• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

'అక్షరాల్లో దగ్ధమై...' ఆవిర్భవించిన కవిత

By Pratap
|
N Gopi
''అనంత కోటి ప్రజా సముదాయం
ఆర్తి చిత్రాన్ని
రక్తచలన సంవేదనతోగీస్తాను
నిత్యం
అక్షరాల్లో దగ్ధమౌతూ
అజరామర గీతమై బతుకుతాను'' - అని అంటున్న డాక్టర్‌ ఎన్‌. గోపి కవిత్వానికి నిజానికి పరిచయాలు, సమీక్షలు అవసరం లేదు. డాక్టర్‌ గోపి లోకమెరిగిన కవి మాత్రమే కాకుండా లోకాన్నెరిగిన కవి కూడా. 'తంగెడు పూలు నుంచి ఇటీవలి 'కాలాన్ని నిద్రపోనివ్వను' వరకు వచన కవిగా ఆయన కవిత్వమేమిటో విడమరిచి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గ్రంథాలు సమీక్షలు చేయాల్సిన సందర్భాన్ని సృష్టిస్తాయి. అలాంటి సందర్భాన్నే ఆయన కల్పించారు. దాదాపు రెండేళ్లుగా రాసిన కవిత్వం 'అక్షరాల్లో దగ్ధమై...' పేరిట సంకలనంగా వచ్చింది. ఇదే ఆ సందర్భం. సంఖ్య రీత్యానే కాకుండా వస్తు రీత్యా, శిల్ప దృష్ట్యా దీన్ని ఒక బృహద్కవితా సంకలనంగానే పరిగణించాలి. నిర్దిష్టత నుంచి సార్వజనీనతను సంతరింపజేసే సృజనాత్మక లక్షణం గోపి కవిత్వం విశిష్టత. ఆయన తాను పుట్టిపెరిగిన, తాను సంచరించిన ప్రాంతాల గురించి మాట్లాడినా, తన అనుభవంలోకి వచ్చిన అంశాల గురించి, పరిసరాలతో, వస్తువులతో తనకు గల అనుబంధాల గురించి మాట్లాడినా అది తనొక్కడిది మాత్రమే కాకుండా పాఠకులందరిదీ కావడం వల్ల ఆయన కవిత్వం సహనుభూతికి గొప్ప అవకాశాన్ని కల్పిస్తుంది. రేకుపెట్టె, మరోసారి మా వూరు, మోకాళ్లకు నమస్కారం, చివరి సిగరెట్టు - ఆఖరి అగ్గిపుల్ల, తువ్వాల వంటి కవితలను అందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.

'అక్షరాల్లో దగ్ధమై...' సంపుటిలోని కవితలను మొతం సారాన్ని గ్రహిస్తే ఆయన ఎటువైపు ఉన్నారో, కవి ఎటు వైపు ఉండాలో తెలిసిపోతుంది. భూమిపైన విస్తరించే వృక్ష భాగాలనే కాకుండా ఆ వృక్షం వేళ్లను పట్టించుకున్న కవి డాక్టర్‌ గోపి. సిలబస్‌ను మార్చాలి, మట్టి చిత్రాలు, గులకరాళ్లు, ముడుతలు, ఉమెన్స్‌ కాలేజీ వంటి కవితలు ఈ విషయాన్ని పట్టిస్తాయి. నిజానికి, గోపి కవిత్వానికంతటికీ ఈ లక్షణం ఉంది. అందుకే ఆయన కవిగా నిత్య సృజనశీలిగా మనగలుగుతున్నారు. ఆయన కవిత్వానికి ఆర్ద్రత, సౌజన్యం, సున్నితత్వం చేకూరింది కూడా అందుకే.

విశ్వవిద్యాలయాల్లో కొనసాగుతూ, ఉన్నత పదవులను నిర్వహిస్తూ పాత సంప్రదాయాలను, పాత జడవాదాలను తృణీకరిండం అంత సులభం కాదు. నిజానికి చాలా సందర్భాల్లో విశ్వవిద్యాలయాల్లో నిలువనీరు మాత్రమే ఉండి పాచి పడుతూ వుంటుంది. నిత్య ప్రవాహశీలంగా మనగలగడానికి కవి, ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లోని కవి ఎప్పటికప్పుడు తనను తాను పుటం పెట్టుకుంటూ ఉండాలి. ఆ పుటం పెట్టుకోవడంలోంచే బహుశా గోపి 'అక్షరాల్లో దగ్ధమై...' అనే కవిత రాసి వుంటారు. అలా పుటం పెట్టుకోవడంవల్లనే గోపి చూపు కాలంతో పాటుగానే కాకుండా కాలానికి ముందు కూడా ఉంది. అందుకే ఆయన 'అరాఫత్‌ కీ యాద్‌ మే' అనే గొప్ప ఎలిజీ రాయగలిగారు. అందుకనే అరాఫత్‌ను సంబోధించి 'నువ్వు కురిసేది నిప్పుల్నే' అని అంటూ 'భుజం మీద తుపాకి ధరించిన/ శాంతి వీరుడా' అని అనగలగడంలోని సామంజస్యాన్ని పట్టించగలిగారు. శాంతికి, హింసకు గల నిర్వచనాలను ఈ కవితలో ఇచ్చారు. ఎది హింసనో, ఏది కాదో పైకి చూస్తే కనిపించేది కాదు, వాటి సారాంశాన్ని, న్యాయబద్ధతను అర్థం చేసుకున్నవారు మాత్రమే ఈ రెంటి మధ్య పోలికను ఇంత గొప్పగా చెప్పగలరు. ఇలా చెప్పలేకపోవడం వల్లనే చాలా ఉద్యమ కవిత్వం కవిత్వం కాకుండా పోతోంది.

మన సమాజానికి ఏది అవసరమో, ఏది కాదో కూడా ఎరిగిన కవి గోపి. అమెరికా నీతిని సందర్భం వచ్చినప్పుడల్లా ఆయన తన కవిత్వంలో విప్పుతూ దిగంబరంగా నిలబెట్టారు. అమెరికా యుద్ధకాంక్షను, ఆ కాంక్షలోని అంతర్నిహిత స్వార్థప్రయోజనాల కుట్రను 'రోబో' కవితలో వ్యక్తీకరించిన తీరు గోపికి మాత్రమే సాధ్యమవుతుందని అనిపిస్తుంది. ''నేనిప్పుడు ఖాళీగా లేను/ పనిలో వున్నాను యుద్ధం!'', ''కారణాలు నాకక్కర్లేదు/ వాటిని నేనే సృష్టిస్తాను'' అని అన్నప్పుడు ఇరాక్‌, ఇరాన్‌ విషయంలో అమెరికా వ్యవహరించిన/ వ్యవహరిస్తున్న రాజకీయ అనైతికత అంతా దృశ్యాలుదృశ్యాలుగా, బుష్‌ మాటల పరంపర మన కళ్లకు, చెవులకు ప్రసారం అవుతూ వుంటుంది. ''భూమ్మీద కన్నీళ్లు లేకుండా చేస్తాను/ అక్కడక్కడ ఉబికినా/ హీటర్లతో ఆర్పేస్తాను/ మీరొక లెక్క కాదు/ రేపటి చేతుల్ని నరికేస్తాను/ నేను చెప్పినప్పుడే/ మీ విత్తనాలు మొలకెత్తుతాయి/ నేను విత్తిన 'చిప్స్‌'లు/ మిమ్మల్ని మీకు పరాయివాళ్లను చేస్తాయి'' అనే పాదాల ద్వారా అంతర్జాతీయ పరిణామాల మొత్తాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తత్ఫలితంగా మానవ జీవితంలో ప్రవేశిస్తున్న కృత్రమత్వాన్ని, అమానుషీకరణను చిత్రిస్తూ హృదయాన్ని మెలిపెడుతుంది. పైకి కనిపించని గాయాలను చూపడం కూడా సాధ్యం కాదు. అలాంటి దెబ్బలు కొడుతున్న సామ్రాజ్యవాదం గుట్టు విప్పారు కవి. అదే సమయంలో 'ద ఈగిల్‌' కవితలో ''ఈ రోజు/ అమెరికాను వ్యతిరేకించకపోతే/ అమ్మను వ్యతిరేకించినట్లే'' అని ఆయన నేల మీడ నిలబడి మాట్లాడారు. ప్రపంచీకరణ లక్షణాన్ని 'ఇంత బకెట్లో/ అనంతాన్ని కుక్కినట్లు/ అన్ని దేశాలూ/ అమెరికాలో ఇమిడిపోతాయి''' అనే కొద్ది పాదాల్లో సమర్థంగా, అర్థవంతంగా పలికారాయన. ప్రపంచీకరణ 'కుగ్రామ' నీతి ఇరుకిరుకై మొసెల్లకుండా ఎలా చేస్తుందో, ఆ కుగ్రామ విలువలను ప్రతిష్ఠాపనకు అమెరికా దుష్టనీతి ఎలా పనిచేస్తుందో చెప్పే కవితలు ఇంకా వున్నాయి. ఈ కవితల ద్వారా ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాలను, ఆ పరిణామాల ప్రభావం మన ఒంటినీ, ఇంటినీ, రాష్ట్రాన్నీ, దేశాన్నీ మొత్తంగా మానవ జీవితాన్ని ధ్వంసం చేసే తీరును పేజీల కొద్దిగా వ్యాఖ్యానించవచ్చు.

ఆయన రాసిన 'తెలంగాణ' కవిత తెలంగాణ ఉద్యమానికి నిర్వచనాన్ని అందిస్తుంది. ''నేనిప్పుడు/ అన్ని భావాలనూ ధిక్కరిస్తున్నాను/ అభావంతో సహా' అని అనడం వల్ల తెలంగాణ ఉద్యమ స్వభావాన్ని రూపు కట్టారు. ఈ సంపుటిలోని కవితల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో కవిత 'పెహచాన్‌'. ఇది కన్ఫెషనల్‌ పోయమ్‌. ఇటువంటి కవిత రాయడానికి అహంకారానికి సంబంధించిన ఉడుపులన్నీ వొదిలేయాల్సి వుంటుంది.

రాజకీయ తటస్థత, ప్రజాపక్షపాతం గోపి కవిత్వానికి అదనపు ఆమోదయోగ్యతను, విలువను సంతరించి పెడుతుంది. ఆయన నిరంతర కవితాయానాన్ని పరిశీలిస్తే తెలుగులోని అతి కొద్ది మంది అగ్రశేణి కవుల్లో గోపి ప్రధానమైనమైనవారని చెప్పడనికి సందేహించాల్సిన అవసరం లేదు.

- కాసుల ప్రతాపరెడ్డి

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary
Former vice chancellor of Telugu university, N Gopi is basically a poet. His poetry reflects the sensitive of human being in modern society.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more