వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొత్త అనుభావాల 'ముసురు'

By Pratap
|
Google Oneindia TeluguNews

Musuru
"Thus when I came to shape here this table between my hands the story of my life and set it before as a complete thing, I have to recall things gone far, gone a deep, sunk into this life or that and become part of it; dreams, too, things surrounding me, and the inmates, those old half - articulate ghosts who keep up their hauntings by day and night ... shadows of people one might have been; unborn selves." - Woolf Virginia on Autobiography

ముదిగంటి సుజాతా రెడ్డి 'ముసురు' చదువుతున్నప్పుడు ఆ మాటలు గుర్తొచ్చాయి. గతం జ్ఝాపకాల రూపంలో వెంటాడుతూ ఉంటుంది. గతాన్ని నెమరేసుకోవడం జీవితంలో ఒక భాగంగా మారిపోతుంది. సృజనాత్మక రచయితల సాహిత్యం ఆ జ్ఞాపకాల మీద ఆధారపడి రూపుదిద్దుకుంటుందనే అభిప్రాయం కూడా ఉంది. సుజాతా రెడ్డి తన జ్ఞాపకాల ఆధారంగా తన ఆత్మకథ 'ముసురు' రాశారు. ఆత్మకథ అనేది పూర్తిగా జ్ఞాపకాల మీద ఆధారపడి రాసేది. తన జ్ఞాపకాల ఆధారంగా సుజాతా రెడ్డి తన ఆత్మకథను పాఠకుల ముందు పెట్టారు.

సుజాతా రెడ్డి జీవితంలో ప్రధానంగా రెండు కాలాలున్నాయి. తెలుగు సమాజంలో చోటు చేసుకున్న రెండు అతి పెద్ద పరిణామాలకు ఆమె సాక్షి. ఒకటి - తెలంగాణ సాయుధ పోరాట కాలం. రెండోది - స్వాతంత్ర్యానంతర కాలం. ఈ రెండు కాలాల్లో అంతస్సూత్రంగా తెలంగాణ సమాజం అల్లుకుని ఉంటుంది. ఈ రెండు తెలంగాణకు సంబంధించనంత వరకు రాజకీయ సంక్షోభ సందర్భాలు కూడా. ఈ రెండు ఉద్యమాల ప్రభావాలను ఆమె కుటుంబం చవి చూసింది. దానికి తోడు, సంఘ సంస్కరణ ఉద్యమంలో భాగస్వాములైన తన మామగారు కొండల్ రెడ్డి కారణంగా ఒక విశాల దృక్పథం సుజాతా రెడ్డిని సంపూర్ణమైన వ్యక్తిగా నిలబెట్టడానికి దోహదం చేసింది. సమాజం పట్ల సానుకూల దృక్పథాన్ని ఆమె తన అత్తగారి కుటుంబం నుంచి సంతరించుకున్నట్లు తెలుసుకోవచ్చు. దానికితోడు, విస్తృతమైన విదేశీ పర్యటనల అనుభవం, విదేశీయులతో, ముఖ్యంగా జర్మన్లతో కలిసి పనిచేసిన జివితానుభవాలు ఆమెకున్నాయి. దానివల్ల ఆమె ఆత్మకథకు విశాలమైన కాన్వాస్ ఏర్పడింది. సుజాతా రెడ్డి మంచి కథా రచయిత కాబట్టి ఆత్మకథను కూడా ఆసక్తికరంగా పాఠకుల ముందుంచారు.

ఆత్మకథనాత్మక రచనలు నిజానికి ఆత్మశ్రయ స్వభావం కలిగి ఉంటాయి. వాటి ప్రధాన లక్షణం అదే. రచయిత జ్ఞాపకాలు, భావనలు, ఉద్వేగాలు రచనలో చోటు చేసుకుంటాయి. దానివల్ల కొన్ని ఆత్మకథలు పాక్షికంగానూ స్వోత్కర్షగానూ రూపుదిద్దుకునే ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి నివారించుకునే ఆత్మకథలు మాత్రమే మంచిరచనలుగా మిగిలిపోతాయి. అలాంటి మంచి ఆత్మకథగా 'ముసురు' కనిపిస్తున్నది. ఈ రచనకు సామాజిక ప్రయోజనం ఉంది.

సుజాతా రెడ్డి ఆత్మకథ తన పుట్టుకతో మొదలై, తన భాగస్వామి గోపాల్ రెడ్డి మరణంతో ముగుస్తుంది. ఈ ప్రయాణంలో ఆణె అనుభవాలు, ఆమె ఆలోచనలు ఇందులో పరుచుకుని ఉన్నాయి. కొత్త ప్రతిపాదనలు, కొత్త విశ్లేషణలు ఉన్నాయి. సామాజిక మార్పుల పరిణామ క్రమం ఉంది. సామాజిక ఉద్యమాలు వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దిన తీరు ఉంది. ఈ పరిణామాల వెనక గల కారణాలను కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేశారు. ఈ రకంగా ఆమె ఆత్మకథ తెలుగు ప్రజల సామాజిక పరిణామ క్రమాన్ని పునర్విశ్లేషించి, పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుంది. ఒక సమాజం నడిచి వచ్చిన దారి మనకు స్పష్టమవుతుంది.

తెలంగాణ సాయుధ పోరాటం విషయానికి వస్తే సుజాతా రెడ్డి ఆత్మకథ వల్ల మరో కోణం వెల్లడవుతుంది. ఆమెది దొరల కుటుంబం. దానివల్ల ఆమె కుటుంబం కోస్తాంధ్ర ప్రాంతానికి వలల వెళ్లాల్సి వచ్చింది. అలా వలస వెళ్లిన తన కటుంబ సభ్యులు ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎంత ఇబ్బందులకు గురైందో ఆమె ఆత్మకథ ద్వారా తెలుస్తుంది. అయితే, ఈ భాగాన్ని రాసేటప్పుడు ఆమె తీవ్ర భావోద్వేగానికి గానీ పాక్షిక ధోరణికి గానీ గురి కాకపోవడం సానుకూలాంశం. ఆ విషయాలను ఆమె నిర్మమకారంగా విశ్లేషించే పని చేశారు. దానివల్ల చరిత్ర నాణానికి చెందిన మరో కోణాన్ని వివరించడానికి, విశ్లేషించడానికి వీలు కలుగుతుంది. ఫ్యూడల్ సమాజంలోని దొరల కష్టసుఖాలను, విశ్వాసాలను, ఆచారాలను ఆమె చెప్పారు. దొరలుగా తాము అనుభవించిన అదనపు సౌకర్యాలను, అదనపు గౌరవాన్ని ఆమె వివరించారు. అదే సమయంలో వారి కుటుంబంలోని సమస్యలను, కుటుంబ నమ్మకాలను, ఆచార వ్యవహారాలను వివరించారు. ఇదంతా సామాజిక చరిత్రను సంపూర్ణంగా నిర్మించడానికి పనికి వస్తుంది.

సుజాతా రెడ్డి చిన్ననాటి ఆటపాటలు, ప్రయాణ సౌకర్యాలు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ విధానాలు మాత్రమే కాకుండా వైద్యం వివిధ రంగాల తీరుతెన్నులను వివరించారు. అవన్నీ ఇప్పుడు ఈ సమాజం నుంచి దాదాపుగా కనుమరగయ్యాయి. తన అనుభవాల నుంచి వాటిని ఆమె వ్యక్తీకరించారు. దానివల్ల ఒక కాలంనాటి సామాజిక జీవనం ఆమె రచనలు పరుచుకుంది. మొత్తం తెలంగాణ సామాజిక జీవన విధానం, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కళలు - సర్వం ఆమె రచనలో కనిపిస్తాయి. వైద్యం వంటి వాటిలో దేశీయ జీవన విధానాలు మనకు కనిపిస్తాయి. వాటిలోని శాస్త్రీయతను, అశాస్త్రీయతను ఆమె బేరీజు వేశారు.

ఆత్మకథలు చరిత్ర పునర్నిర్మాణానికి పనికి వస్తాయనే అభిప్రాయం బలంగానే ఉంది. నల్లా నర్సింహులు, రావి నారాయణ రెడ్డి, బిఎన్ రెడ్డి వంటి వీరుల ఆత్మకథలు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రకు అదనపు సరుకులను సమకూరుస్తాయి. సుజాతా రెడ్డి ఆత్మకథ మరో రకంగా ఉపయోగపడుతుంది. సాయుధ పోరాట చరిత్రను, దాని వెలుపలి జీవన విధానాన్ని కలిపి తెలంగాణకు సంబంధించిన సంపూర్ణ సామాజిక చరిత్రను నిర్మించడానికి ఉపయోగపడుతుంది. అదే రకంగా కొత్త ఆలోచనలకు తావు కల్పిస్తుంది. తెలంగాణ సామాజిక పరిణామక్రమాన్ని కొత్తగా అర్థం చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి పడిన నల్లగొండ తదితర దక్షిణ తెలంగాణలో నిజాం వ్యతిరేక సాయుధ పోరాటం కారణంగా ఫ్యూడల్ వ్యవస్థ కాళ్లు విరిగాయి. కానీ, ఉత్తర తెలంగాణలో ఆడబాపల వ్యవస్థ ఆ తర్వాత కూడా కొనసాగింది. ఫ్యూడల్ వ్యవస్థ దుర్మార్గాలన్నీ కొనసాగుతూ వచ్చాయి. ఈ స్థితిలో ఉత్తర తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం ఉధృతంగా సాగింది. ఈ రకంగా సామాజిక పరిణామ క్రమాన్ని పునర్విశ్లేషించాల్సిన అవసరాన్ని సుజాతా రెడ్డి 'ముసురు' గుర్తు చేస్తుంది.

సుజాతా రెడ్డి వ్యక్తిత్వం తీర్చిదిద్దుకున్న తీరు మాత్రమే కాకుండా ప్రపంచ సామాజిక గమనం మనకు ఈ రచన ద్వారా అర్థమవుతుంది. సుజాతా రెడ్డి ఉదారవాద వైఖరి వల్ల, అన్నింటినీ సమాన దృష్టితో చూసే లక్షణం వల్ల ఆమెకు ప్రపంచ విషయాల పట్ల ఉన్న జిజ్ఞాస వల్ల ఒక తులనాత్మక అధ్యయనంలా ఆమె ఆత్మకథ సాగింది. ప్రాచ్య, పాశ్చాత్య సంస్కృతులు, ఆచార వ్యవహారాల మధ్య ఉన్న తేడాలు, సామీప్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది.

ఆమె తన అనుభవాలను చెబుతూ ముందుకూ వెనకకూ వెళ్లిపోతుంటారు. ఒక విషయంలోని పలు కోణాలను విశ్లేషించే పనికి పూనుకున్నారు. చరిత్ర, భాష, తదితర విషయాల పట్ల ఆమెకు పరిజ్ఞానం వల్ల వివిధ విషయాలను పలు కోణాల నుంచి చూసే ప్రయత్నం చేశారు. పదాల కూర్పు దగ్గర నుంచి సంస్కృతి ఆదానప్రదానాల గురించి ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తారు. వేషభాషల్లో తెలంగాణ ప్రాంతం గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలతో సంబంధం కలిగి ఉందని అనడం, దాంతో మొహంజదారో, పరప్పా నాగరికతకు దగ్గరిదేమో అనినిపించడం వాటిలో ఒకటి. ఈ రకంగా కొత్త విషయాలనేకం పాఠకుల ముందుంచే ప్రయత్నం చేశారు.

సంప్రదాయ కుటుంబానికి చెందిన సుజాతా రెడ్డి ఇతర తెలుగు సామాజిక శాస్త్రవేత్తల దృష్టికి రాని అనేక విషయాలను విడమర్చి చెప్పే ప్రయత్నం చేశఆరు. అలాగే, తెలంగాణ ఉద్యమ మూలకారణాలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేశారు. గోపాల్ రెడ్డితో ఆమె సాహచర్యం ఇద్దరు సమాన వ్యక్తుల మధ్య సంబంధంగా కొనసాగింది. దానివల్ల అనేక కొత్త సందర్భాలను ఆమె చూడగలిగారని అనిపిస్తుంది.

ఆమె సమాజంలో వస్తున్న మార్పులను, పీడిత వర్గాలు ఆత్మగౌరవ కోసం చేసే ఉద్యమాలను ఆహ్వానిస్తారు. హెచ్చుతగ్గులు లేని సమాజం కావాలని కోరుకుంటారు. ఆ రకంగా ఆమె సమాజానికి కావాల్సిన రచయిత్రిగా మనకు దర్శనమిస్తారు.

మొత్తంగా నిండు వ్యక్తిత్వంతో భాసిల్లే స్త్రీమూర్తి తలారా స్నానం చేసి దట్టమైన కురులను దావల చేత బూని విదిల్చి ముడి పెట్టుకున్నట్లుగా ఆమె ఆత్మకథ 'ముసురు' అనేక విషయాలను విస్తారంగా చెబుతూనే పఠనాసక్తిని కలిగించే నిర్మాణాన్ని సంతరించుకుంది. 'ముసురు' మనకు కొత్త అనుభూతిని, అనుభవాన్ని అందించడమే కాకుండా మనసుకు నిర్మలత్వాన్ని సంతరించి పెడుతుంది.

- కాసుల ప్రతాప రెడ్డి

English summary
Novelist and short story writer Mudiganti Sujatha Reddy ha tried to analyze the evolution of Telugu society through her autobiography 'Musuru'. It reveals the new facts involved in the Telangana armed struggle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X