నిరలంకార కవిత్వం 'చెమ్మ'

ఈ కవితా సంకలనానికి ముందు మాటలు లేవు. కవి పలుకులూ లేవు. తన కవిత్వం గురించి వేరుగా చెప్పాల్సిన అవసరం లేదని భావించి ఆయన ముందుమాటలు రాయించ, కితాబులిప్పించుకునే పనికి ఒడి గట్టలేదుకాబోలు! నిజానికి, కవి పాఠకులతో నేరుగా తన కవిత్వం ద్వారా సంభాషిస్తాడు. తన భావాలను, భయోద్వేగాలను, నిస్సహాయతను, దు:ఖాన్ని, ఆనందాన్ని కవి పాఠకులతో పంచుకోవడానికి రాసేదే కవిత్వం. తనలో కలిగే భావోద్వేగాల గురించి ఎవరితోనైనా పంచుకోదలుచకున్నప్పుడు కవిత్వం వెల్లువై పెల్లుబుకుతుంది. గురుస్వామి కవిత్వం అలా వెలువడిందే. ఆయన కవిత్వంలోని సారళ్యం, సూటిదనం ఈ విషయాల్ని తెలియజేస్తుంది. కవి మన ఎదురుగా కూర్చుని మనతో మాట్లాడినట్టే వుంటుంది. అంతేకాకుండా తన ఆత్మతో తాను సంభాషిస్తాడు గురుస్వామి. సారళ్యం వల్లా, సూటిదనం వల్లా గురుస్వామి కవిత్వం పలుచైన పోలేదు. సారళ్యంలోనే సాంద్రతను సంతరించుకునే కవిత్వానికి గురుస్వామి కవిత్వం మంచి ఉదాహరణే. నెత్తురోడుతున్న మనిషి కవి అయితే ఆత్మను చంపలేకపోయిన మనిషి కవి అయితే ఆ కవిత్వం ఎలా ఉంటుంది? కవిత్వం నిండా కనిపించని దు:ఖం పరుచుకుంటుంది. ఈ దు:ఖ ఛాయలు గురుస్వామి కవిత్వంలో నిండా పరుచుకుని కనిపిస్తాయి. ఈ దు:ఖం మనిషి హృదయాన్ని ప్రక్షాళన చేసే దు:ఖం.
మృత్యువు అనివార్యమని తెలిసీ మనిషి దానినుంచి పారిపోవాలని ఒక విఫలయత్నం చేస్తాడు. కవి అన్నవాడికి మృత్యుకౌగిలి సేద తీరే అమ్మ ఒడి లాంటిది. జీవితం అనేక మలుపుల నుంచి బాధిస్తుంటే మృత్యువును కవి అనివార్యంగానే ఆదరిస్తాడు. గురుస్వామి కవిత్వంలో మృత్యువుకు సంబంధించిన కవితలు కూడా ఎక్కువే కనిపిస్తాయి. వాస్తవమనుకుని అబద్ధంలో బతుకుతున్న మనిషి గురించి గురుస్వామి మాట్లాడతాడు. '' వొత్తుకుండ వంశం' అనే ఒక దీర్ఘ కవిత చాలు ఆయన నికార్సయిన కవి అని చెప్పడానికి. 'రర్తీఇ ఏదైనా /జీవితం లాంటి/ భయంకరమైన కలేదీ రాలేదా' అని అడుగుతున్న కవికి చిరునామా అక్కర్లేదు. ఇంత నిరలంకారంగా గురుస్వామి కవిత్వాన్ని పలికించగలడు. కవిత్వం చిటికెన వేలిన పట్టుకొని నడిపించే సత్తా గురుస్వామికి ఉంది.
చివరగా ఒక మాట- మనిషి అబద్ధంలో బతుకుతున్నాడని చెప్పే ఏ కవీ క్షమార్డుడు కాడు. గురుస్వామి కూడా. ఉడుపులన్నీ తీసేసి నడివీధిలో నగ్నంగా నిలబడిధైర్యం వుంటే నువ్వు కూడా రా అని పిలిచే కవిని ఏమంటావు? అతని ధైర్యానికి సిగ్గు పడతాం. గురుస్వామి విషయంలో మనం తప్పకుండడా చేసేది అదే.
- కాసుల ప్రతాపరెడ్డి












Click it and Unblock the Notifications