స్‌ని చూడగా మరి కొందరు వేమనను విక్లిఫ్‌తో, లూథ్‌తో, ప్లీట్‌తో, సొక్రటీస్‌తో పోల్చినా. మార్క్స్‌ చెప్పిన సమసమాజ స్థాపన జరగాలనే కాంక్షతో ధనిక భూస్వామి వర్గాల, అగ్రవర్ణాల నిరంకుశత్వం మీద దోపిడీ వ్యవస్థ మీద తిరుగుబాటు ధోరణులు వ్యాపించినవి. నూతన సమాజ నిర్మాణం మరో ప్రపంచం ఆవిర్భవించాలన్న తపనతో కూడిన భావాలు చోటు చేసుకున్నాయి. దాంతో అభ్యుదయ భావవాదులకు వేమన పద్యాల్లో ఎంతో అభ్యుదయ భావజాలం కన్పించి ఆకర్షించి అభిమాన కవి అయ్యాడు. అభ్యుదయ యుగకర్త అయిన శ్రీశ్రీ కి అభిమాన కవులలో వేమన ఒకడయ్యాడు. ప్రాచీన కవులలో వేమన అభ్యుదయవాద కవి అని శ్రీశ్రీ చాటినాడు.

''వేదవిద్యలెల్ల వేశ్యల వంటివి''/భ్రమల పెట్టి తేట పడగనీవు''

''ఆడదాని జూడ నర్థంబు జూడగ/బ్రహ్మకైనను బుట్ట రిమ్మ తెగులు''

''విప్రులెల్ల జేరి వెర్రి కూతలు కూసి/పతి పతులను గూర్చి సమ్మతమున'' మొదలైన ఎన్నో పద్యాల్లో సమాజంలోని రుగ్మతలను నిశితంగా విమర్శించి ఎత్తి చూపాడు.

నేడు వేమన పద్యాలుగాని అతని జీవిత చరిత్రగాని అతని బోధనలుగాని, అతని సిద్ధాంతాలు గాని చెప్పుకునేవారు కరువైనారు. నేటి కాలంలో విదేశీ సంస్కృతి పెచ్చరిల్లిపోయి భారతీయ సంస్కృతికి తూట్లు పొడిచింది. సమాజంలో నీతి, న్యాయం, ధర్మం, మంచిని పెంపొందించాలంటే వేమన పద్యాలను నిరంతరం జ్ఞాపకం చేసుకోక తప్పదు.

- డాక్టర్ చవ్వా వెంకటరెడ్డి

English summary
Vemana is a famous poet in Telugu literature. He made comments on society in a philosophic tendency. Dr Chavva Venkat Reddy speaks about Vemana's philosophy in his present essay.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X