బూటు దెబ్బ కవిత

బూటునిప్పుడు కాలం ఆయుధంగా ప్రకటిస్తోంది
ఆఫ్టరాల్ మనిషి కాలి కింద నలిగేది..
మట్టి మీదో... మలినాల మీదో సంచరించేది..
రోడ్డుతోనో మొజాయిక్ కార్పెట్‌తోనో సావాసం చేసేది
ఇరాక్‌దా, ఇండియాదా
ఏదైనా... జూతా ఇప్పుడు తిరుగుబాటు చరిత్రలో
తన ఖాతా తెరిచింది
ఇక షూ మార్టులన్నీ
మారణాయుధాల షోరూముల్లా కనబడుతున్నాయి
బూట్లు వేసుకుని పరుగులు తీస్తున్న పిల్లలంతా
పుస్తకాలు మోస్తున్న క్షిపణుల్లా కనిపిస్తున్నారు
ఏ నరమేధంలోనో బైలే పోయిన నిస్సహాయులు
కనపడని లోకాల నుండి
కసిగా విసురుతున్న బూట్లలా
రాత్రి ఆకాశంలో చుక్కలు ఏదో హెచ్చరిస్తున్నాయి
ఏ ఊచకోతలోనో ప్రవహించిన అభాగ్యుల నెత్తురంతా
ప్రతీకారేచ్ఛతో ఒక చోట గడ్డ కట్టినట్టు
పగటిపూట సూర్యుడు మండే బూటై
నింగికి వేలాడుతున్నాడు
బూటంటే పాదరక్ష మాత్రమే కాదు
బూటంటే గాల్లో తిరుగుతున్న దిక్కులేని ఆత్మల
తరతరాల కక్షగా...
మానవ మృగాలకు కాలం వేసే శిక్షగా...
ఇప్పుడు అర్థమవుతోంది
బిగిసిన పిడికిలా... ఎగిసిన కెరటంలా...
అడుగు నిడివిలో నిపురు కప్పిన నిప్పులా అనిపిస్తోంది
వంద ఆటంబాంబుల విస్ఫోటనం
ఒక్క బూటు దెబ్బగా వినిపిస్తోంది
మొన్న బుష్... నిన్ టైట్లర్... రేవు మరో హిట్లర్ కావచ్చు
పంజాబ్ ఆక్రోశమో... గుజరాత్ ఆక్రందనో...
ఇరాక్ విలాపమో...
లక్షల కోట్ల బూట్లై కుండపోతగా కురుస్తూనే ఉంటాయి
అవును కుక్కల మీద చెప్పులే పడుతాయి...
క్రూరుల మీద బూట్లే కురుస్తాయి
బూటంటే ఇప్పుడు కాళ్లకు కాపలా కాదు...
ధర్మాగ్రహానికి అగ్ని దర్పణం
అణ్వాయుధాల కోసం ఇక కోట్లు అఖ్కర్లేదు.
ఒక్క బూటు చాలు.
- ప్రసాదమూర్తి
(తన జాతి ఆగ్రహాన్ని బూటుదెబ్బగా ప్రదర్శించిన సిక్కు జర్నలిస్టు మద్దతుగా)












Click it and Unblock the Notifications