వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వానొస్తద!? : కవి స్వాప్నికుడు.. నారాయణస్వామితో ఇంటర్వ్యూ..

|
Google Oneindia TeluguNews

'వానొస్తద?'.. వస్తదో రాదో కచ్చితంగా ఎవరు మాత్రంచెప్పగలరు. జీవిస్తున్నంత స్వచ్చంగా ఓ కలను స్వప్నించడం తప్ప. ఆర్ద్రతను-ఆశావాదాన్ని అంటిపెట్టుకున్న నారాయణ స్వామి లాంటి కవి.. కవిత్వంతోనే ఇప్పుడా స్వప్నాన్ని వ్యక్తపరుస్తున్నారు. వానొస్తద? అన్న ప్రశ్నలోంచి 'వస్తుందేమో..!' అన్న ఆశావాదం వైపు.. ఒక తాత్విక స్పృహ వైపు.. కల్లోల కలల మేఘం వర్షిస్తుందా.... కల్లోల కలల మేఘం, సందుక, ఆ తర్వాత వానొస్తదా కవితా సంపుటుల ద్వారా తన రాజకీయ, సామాజిక తాత్వికతను పలికిన నారాయణ స్వామి ఉద్యమాల్లోంచి ఎదిగి వచ్చిన కవి... కవిత్వంలో వస్తువు సారవంతంగానూ సాంద్రంగానూ వ్యక్తం కావాలని ఆశించే కవి...

నారాయణస్వామితో ఇంటర్వ్యూ :

నేపథ్యం గురించి..

మెదక్ జిల్లా సిద్దిపేట నా నేపథ్యం. సిద్దిపేటలోని ఓ బ్యాక్ వర్డ్ వీధిలో ఉండేవాళ్లం. నేనొచ్చింది కూడా ఓ బ్యాక్ వర్డ్ క్యాస్ట్ నుంచే..
... ...
(ఈ రెండు వాక్యాలు చెప్పాక.. వీటికంటే ముందు చెప్పాల్సిందేదో మరిచిపోయినట్లు.. రెండు సెకన్లు ఆగి..)

నేనో తల్లి లేని పిల్లవాన్ని ( ఆ మాటల్లో ఏదో తడి..)

నాన్నే నన్ను కష్టపడి పెంచి పెద్ద చేశారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ఇంటర్మీడియట్ పూర్తయ్యాక, ఇంజనీరింగ్ కోసం జేఎన్టీయూలో చేరాను. అక్కడే.. ప్రగతిశీల సాహిత్యంతో కనెక్ట్ అయ్యాను.

Interview with Poet Narayanaswamy Venkatayogi

సాహిత్యాన్ని ఎవరు పరిచయం చేశారు?

మిత్రుడు చొప్పదండి ప్రవీణ్, నందిని సిధారెడ్డి, మల్లారెడ్డి లాంటి వ్యక్తుల పరిచయం నన్ను సాహిత్యానికి దగ్గర చేసింది. వాళ్లు సూచించిన పుస్తకాల చదువుతూ.. సాహిత్యం పట్ల మరింత ఇష్టాన్ని పెంచుకున్నాను.

ఇంట్లో ఎవరికైనా సాహిత్య నేపథ్యం ఉందా..?

లేదు.. కానీ, నా చిన్నతనంలో మా నాన్న నాకు కొన్ని పద్యాలు నేర్పించారు. ఓ సందర్బంలో నాన్న నన్నోసారి తెలుగు మహాసభలకు కూడా తీసుకెళ్లారు. అక్కడ నేనిచ్చిన ఓ చిన్న ప్రసంగానికి మంచి స్పందన లభించింది. బహుశా.. ఆ రెండింటి ప్రభావం కూడా ఆ తర్వాత రోజుల్లో నన్ను సాహిత్యం వైపు నడిపించి ఉండొచ్చు.

సాహిత్యం రాయాలన్న ఆలోచనకు స్ఫూర్తిని ఇచ్చెందవరు?

సాహిత్యంతో పరిచయం ఏర్పడ్డ తొలినాళ్లలో దిగంబర కవుల ప్రభావం నా మీద ఉండేది. చెరబండరాజు, నగ్నముని లాంటి దిగంబర కవుల కవిత్వం నన్ను అమితంగా ప్రభావితం చేసింది. వాళ్ల కవిత్వంలో ఆర్తితో కూడిన కోపం నన్ను బాగా ఆకర్షించింది. అలాగే.. శ్రీశ్రీ, శివారెడ్డి లాంటి కవుల కవిత్వం కూడా నన్ను ఓ ఊపు ఊపింది.

తొలినాళ్లలో రాసిన కవితలేమైనా గుర్తున్నాయా!

ప్రగతిశీల కవిత్వం రాయడం మొదలుపెట్టిన తొలిరోజుల్లో.. ఒక తల్లి, బీడి కార్మికులు లాంటి కవితలు నాకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. చాలా సభల్లో ఆ కవితలను చదివి వినిపించాను. అప్పటిదాకా సభల్లో పాటలు పాడడమే ఎరిగిన నేను, కవిత్వం చదువుతూ అనుభూతికి లోనయ్యేవాడిని.

Interview with Poet Narayanaswamy Venkatayogi

సాహిత్యాన్ని వ్యక్తిగత జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోగలిగారు? అసలు కెరీర్ ఎలా సాగింది..?

ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ఆర్గానిక్ లింక్ విరసం. 1985 తర్వాత నేను పూర్తి స్థాయి పార్టీ కార్యకర్తగా మారిపోవాలనుకున్నాను. అయితే నేనేమైపోతానో అన్న దిగులు మా నాన్నలో మొదలైంది. తల్లి లేని నన్ను మా నాన్న ఎలా పెంచారో తెలుసు.. కొడుకు ఏమైపోతాడో అన్న ఆయన ఆవేదన, అయ్యో..! నేను ఎంచుకున్న మార్గానికి పూర్తి స్ధాయిలో న్యాయం చేయలేకపోతున్నానే అన్న దిగులు నన్ను మానసిక సంఘర్షణకు గురిచేసింది. అదే క్రమంలో.. ఇండియన్ ఆయిల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాను. మూడు నెలలు అస్సాంలో ఉద్యోగం, ఆ తర్వాత చేయాలనిపించలేదు. వెంటనే హైదరాబాద్ వచ్చేశా.
... ... ...

ఇక్కడికొచ్చాక.. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగంలో చేరాను, 1986లో. అక్కడ పనిచేస్తున్న సమయంలో నాన్ టీచింగ్ స్టాఫ్ ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలపై యాజమాన్యంతో పోరాటం చేశాను. ఆ తర్వాత పౌర హక్కుల సంఘం తరుపున కూడా పనిచేశాను. అయితే అందులో సభ్యుడిగా మాత్రం లేను.

-ఇలా మాటలు కొనసాగుతుండగానే.. బుద్దుడి గురించి చెబుతున్న సందర్బంలో.. ఆయన సినిమాల వైపు టర్న్ తీసుకున్నారు. గమనించిందేంటంటే.. నారాయణ స్వామి గారికి ఉన్న ప్రాపంచిక దృక్పథం చాలా విస్తృతమైనది. అది ఒక్క సాహిత్యానికే పరిమితం కాలేదు, సినిమాలు, సమాజం, సాహిత్యం ఈ మూడింటిపైనా ఆయనకో స్పష్టమైన అవగాహన ఉంది.

ఇంతకీ సినిమాల గురించి ఆయనేం చెప్పారంటే..!

నా వ్యక్తిత్వ వికాసానికి సాహిత్యంతో పాటు సినిమాలు కూడా ఒకింత దోహదం చేశాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ లో మెంబర్ షిప్ తీసుకున్నాక.. ప్రపంచ సినిమాలన్నింటినీ చూడడం మొదలుపెట్టాను. ఒక విధంగా నా ప్రాపంచిక దృక్పథాన్ని సినిమాలు కూడా విశాలం చేశాయి.

వ్యక్తిత్వం గురించి..

నేను కొంచెం భయస్తున్ని. ఎందుకో.. కొన్ని విషయాల్లో ధైర్యంగా ముందడుగు వేయలేకపోయాననిపిస్తుంది. (ఏదో అసంతృప్తి ఆయనలో..)

కవిత్యంలోకి వద్దాం.. మీరు బ్యాక్ వర్డ్ క్యాస్ట్ నుంచి వచ్చానని చెప్పారు.. కులం మీ సాహిత్యం మీద ఎలాంటి ప్రభావం చూపింది.

నేనెదుర్కొన్న అనేక సమస్యల్లో కులం ఒకటి. నా అనుభవంలో గమనించిన విషయమేంటంటే.. ప్రతీ సంఘంలోను అంతర్లీనంగా కులం అనే సమస్య ఉంది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదువుకుంటున్నప్పుడు కూడా నేనీ సమస్యను ఎదుర్కొన్నా. అణిచివేయబడ్డ కులం నుంచి వచ్చిన వాన్ని కాబట్టి నా కవిత్వంలో ఆ అంశాలు కూడా కనిపిస్తాయి. అయితే అణిచేయబడుతున్న కులాల నుంచి ప్రతిఘటన ఎదురైనప్పుడు.. ఖచ్చితంగా ఆ పరిస్థితిలో మార్పు వస్తుందనే నమ్మకముంది.

మీ మొదటి పుస్తకం గురించి చెప్పండి..

1982-1992 మధ్యలో నేను రాసుకున్న 45 పోయెమ్స్ తో 'కల్లోల కలల మేఘం' పుస్తకం తీసుకొచ్చాను. శివారెడ్డి లాంటి కవుల ప్రభావం ఆ కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంటుంది.

కవిత్వం ఎలా ఉండాలనే దానిపై మీ అభిప్రాయం..

నా దృష్టిలో కవిత్వమెప్పుడూ ఓ సలహానో.. సూచననో ఇస్తున్నట్లే ఉండాలి. సజెస్టివ్ గా. కంక్లూజన్ ఉండాలనే దానితో నేను ఏకీభవించను. ఇక భాషకు శిల్పం ముఖ్యమా..? వస్తువు ముఖ్యమా..? అన్న ప్రశ్నకు రెండూ ముఖ్యమే అని చెప్తాను. చెప్పాలనుకున్న విషయానికి ఈ రెండు సరిగా సరిపోయినప్పుడే.. విషయం పాఠకుడిని ప్రభావవంతంగా ఆకట్టుకుంటుంది.
... ...
ఇస్మాయిల్ గారు ఓ మాటంటారు.. భాషను శుభ్ర పరిచేది కవులే అని. నేను దానితో ఏకీభవించడం లేదు. ప్రజలకు ఎలాంటి భాష కావాలో ప్రజలే నిర్ఱయించుకుంటారు.

రెండవ పుస్తకంగా సందుక తీసుకొచ్చారు. మొదటి పుస్తకానికి, రెండవ పుస్తకానికి మీ సాహిత్యంలో వచ్చిన మార్పు!

1996లో నేను అమెరికా వెళ్లిపోయాను. అప్పుడో గిల్టీ ఫీలింగ్ నన్ను వెంటాడింది. ఎంచుకున్న మార్గాన్ని మధ్యలోనే వదిలేసి వెళ్లానన్న అసంతృప్తి ఉండేది. ఇక పుస్తకం విషయానికొస్తే.. కల్లోల కలల మేఘంలో శివారెడ్డి లాంటి కవుల ప్రభావముంటే, రెండవ పుస్తకంలో తెలంగాణ అస్తిత్వ ఉద్యమ ప్రభావముంది. అందుకే.. భాషలోను మొదటి పుస్తకానికి, రెండవ దానికి చాలా తేడా కనిపిస్తుంటుంది.

అలాగే.. నిరాశావాదం విషయంలోను నా అభిప్రాయం మారింది. నలుపు తెలుపుల్లో చూడవద్దని అనుకున్నాను. ఏక కోణంలో చూడకూడడం కాకుండా, బహుకోణాల్లోను జీవితాన్ని చూడాలనుకున్నాను. దాన్నే కవిత్వీకరించానని అనుకుంటున్నా. మోనిజం అవుట్ లుక్ సరైంది కాదనే అభిప్రాయం కూడా నాకుంది. మనిషిలోని చీకటికోణాలను కూడా కవిత్వం చూపించాలి.

Interview with Poet Narayanaswamy Venkatayogi

నా జ్ఞాపకాలు.. నా లోపల కురుస్తోన్న వర్షం.. తెలంగాణ అస్తిత్వం.. ఈ మూడు సందుకలో ప్రతిబింబిస్తుంటాయి.

మూడో పుస్తకం వానొస్తద?. ఎందుకింత లేటయ్యింది..

నాకున్న కొన్ని వ్యక్తిగత సమస్యల వల్ల కొంత ఆలస్యం జరిగింది. పైగా.. నేను రెగ్యులర్ పోయెట్ ను కాదు. ప్రతీరోజు కవిత్వం రాయలేను. రాయాలి అనుకున్నప్పటి కన్నా.. సంఘటనో, సందర్భమో నన్ను బాగా ప్రభావితం చేసినప్పుడు మాత్రమే నేను కవిత్వం రాస్తుంటా. మూడో పుస్తకం ఆలస్యమవడానికి ఇది కూడా ఓ కారణం.

వానొస్తద? ఏం చెప్పారు.. ఏం చెప్పదలుచుకున్నారు..

నా మొదటి పుస్తకం వెలువరించేటప్పటకీ నాకున్న ప్రాపంచిక దృక్పథం తక్కువ. అమెరికా వెళ్లిన తర్వాతే నేనో లెర్నర్ గా మారిపోయాను. నిజానికి అక్కడే నా ప్రాపంచిక దృక్పథం ఇంకాస్త విస్తృతంగా మారింది. జీవితాన్ని ఓ కొత్త కోణంలో చూడడం మొదలుపెట్టాను.

ఇక ఇందులో.. విగ్రహాలు కూలగొట్టేవాడి కోసం అని ఓ కవిత ఉంది. రోడ్ల మీద విగ్రహాలను ధ్వంసం చేసేవారు కొందరైతే తనను ధ్వంసం చేసుకున్నవాడు కలేకూరి. కలేకూరి లాంటి వ్యక్తి అలా అయిపోవడం.. నిజానికి సమాజానికే చేటు.

అలాగే.. రోహిత్ వేముల లాంటి దళిత మేధావుల గురించి కూడా పుస్తకంలో పేర్కొన్నాను. రోహిత్ ఆత్మహత్య నన్నెంతంగా కదిలించిందంటే.. నిజానికిప్పుడు బాబా సాహెబ్ అంబేడ్కర్ బ్రతికి ఉన్నా.. ఆయన్నూ చంపేసేవారేమో! ఇదే విషయాన్ని పుస్తకంలోను చెప్పాను.

ఇక భాష గురించి మాట్లాడితే.. ఇందులో వాడిందంతా సరళీకృతమైన భాష. ఒక విధంగా ఫిలాసఫికల్ ఆస్పెక్ట్ లాగా అనిపిస్తది.

పుస్తకం ముందు పేజీలో రోహిత్ వేముల, శృతి, వివేక్, సాగర్ ల గురించి ప్రస్తావించారు కాబట్టి ఓ ప్రశ్న. రోహిత్ వర్సిటీలో ఉన్న స్వాప్నికుడైతే శృతి, వివేక్, సాగర్ లు అడవిబాట పట్టిన స్వాప్నికులు. ఈ స్వాప్నికుల మరణం వెనుక రాజ్య క్రౌర్యాన్ని సాహిత్య ద్వారా ప్రశ్నిస్తున్నామే గానీ, ప్రభుత్వాన్ని జవాబుదారీగా మలచడంలో సాహిత్యం ఉపయోగపడుతుందా?

సాహిత్యం నుంచి ప్రజా ఉద్యమం పెల్లుబికినప్పుడు మాత్రమే రాజ్యం మీద ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ప్రజా ఉద్యమాలకు సాహిత్యం ఊతమివ్వగలదే గానీ పోరాటం లేకుండా రాజ్యాలను జవాబుదారీగా మలుచుకోవడం కష్టం.

'వానొస్తద?' టైటిల్ చాలా బాగుంది. ఆ టైటిలే ఎందుకు ఫిక్స్ అయ్యారు?

వానొస్తద అన్న టైటిల్ లో.. ఓ చైతన్య ప్రతీక కనిపించవచ్చు.. ఓ స్వాప్నికుడి స్వప్నంలా కనిపించవచ్చు.. మొత్తానికి అదొక ఆశావాదం.

ఇక మీ కవిత్వానికొద్దాం.. అసలెందుకు కవిత్వం రాస్తున్నారు?
జస్ట్.. మీ జ్ఞాపకాలను రికార్డ్ చేయడానికా?
లేదూ.. మీలాంటి అనుభవాలే ఉన్న వ్యక్తులతో కనెక్ట్ అవడానికా..?

మంచి ప్రశ్న. నా అభిప్రాయం వరకు సాహిత్యమనేది జీవితంలోని అన్ని కోణాలను పట్టుకోవాలి. విషయమేదైనా.. అందులో దాగున్న తాత్విక కోణాన్ని కవిత్వం చెప్పగలగాలి. అప్పుడే అది విశ్వజనీనతను సంతరించుకుంటుంది. ముందునుంచి సమూహాలతో మమేకమైన వాడిని కాబట్టి.. నా అనుభవం, జ్ఞాపకం, సహజంగానే జనరలైజ్ అవుతాయి.

ఇక కవిత్వమంటే.. జ్నాపకాలను రికార్డు చేయడానికో, మరెందుకో కాదు.. నా తృష్టిలో కవిత్వం కొత్త తాత్విక కోణాన్ని పరిచయం చేయగలిగాలి. అప్పుడది తప్పకుండా పాఠకుడి మదిలో నిలిచిపోతుంది.

సమకాలీన భారతీయ సాహిత్యంలో తెలుగు సాహిత్యం పాత్ర గురించి..!, ఎందుకనీ మిగతా భాషలతో పోల్చితే తెలుగు అంతగా ఇతర భాషల్లోకి అనువదింపబడట్లేదు?

సమకాలీన భారతీయ సాహిత్యంలో తెలుగు సాహిత్యం పాత్ర చాలానే ఉంది. తెలుగు నేల నుంచి గొప్ప సాహిత్యం పుట్టుకొచ్చింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఉద్యమాల్లో నుంచి అద్భుతమైన సాహిత్యం వచ్చింది. అయితే మీరన్నట్టు.. అనువాదం విషయంలో తెలుగు సాహిత్యం కొంత వెనుకబడే ఉంది. ఇతర భాషల్లో తెలుగు అనువాదాలు చాలా తక్కువగా జరుగుతున్నాయి.

నేననుకుంటాను.. కవిత్వాన్ని ట్రాన్స్ లేట్ చేయడం కన్నా.. ట్రాన్స్ క్రియేట్ చేస్తేనే.. ఇతర భాషలోను అది దాని మూలాలను కోల్పోకుండా ఉంటుందని. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి గొప్ప కవుల కవిత్వం అన్ని భాషల్లోను విశ్వజనీనం కావడానికి ట్రాన్స్ క్రియేషనే కారణమని నేను నమ్ముతా.

సోషల్ మీడియా వచ్చాక.. కొత్త తరం సాహిత్యం ఫేస్ బుక్ లో చాలా వస్తోంది. అయితే సోషల్ మీడియా ద్వారా డెమొక్రటికల్ వాయిస్ కు ఎంత స్పేస్ ఏర్పడిందో.. దాన్ని అణిచేసే శక్తులు కూడా పెరిగాయి.. దీన్నెలా చూడాలి?

సోషల్ మీడియా అనేది బౌండరీస్ ను చెరిపేసింది. సాహిత్య పరంగా 'కవిసంగమం' లాంటి కార్యక్రమాలు ఫేస్ బుక్ వేదిక నుంచే జరుగుతున్నాయంటే.. సాహిత్యానికి ఇదొక మంచి పరిణామమే. ఇక డెమొక్రటికల్ గొంతును అణిచేసే శక్తులను సాహిత్యం ఎప్పటికప్పుడు అంచనా వేస్తుందనేది నా అభిప్రాయం.

అయితే.. ఫేస్ బుక్ సాహిత్యం వల్ల ఏర్పడ్డ ఒక ప్రమాదమేంటంటే.. పోయెమ్ ఆథర్ లెస్ (అనామకం) అయిపోయిన పరిస్థితి. కొన్ని సందర్బాల్లో అసలైన కవి ఐడెంటిఫై అవకపోవచ్చు.

అమెరికాలో ఉంటున్నారు కదా.. అక్కడి కవిత్వంలో ఏం గమనించారు?

అమెరికాలో ఇన్సిడెంట్ రెస్పాండింగ్ పొయెట్రీ ఎక్కువ. సంఘటనల పట్ల స్పందిస్తూ రాసే కవులు చాలా మంది ఉంటారు. నిజానికి నేర్చుకోవాల్సిన అవసరాన్ని నేర్చుకోవాల్సిన అవసరాన్ని ఇక్కడున్నప్పుడు గుర్తించలేదు. అమెరికాకు వెళ్లాకే నేనో లెర్నర్ గా మారాను.

కెరీరిజం.. క్యాపిటలిజం.. ఉద్యోగ రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో ఓ క్యాపిటలిస్ట్ కింద పనిచేసే వ్యక్తిని.. రాజ్యం పోకడలపైనో, సమాజం గురించో ప్రశ్నించే హక్కు లేదనడం ఎంతవరకు కరెక్ట్?

కరెక్ట్ కాదు. కెరీర్ ను తీర్చిదిద్దుకుంటూనే నువ్వు అనుసరించాల్సిన పంథాను నిర్మించుకోవాలి. భుక్తి, భృతి లేకుండా అవి సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో ఏ పెట్టుబడిదారి వ్యక్తి కిందనో పనిచేయక తప్పని పరిస్థితి. అది తప్పు కాదు.. పైగా.. ఆ డబ్బు ప్రజల నుంచే వస్తోందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Interview with Poet Narayanaswamy Venkatayogi

అడగాల్సినవన్నీ.. అడిగామనే అనుకున్న తర్వాత..! 'మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్?'

ఇంకా రాయాలనుకుంటున్నా.. విస్తృతంగా రాయాలి. మార్క్సిజమే ఇండియాకు మార్గం చూపిస్తుందన్న నమ్మకం నాకింకా ఉంది. అన్ లెర్న్ అనే ఓ ప్రాసెస్ నాలో నిరంతరం జరుగుతుంటుంది. మార్క్సిజం ఆలోచనల్లోంచి.. గత, వర్తమానంలోంచి.. ఏదైతే తప్పుగా తోస్తుందో దాన్ని పక్కనబెట్టేసే అన్ లెర్న్ ప్రాసెస్.

ఇక మార్క్సిజం అనేది ఓ శిలాసదృశ్యం కాదు, రాతి మీద చెక్కబడిన శాసనం కాదు. మార్క్స్ ఆ రోజు చూసిన పద్ధతి ఒక్కటే. మార్క్సిజాన్ని భారతదేశానికి అప్లై చేయాలి. ఉపరితలం పూర్తిగా పునాది నుంచే ఏర్పడుతుంది. పునాదిని కూడా ఉపరితలం ప్రబావితం చేస్తుంది. రాజ్యం ఉపరితలంలో ఆధిపత్యం చెలాయిస్తుంది. పరస్పర ప్రభావితాలు.. రెండింటి మధ్య డైలెక్టికల్ (గతి తార్కిక) సంబంధం ముఖ్యం.

-ఇంటర్వ్యూ అయిపోయాక.. నిజంగా ఏదో లైబ్రరీలో గంటల తరబడి పుస్తకాలు తిరగేసిన ఫీల్. ఆయన లేచి నిలుచున్నారు.. అందరికీ 'బై' చెప్పబోతూ..! ఏదో విషయాన్ని గుర్తుకు తెచ్చుకుని.. అందరికీ మరో విషయం చెప్పాలన్నారు..

ట్రంప్ అనే ఓ భయంకర ఆలోచనలున్న నరరూప రాక్షసుడు ఈరోజు అమెరికా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రతీ దేశానికి ట్రంప్ ఎన్నిక ఏమాత్రం క్షేమకరం కాదు. కాబట్టి అలాంటి శక్తులు నశించాలనే మనమంతా కోరుకుందాం.

చివరిగా.. మా ప్రతాప్ రెడ్డి సార్ ఆయన్నో ప్రశ్న వేశారు. ఇప్పటిదాకా వేసిన ప్రశ్నలన్ని ఒకెత్తయితే, ఇదొక ఎత్తు.. నారాయణ స్వామిని సూటిగా అడిగారు.. 'వానొస్తదని మీరు నమ్ముతున్నారా?' అని.

వస్తుందనే అనుకుంటున్నా.. ఆ నమ్మకముంది.. (నారాయణ స్వామిలో ఆశాజనకంగా.. ఓ చిన్న నవ్వు)

కొసమెరుపు : ఇంటర్వ్యూ తర్వాత ఓ మంచి టీ తాగాలని బయటకొచ్చిన మా అందరిని యాథృచ్చికంగా వాన తడిపేసింది. బహుశా.. నారాయణ స్వామి కల సాకారమవుతుందనడానికి ఇదో సంకేతమేమో అనిపించింది.

Interview by : శ్రీనివాస్ సాహి, నరేష్కుమార్ ఎస్

English summary
Narayanaswamy Venkatayogi.. He is a poet, recently published his Third poetry book 'vaanostada'. Its about his poetry journey..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X