కవిస్వరం: మూసి వెయబడే డైరీ నుంచి

ఈ తరం కవులకు సంబంధించి నరేష్ కుమార్ ఆశను పెంచుతున్నాడు. కవిత్వం అంటే ఏమిటో పట్టుకున్న ఈ తరం కవుల్లో అతను ప్రధానంగా కనిపిస్తాడు. మూసి వేయబడే డైరీ నుంచి అనే నరేష్ కుమార్ కవిత "దిగులు/ దిగులుగా దిగులుగా దిగులు/ ఎందుకా/ ఎందుకో చెప్పే వీలుంటే దిగులెందుకు" అన్న రేవతీదేవి కవితాపాదాలను గుర్తుకు తెచ్చింది.

"రోజూ అలా ఎదుర్చూస్తూంటాన్నేను ఎవరికోసమూ కాదుగానీ/ ఊరికే ఎదుర్చూడటం కోసమే ఎదురుచూస్తూంటాను కాబోలు" అనే కవితాపాదాల కారణంగా కావచ్చు, రేవతీదేవి కవితాపాదాలు గుర్తుకు రావడం. నిజంగానే చాలాసార్లు జీవితంలో దిగులు, నిస్పృహ అలుముకుంటాయి. ఎందుకో కూడా అర్థం కాదు. అది దేనికోసమో ఎదురు చూస్తున్న దిగులు. ఆ దిగులుతో ఎదురుచూసే తత్వాన్నే నరేష్ కుమార్ తన కవితలో పొందుపరిచినట్లు అనిపిస్తోంది.

భౌతిక ప్రపంచంతో మమేకం కాలేక, భౌతిక ప్రపంచంలోని అసంబద్ధత కవిని ఆ వైపు తీసుకుని వెళ్లినట్లు కనిపిస్తోంది. దూరం నుంచి ఓ విషాదమోహనమైన, మాధుర్యమైన పాట వింటున్న అనుభూతిని నరేష్ కుమార్ పొందుతూనే తన కవిత ద్వారా పాఠకులకు అందించాడు. దూరం నుంచి పాటను మోసుకుని వస్తున్న గాలిలా నరేష్ కుమార్ కవిత మన గుండెలను తాకుతుంది. చివరగా, ఓ విషాదమోహన పారవశ్యాన్ని కలిగించి వదిలేస్తుంది. ఎవరి కోసమైతే మనం ఎదురు చూస్తున్నామో, వారు గుర్తించలేకపోవడంలోని విషాదం కూడా ఈ కవితలో ఉంది. అయితే, మానవ ప్రపంచం హృదయ స్పందనలను గుర్తించలేని స్థితిని కూడా ఈ కవిత అనుభూతిస్తుంది.

మొత్తంగా ఓ మంచి కవితను నరేష్ కుమార్ అందించాడు. ఈ కవితలోని పదబంధాలు విరిచి సాధారణ పదబంధాలను ఏర్పాటు చేయవచ్చు కానీ కవి వాటిని మరో ఉద్దేశంతో అలా చేసి ఉండవచ్చునని వదిలేస్తున్నాను. సూర్యుడ్చచ్చిపోయాక, పెదాల్తెర్చుకుని, కిషోర్కుమార్లా లంటి పదాలను విడదీయవచ్చు. కానీ వాటిని విడదీయడం కవికే కాదు, నాకు కూడా ఇష్టం లేకపోయింది. కానిద్దాం.... ఇదో ప్రయోగంగానే....

- కాసుల ప్రతాపరెడ్డి

Kavisngamam poet: Naresh Kumar

రోజూ అలా ఎదుర్చూస్తూంటాన్నేను ఎవరికోసమూ కాదుగానీ
ఊరికే ఎదుర్చూడటం కోసమే ఎదురుచూస్తూంటాను కాబోలు
తెలిసినా చెప్పటమిస్టంలేకనో కానీ
మౌనంగా వొంటరిగా.....
సాయంత్రం ఊరిచివర్చెరువులో సూర్యుడ్చచ్చిపోయాక అలా ఒంటరి బెంచీమీద కూర్చుని చీకట్లోకి చూస్తూంటాను
కొన్ని నిశ్శబ్దాల్ని వింటూ కూర్చుంటానంతే

ఆ చీకట్లోనే ఓ పావురమ్ము తో రమ్మించుకున్నాక
అపుడు నెమ్మదిగా ఒకపురాతన రాగం
పెదాల్తెర్చుకుని కాస్తపొగతో కల్సి.....
ఏ రాగమిది?
దర్ద్ భరా ఏ గీత్ కహాసే ఇన్ హోటోం పే ఆయే*
ఏడుస్తూనే
కిషోర్కుమార్లా ప్రశ్నించుకుంటూనే మళ్ళీ ఎదుర్చూపు
నుసిగా శరీరం నిండుగా రాలిన మంచు బిందువుల్ని
ఒక్క పాటతో తుడిచెళ్ళిపోతాడు
నేపాలీ రాంసింగ్ ప్రపంచానికి గూర్ఖా అనే పేరులా
కనిపించే రాం సింగ్

కొన్ని కుక్కలూ భయంగా ఇంకొందరు మనుషులు అనుమానంగా
చూస్తూ వెళ్ళి పోతూంటారు
కొన్ని గాజులు విరిగిన చప్పుళ్ళు రేపు ఉడకబోయే
అన్నమ్మెతుకుల్లా చెవుల్ని స్పర్షించి వెళ్ళి పోతాయ్
అసయమే లేని చీకటి
భయం పుట్టిస్తూనె అందరికీ అవసరమయ్యే దేవుళ్ళాంటి చీకటిని కప్పుకొని
కూర్చున్న నాముందు
వచ్చాగిన బస్సులోంచి లేడీ కండక్టర్కేక
వస్తున్నారా..!
హా..! ఇంకో పదేళ్ళ తర్వాత" చెప్తాన్నేను
రోజూ లానే ఒక గుప్పెడు వెన్నెలని నవ్వులా
తనవిరిగిన పళ్ళ నోట్లోంచి నా మీద చల్లి వెల్లిపోతుందామే
బస్సుని తీస్కొని
సూర్యుడొచ్చే సమయం దగ్గిరపడ్తూండగా
భయంతో నేనూ బయల్దేరబోతూంటే
వచ్చేస్తుంది "తను". వెళ్ళిపోయినాబస్సులోంచి
దిగి వస్తుందికదా
నా ఎదుర్చ్హుపీమె కోసమా?
నేను ప్రశ్నిచుకుటూండగానే
ఎవరికోసం ఇలా రోజూ? రోజూ లానే అడుగుతుంది తను
చిర్నవ్వుకుంటూ వెళ్ళిపోతాన్నేను

బహుశా నేను సమాధానం చెప్పినరోజునర్రోజు
రాత్రి ఆమె తన డైరీలా ఇలా రాసుకుంటుంది..
"పాపం ఆ నల్లని మనిషి ఆ ఎదుర్చ్హుపుల
మనిషి మనుషులంటే భయపడుతూ మల్లీ చీకట్లోనే మనుషుల్ని వెతికే మనిషు మరణించాడూ"అని
ఆమే ఆరోజునుంచీ ఇక డైరీ తెరవనే తెరవదు

- నరేష్ కుమార్

(కొన్ని రోజుల అస్పష్ట జీవితం నుంచి..
*ఒక పాత హిందీ పాటలో లైను)
17/08/14

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+