కవిస్వరం: వర్మ కవిత 'ధన్యోస్మి'
వర్మ కవిత ఓ పురాజ్ఞాపకాన్ని తట్టి లేపింది. వానను ఆసరా చేసుకుని ఆయన చిన్ననాటి జ్ఞపకాలను గుర్తు చేశాడు. వానకు ధన్యోస్మి చెబుతున్న వర్మ కవిత్వానికి పాఠకులు ధన్యోస్మి అనాలి. బహుశా ఈ తరం కవులకు ఆయన చివరి వాక్యాలు అర్థమై ఉండకపోవచ్చు. వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందా అనే సందేహం రావచ్చు. కానీ, అవసరమే అవుతాయి.
దాని గురించి చెప్పే ముందు, కవిత గురించి కాస్తా మాట్లాడుకుందాం. వాన ధారలు ఆకాశం మీంచి నేల మీదికి దారం పోగులా జారిపడినట్లు కవితా నిర్మాణం ఉంది. ధూళి కణం సోకితే తప్ప మేఘం వర్షించదు. ఇది శాస్త్రీయమైన విషయం. దాన్ని "భూఆకాశాల నడుమ దూరం/ కొలవాలనే చూస్తుంది" అనే అమూర్త అభివ్యక్తి ద్వారా మూర్తమైన విషయాన్ని చిత్రిక కట్టాడు కవి.
నేను ముందు ప్రస్తావించిన విషయం - "చిట్టి చేతులు సాగనంపిన/ కాగిత పడవ/ ఆత్మకథగా మారి/ మురుగు కాల్వ ముఖ ద్వారం వద్ద/ సుడిగుండంలో చిక్కుకుంది" అనే స్టాంజా వద్ద ప్రారంభమవుతుంది. బాల్యంలో వర్షం పడి వరదలు వస్తున్నప్పుడు పిల్లలకు అత్యద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన వినోదనం కాగితప్పడవలు చేసి, వాటిలోకి వదలడం. ఆ బాల్యపు అనుభవాలు ఈ తరానికి తెలియకపోవచ్చు.

వాన తడిసిన తర్వాత పిల్లలు చేసే నిర్మాణాత్మకమైన పనిని వ్యక్తీకరించాడు వర్మ. కాగితాలను రీసైక్లింగ్ చేసి వాడుకునే పద్ధతి ఇది. పాత నోట్ బుక్స్, అంటే కింది క్లాసులో నోట్స్ రాసిన తర్వాత మిగిలే నోట్ బుక్స్ అన్న మాట. వాటిని వానలో తడిపితే సిరా కొట్టుకుపోతుంది. ఆ కాగితాలను ఎండబెట్టి ఓ నోట్ బుక్కులా కుట్టుకుని చిత్తు పుస్తకంగా వాడడం ఉండేది. ఇప్పుడు, ప్రతి దాన్నీ పారేయడమే కదా. బాల్ పెన్ను వచ్చిన తర్వాత సిరాను నీళ్లతో కడిగేయడం కుదరడం లేదు. ఆ బాల్యపు జ్ఞాపకాలను గుర్తు చేసిన వర్మకు ధన్యోస్మి.
- కాసుల ప్రతాపరెడ్డి
దూళి కణం సోలక
మేఘం తచ్చాడుతూ...
వాన
ఎన్నాళ్ళుగానో
భూఆకాశాల నడుమ దూరం
కొలవాలనే చూస్తోంది.
కమతం కాలుష్యం ముందు
ఓటమికి పెరిగినట్టు,
వేడిగాలులు ఆకాశం నిండా
ఆవరించి,
రుతుపవనాలు అపసవ్య
ద్రోణులై కురుస్తాయి.
చిట్టి చేతులు సాగనంపిన
కాగితపడవ
ఆత్మకథగా మారి
మురుగుకాల్వ ముఖద్వారం వద్ద
సుడిగుడంలో చిక్కుకుంది.
వాన వదలలేక
వెళ్ళలేక
ఎండకి వాయనం ఇచ్చింది.
ఇక మిగిలిందల్లా
తడిసిన పేజీలు ఆరబెట్టి
చిత్తు పుస్తకం కుట్టుకోవడమే....
- కె.ఎన్.వి.ఎం.వర్మ
20.09.2014












Click it and Unblock the Notifications