వర్షం పడ్డ సాయంత్రం

ఒక్కసారి నల్ల మబ్బు నీటి బరువుతో నేలమీదకి వొంగి పలకరించే సమయంలో కాలిబాటలో ఇల్లు చేరాలన్న యత్నం నాది. క్రమేపీ వెలుగును మింగేస్తూ మేఘాలన్నీ వూసులాడుతూ దిగుతూంటాయి! చడీ చప్పుడూ లేని దారంట దూరంగా వర్షం హోరు క్రమేపీ దగ్గరకొస్తూంది. నేనలా వెళుతూ, ఆ మబ్బు మాటలు వినాలన్న ధ్యాసలో ఇంటిదారి తప్పిస్తాయి.
చీకటి తెరలాక్కుంటూ నేలమీది ప్రతి చెట్టూ చేమా ఇట్టూ వాకిలి. కాస్తంత గాలి తెరల స్నేహం చేసుకుని జల్లు చుట్ట్టేసింది. ఆ ఆనందమే వేరు. లోకంలో ఒక్కడినే వున్నాన్న భావన. కుట్రలు, కుతంత్రాలు, గాయాలు, బాధలు, హేళనల, సమస్తం ఎటుపోయాయో!
ఎవరో పిల్లాడు.. అలా మట్టిలో ఆడుతూనే వున్నాడు. ఆకాశం ఉరిమి వాడిని అమాంతం భయపెట్టింది. ఆకాశం చీలేలా ఒక్కసారి గొంతు చించుకున్నాడు తన పొరపాటు తెలుసుకుని జల్లు కాస్తా జడివానై పిల్లాడి వొళ్లంతా తడిపి చక్కిలిగిలి పెట్టి తన వైపు చూసేలా చేసింది! ఎంత స్నేహం, ఎంత అభిమానం!
వాళ్లిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలీదు. పిల్లాడు మాత్రం సంతోషంతో చేతులు ఆడిస్తున్నాడు. పైకి చూస్తున్నాడు. కేరింతలు కొడుతున్నాడు. చాలా సేపటికి వాళ్లమ్మ పరుగు పరుగున వచ్చింది. కొంగు తలపై కప్పుకుని. కానీ పిల్లాడికి తాను తడుస్తున్నానన్నదానికంటే ఆడుకుంటున్నానన్న ఆనందమే ముంచెత్తింది. కానీ తల్లి ఆమాంతం వాడిని ఎత్తుకుని అనాదిగా దూరమైనంత బాధను కన్నీళ్లతో చెబుతూ బురదను వాననీటితో తుడిచి ముద్దాడి తీసికెళ్లింది!
క్షణం తర్వాత నేను దారి మర్చిన సంగతి గుర్తొచ్చి వెనుతిరిగాను. నన్ను వెంటాడుతూ ఈదురుగాలితో వర్షం..!!
- టి. లలితాప్రసాద్












Click it and Unblock the Notifications